చైనా కారణంగానే భారత్‌కు వరదలు.. ఎలా? | Sakshi
Sakshi News home page

చైనా కారణంగానే భారత్‌కు వరదలు.. ఎలా?

Published Mon, Sep 18 2017 6:25 PM

చైనా కారణంగానే భారత్‌కు వరదలు.. ఎలా?

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అస్సాం, బీహార్‌ రాష్ట్రాలను ఇటీవల వరదలు ముంచెత్తడం, అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడానికి చైనానే కారణమా? చైనా, భారత దేశాల మధ్య 2013లో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది మే 15వ తేదీ నుంచి అక్టోబర్‌ 15వ తేదీ వరకు ఎగువన చైనా భూభాగంలో ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర న దీ జలాలకు సంబంధించిన గణాంకాలను భారత్‌కు విధిగా తెలియజేయాలి. 2016, జూన్‌ నెలలోనే ఈ గణాంకాలను చైనా ప్రభుత్వం నిలిపివేసింది.

బ్రహ్మపుత్ర నదీ గణాంకాలను తెలియజేయాల్సిందిగా భారత ప్రభుత్వం కోరగా, టిబెట్‌లోని తమ జలాల సంబంధిత స్టేసన్‌ను ఆధునికరిస్తున్నామని, ఈ కారణంగా తమ వద్ద నదీ జలాల గణాంకాలు అందుబాటులో లేవని చైనా ప్రభుత్వం తెలియజేసిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి రవీష్‌ కుమార్‌ తెలిపారు. ఈ వివరాలు తమకు అంది ఉన్నట్లయితే అస్సాం, బీహార్‌ రాష్ట్రాలకు ముందే వరదల ముప్పును ఊహించే వారమని, నష్ట నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల డోక్లామ్‌లో ఇరు దేశాల మధ్య ఏర్పడిన సైనిక ప్రతిష్టంభనకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని ఆయన సమాధానం ఇచ్చారు.

స్టేషన్‌ ఆధునీకరణ పేరిట బ్రహ్మపుత్రా నదీ గణాంకాలను మనకు ఇవ్వని చైనా ప్రభుత్వం, పొరుగునున్న బంగ్లాదేశ్‌కు మాత్రం యథాతధంగా ఇస్తున్నట్లు బంగ్లాదేశ్‌ సంయుక్త జలాల కమిషన్‌ సభ్యుడు మొఫాజల్‌ హొస్సేన్‌ తెలిపారు. బ్రహ్మపుత్ర నీటి మట్టం వివరాలను మొన్నంటే మొన్న కూడా తమకు చైనా నుంచి అందాయని ఆయన చెప్పారు. 2002 సంవత్సరం నుంచి టిబెట్‌లోని మూడు చైనా జల సంబంధిత స్టేషన్ల నుంచి క్రమం తప్పకుండా తమకు డేటా అందుతోందని ఆయన తెలిపారు. ఈ విషయాలను చైనా విదేశాంగ శాఖ కార్యాలయం అధికార ప్రతినిథి జెంగ్‌ షూహాంగ్‌ కూడా ధ్రువీకరించారు. మరి భారత్‌కు ఎందుకు వివరాలు అందజేయడం లేదో చైనా నుంచి స్పష్టత లేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement