భారతదేశానికీ 'ఇబోలా' ముప్పు!! | Sakshi
Sakshi News home page

భారతదేశానికీ 'ఇబోలా' ముప్పు!!

Published Thu, Aug 7 2014 11:00 AM

భారతదేశానికీ 'ఇబోలా' ముప్పు!! - Sakshi

ఇబోలా.. పశ్చిమాఫ్రికాలో విపరీతంగా వ్యాపించిన ఈ వైరస్ కేవలం కొన్ని వారాల్లోనే 900కు పైగా ప్రాణాలు బలిగింది. ఇప్పటివరకు అయితే ఇది కేవలం లైబీరియా, గినియా, సియెర్రా లియోన్, నైజీరియా దేశాలకు మాత్రమే పరిమితమైంది. అయితే.. మన దేశానికి కూడా ఇది ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఎందుకంటే, ఇబోలా వైరస్ వ్యాపించిన దేశాల్లో దాదాపు 45వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అక్కడ పరిస్థితి మరీ విషమిస్తే వీరందరినీ వీలైనంత త్వరగా వెనక్కి రప్పించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పార్లమెంటులో తెలిపారు.

గినియాలో 500 మంది, లైబీరియాలో 3వేల మంది, సియెర్రా లియోన్లో 1200మంది భారతీయులున్నారు. నైజీరియాలో అయితే ఏకంగా 40 వేల మంది భారతీయులు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా 300 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది లైబీరియాలో పనిచేస్తున్నారు. ఇప్పటికే 1603 మందికి ఇబోలా వైరస్ సోకిందని, వారిలో 887 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో భారతీయులకు కూడా పరిస్థితి ప్రమాదకరంగానే కనిపిస్తోంది. భారతీయుల్లో ఎవరికైనా ఈ వైరస్ సోకి.. అది తెలియకుండా వాళ్లు స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తే పరిస్థితి ఏంటని మన అధికారులు ఆందోళన చెందుతున్నారు.

పశ్చిమాఫ్రికాలో చింపాంజీలు, ఇతర జంతువులతో  సన్నిహితంగా ఉన్న వాళ్లలోనే ముందుగా ఈ వైరస్ సోకిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా ఇది చింపాంజీలు, గబ్బిలాల నుంచి మనుషులకు, తర్వతా మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని తెలిపారు. ఈ వైరస్ సోకినవారి చర్మం పక్కవారికి తగిలినా.. వారికి కూడా వచ్చేస్తుందని, వాతావరణం ద్వారా కూడా వ్యాపిస్తుందని హెచ్చరిస్తున్నారు. వీళ్లకు చికిత్స చేస్తున్నవారు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో వాళ్లకు కూడా సోకుతుందని చెబుతున్నారు. ఈ భయంతోనే నైజీరియా లాంటి ప్రాంతాల్లో వైద్యవర్గాలు ఇబోలా బాధితులకు చికిత్స చేయడానికి కూడా వెనకాడుతున్నారు.

ఈ వ్యాధి భారతదేశానికి వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న దేశాల నుంచి ఎవరెవరు భారతదేశానికి వస్తున్నారు, వాళ్ల తుది గమ్యం ఎక్కడ అనే విషయాలను ముందుగానే తెలుసుకుంటోంది. కానీ అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో ఇబోలా బాధితులకు ఉన్న చికిత్స సదుపాయాలు మాత్రం ఇంతవరకు భారత్లో లేవు. అవి కూడా వస్తే తప్ప భారతీయులకు ఈ వైరస్ నుంచి పూర్తి రక్షణ లభించినట్లు చెప్పలేం.

Advertisement
Advertisement