సిక్కింకు మరిన్ని బలగాలు | Sakshi
Sakshi News home page

సిక్కింకు మరిన్ని బలగాలు

Published Mon, Jul 3 2017 12:30 AM

సిక్కింకు మరిన్ని బలగాలు

► చైనాతో కొనసాగుతున్న వివాదం
► 1962 తర్వాత ఇదే సుదీర్ఘ ఉద్రిక్తత


న్యూఢిల్లీ:  సిక్కిం సరిహద్దులో ఉద్రిక్తత పెరుగుతోంది. చైనాతో వివాదం నేపథ్యంలో భారత ఆర్మీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి డోకా లా ప్రాంతానికి మరిన్ని బలగాలను పంపింది. అయితే ఇవి కాల్పులు జరపవని, తుపాకీ గొట్టాలను కిందికి దించి ఉంచుతాయని అధికార వర్గాలు చెప్పాయి. చైనాతో 1962నాటి యుద్ధం తర్వాత ఇరు దేశాల ఆర్మీల మధ్య నెలకుపైగా సుదీర్ఘ ఉద్రికత్త కొనసాగడం ఇదే తొలిసారి. 2013లో జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌ డివిజన్‌ దౌలత్‌ బేగ్‌ ఓల్దీలోకి చైనా జవాన్లు చొచ్చుకురావడంతో 21 రోజులపాటు ఉద్రిక్తత కొనసాగింది. సిక్కిం సెక్టార్‌లోని చుంబీ లోయ పరిధిలోకి వచ్చే డోకా లా ప్రాంతంలోని భారత బంకర్లను చైనా ఇటీవల ధ్వంసం చేయడంతో ఘర్షణ తలెత్తడం తెలిసిందే.

ఈ వివాదంపై అధికార వర్గాలు తొలిసారి పూర్తి వివరాలను అందించాయి. ఆ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. భారత్‌–భూటాన్‌–టిబెట్‌ కూడలిలోని డోకా లా ప్రాంతం లాల్తెన్‌లో ఉన్న రెండు భారత బంకర్లను తొలగించాలని చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) జూన్‌ 1న భారత ఆర్మీకి చెప్పింది. దీనిపై భారత జవాన్లు ఉత్తర బెంగాల్లోని తమ హెడ్‌క్వార్టర్స్‌కు సమాచారం అందించారు. అయితే జూన్‌ 6న రాత్రిపూట రెండు చైనా బుల్డోజర్లు ఆ బంకర్లను ధ్వంసం చేశాయి. డోకా లా తమదేనని, భారత్, భూటాన్‌లకు దీనిపై హక్కులేదని ప్రకటించాయి. చైనా జవాన్లు, యంత్రాలు మరింత నష్టం కలిగించకుండా భారత బలగాలు అడ్డుకున్నాయి. సమీపంలోని తమ బలగాలనూ పిలిపించుకున్నాయి. దీంతో జూన్‌ 8న ఘర్షణ తలెత్తి, ఇరు పక్షాల సైనికులు స్వల్పంగా గాయపడ్డారు.

తర్వాత జరిగిన ఫ్లాగ్‌ మీటింగ్‌లో లాల్తెన్‌ నుంచి జవాన్లను వెనక్కి పంపాలని చైనా భారత్‌కు స్పష్టం చేసింది. భారత జవాన్లు తాము నిర్మిస్తున్న రోడ్డు పనులను అడ్డుకున్నారని ఆరోపించింది. మానస సరోవర్‌ యాత్రకు వెళ్తున్న తొలి బృందంలోని 47 మంది యాత్రికులను అడ్డుకుని, మరో బృందంలోని 50 మంది వీసాలను రద్దు చేసింది. తర్వాత పీఎల్‌ఏ అదనపు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో భారత ఆర్మీ కూడా మరిన్ని బలగాలను అక్కడికి తరలించింది. చైనా జవాన్లు డోకా లాలోకి 2008లో కూడా చొరబడి భారత ఆర్మీ బంకర్లను ధ్వంసం చేశారు. చుంబీ లోయపై ఆధిపత్యం కోసం చైనా యత్నిస్తోందని, భారత్‌–భూటాన్‌ సరిహద్దుపై గరిష్ట నిఘా కోరుకుంటోందని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.

