ఇదేంటి చైనా ఇలా చేశావు.. భారత్‌ ఆగ్రహం! | Sakshi
Sakshi News home page

ఇదేంటి చైనా ఇలా చేశావు.. భారత్‌ ఆగ్రహం!

Published Sat, Apr 2 2016 3:59 PM

ఇదేంటి చైనా ఇలా చేశావు.. భారత్‌ ఆగ్రహం!

వాషింగ్టన్‌: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను నిషేధించాలంటూ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన తీర్మానాన్ని చైనా వీటో అధికారంతో తిరస్కరించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాది అయిన అజార్‌ను కాపాడేందుకు చైనా, పాకిస్థాన్‌ ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా ఆరోపించింది. సాంకేతిక కారణాలు చూపుతూ చైనా అసమగ్రంగా వ్యవహరించిందని పేర్కొంది. ఉగ్రవాదం అణచివేతపై ఇలాంటి సంకుచిత దృక్పథాన్ని కనబర్చడం ఏమాత్రం సరికాదని, ఉగ్రవాదాన్ని ఓడించేందుకు అంతర్జాతీయ సమాజం చూపాల్సిన సంకల్పాన్ని ఇది చూపడం లేదని తేల్చిచెప్పింది.

ఐక్యరాజ్యసమితిలో చైనాతో సహా ఐదు అగ్రరాజ్యాలకు మాత్రమే వీటో అధికారం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చలు జరిపిన తర్వాతే భారత్‌కు వ్యతిరేకంగా చైనా ఈ దుందుడుకు చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. జనవరి 2న పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి ఘటనకు సూత్రధారి అయిన మసూద్ అజార్ ప్రమాదకరమైన ఉగ్రవాది అని, అతన్ని నిషేధించకపోవడం వల్ల భారత్‌ ఇప్పటికీ ఉగ్రవాద ముప్పు ఎదుర్కొంటున్నదని కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే చైనా మాత్రం అజార్ ఉగ్రవాది కాదని, అందుకే తాము వీటో ద్వారా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించామని సమర్థించుకుంటోంది.

Advertisement
Advertisement