‘చొరబాటు మ్యాపు’
డోకా లా ప్రాంతంలోకి భారత జవాన్లు చొచ్చుకు వచ్చిన వివరాలని పేర్కొంటూ చైనా విదేశాంగ శాఖ ఓ మ్యాపును విడుదల చేసింది. తమ రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవడానికి భారత జవాన్లు చొరబడ్డారని ఆరోపించింది. ఈ మ్యాపులో డోకా లాను చైనాలో అంతర్భాగంగా చూపారు. భారత జవాన్లు తమ భూభాగంలోకి వచ్చినప్పుడు తీసినవిగా పేర్కొంటూ చైనా గురువారం రెండు ఫొటోలను విడుదల చేసింది. ఉద్రిక్తతకు ముగింపు పలికేందుకు భారత్‌ తమ జవాన్లను డోలా కా నుంచి ఉపసంహరించుకోవాలని చైనా వార్తాసంస్థ జినువా పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని అడ్డుకోవద్దని చెప్పుకొచ్చింది. చైనా–పాకిస్తాన్‌ ఆర్థిక కారిడార్‌పై భారత్‌ ‘వ్యూహాత్మక ఆందోళన’ను పక్కనపెట్టి వన్‌ బెల్ట్‌–వన్‌ రోడ్‌ ప్రాజెక్టులో చేరాలని  సూచించింది.

చైనాతో గొడవేంటి..?
భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డోకా లా ప్రాంతంలో ఇరు దేశాలు భారీగా బలగాల్ని మోహరించి ఢీ అంటే ఢీ అంటున్నాయి. డోకా లాలోని భూటాన్‌ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణంతో గొడవ మొదలైంది. భూటాన్‌కు మద్దతుగా భారత్‌ బలగాలు రంగంలోకి దిగడం చైనాకు కోపం తెప్పించింది.

నాటి యుద్ధాన్ని గుర్తు చేసుకోవాలని భారత్‌ను చైనా హెచ్చరించగా.. భారత్‌ అప్పటి దేశం కాదని రక్షణ శాఖ మంత్రి జైట్లీ దీటుగా బదులిచ్చారు. మరోవైపు సరిహద్దుల్లో చైనా యుద్ధ ట్యాంకుల్ని మోహరించడంతో.. భారత ఆర్మీ చీఫ్‌ స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతలకు సంబంధించిన వివరాలివి...

భారత్, చైనా, భూటాన్‌ ఉమ్మడి సరిహద్దుల్లోని కీలక భూభాగమే డోకా లా.. సిక్కిం వైపున ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో కీలకం. అయితే ఇక్కడ భూటాన్‌ అధీనంలో ఉన్న ప్రాంతంలో తేలికపాటి యుద్ధ ట్యాంకులు, పరికరాల్ని మోసుకెళ్లేలా చైనా రోడ్డు నిర్మాణం కొనసాగిస్తోంది. పాత ఒప్పందాల్ని గౌరవించాలని, రోడ్డు నిర్మాణం నిలిపివేయాలని రాయల్‌ భూటాన్‌ సైన్యం కోరినా చైనా వినిపించుకోలేదు. రోడ్డు నిర్మాణం పూర్తయితే.. ఈశాన్య భారతంతో మిగతా దేశాన్ని కలిపే బెంగాల్లోని సన్నని కోడి మెడ ప్రాంతం(చికెన్‌ నెక్‌) చేరుకునేందుకు చైనాకు వీలవుతుంది. దేశ భద్రత పరంగా ఈ నిర్మాణాన్ని ముప్పుగా భావిస్తోన్న భారత్‌ వెంటనే రంగంలోకి దిగింది.

భూటాన్‌కు మద్దతుగా తన సైన్యాన్ని ఆ ప్రాంతంలో మోహరించి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంది.  ప్రతీకారంగా భారత బంకర్లను పీఎల్‌ఏ ధ్వంసం చేసింది. ఇండియా, చైనా దళాల కమాండర్లు చర్చలు జరిపినా ఉద్రిక్తతలు తగ్గలేదు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ప్రకటనల యుద్ధం కొనసాగుతోంది. తమ భూభాగంలోకి భారత్‌ బలగాలు ప్రవేశించాయంటూ చైనా నిరసన తెలపడంతో పాటు.. గత వివాదాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని గత సోమవారం చైనా హెచ్చరించింది. ఇదే సమయంలో భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ గురువారం సిక్కిం వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. చైనా దూకుడు ప్రదర్శిస్తే ఎలా బదులివ్వాలన్న అంశంపై ఆర్మీ జనరల్స్‌ తో చర్చలు కొనసాగించారు.

భారత్‌పై ఆగ్రహంతో కైలాస మానస సరోవర్‌ యాత్రకు పోయే నాథూ లా మార్గాన్ని మూసివేస్తున్నట్టు చైనా ప్రకటించింది.హిమాలయ రాజ్యమైన భూటాన్‌కు భారత్‌ అత్యంత సన్నిహిత మిత్రదేశం. ఆ కారణంగా భూటాన్‌కు చైనాతో దౌత్య సంబంధాలు లేవు. ఆ దేశ రక్షణ బాధ్యత మొత్తం భారత్‌దే. ఆ క్రమంలోనే చైనా దూకుడును అడ్డుకునేందుకు భారత బలగా లు రంగప్రవేశం చేశాయి. 2013, 2014లో కూడా చైనా దళాలు పశ్చిమ సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు పాల్పడినప్పుడు భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.  

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement
Advertisement