జనరిక్‌ మందులే రాయాలి! | Sakshi
Sakshi News home page

జనరిక్‌ మందులే రాయాలి!

Published Tue, Apr 18 2017 2:09 AM

జనరిక్‌ మందులే రాయాలి! - Sakshi

వైద్యులంతా అనుసరించేలా త్వరలో నిబంధనలు
► గిరిజనులకు భూ హక్కులివ్వకుండా కాంగ్రెస్‌ మోసం
► ధాన్యం సేకరణ గడువు వారం పెంపు
►  గుజరాత్‌ పర్యటనలో మోదీ  


సూరత్‌/సిల్వాసా: దేశవ్యాప్తంగా డాక్టర్లు.. ప్రజలకు జనరిక్‌ మందులు రాసేలా నిబంధనలు తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పా రు. బ్రాండెడ్‌ మందులతో పోలిస్తే తక్కువ ధరకే దొరికే జనరిక్‌ మందుల వినియోగం పెంచాలన్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో రూ.400 కోట్లతో నిర్మించిన కిరణ్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సోమవారం మోదీ ప్రారంభించారు. ‘పేదల ఆరోగ్యం మెరుగుపరిచే విషయంలో ధనికులు తమవంతు పాత్ర పోషించాలి. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌లోని చేతిరాత అర్థం కాక పేదలు ప్రైవేటు మెడికల్‌ దుకాణాల్లో వెళ్లి ఖరీదైన మందులు కొనాల్సి వస్తోంది. డాక్టర్లు తమ ప్రిస్క్రిప్షన్‌లో తప్పనిసరిగా జనరిక్‌ మందులే వాడాలని సూచించేలా నిబంధనలు తెస్తాం.

మన దేశంలో వైద్యులు తక్కువ, ఆసుపత్రులు తక్కువ. కానీ మందుల ధరలు మాత్రం చాలా ఎక్కువ’ అని ప్రధాని అన్నారు. తమ ప్రభుత్వం 15 ఏళ్ల తర్వాత జాతీయ ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చి స్టెంట్లు, మందుల ధరలను నియంత్రిస్తే.. కొన్ని ఫార్మాకంపెనీలకు చాలా కోపం వచ్చిందన్నారు. దాదాపు 700 మందుల ధరలను పేదలకు అందుబాటులో ఉండేలా నియంత్రించినట్లు మోదీ గుర్తుచేశారు. తక్కువధరకే ప్రజలకు వైద్య సేవలందించటం ప్రభుత్వ బాధ్యత అని మోదీ తెలిపారు. ‘సేవా పరమో ధర్మ’ భారతీయుల నినాదమన్నారు. అయితే రోగాలు రాకుండా ఉండేందుకు ప్రజలు ఎక్కువ శ్రద్ధ చూపించాలని.. స్వచ్ఛంగా ఉండటంతోపాటు యోగా చేయటం ద్వారా అనారోగ్యం పాలవకుండా కాపాడుకోవచ్చని సూచించారు.

ధాన్యం సేకరణ గడువు పెంపు
దేశవ్యాప్తంగా రైతులకు భారీ ఊరటనిచ్చేలా.. ధాన్యం సేకరణ గడువును పెంచుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ గడువును మరో వారం రోజులు పెంచుతున్నట్లు తెలిపారు. బాజీపురలో సూరత్‌ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల ఫీడ్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ.. కందిపప్పు ఉత్పత్తి పెరిగేందుకు మరింత ప్రయత్నం చేయాలన్న తన విన్నపాన్ని అంగీకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘గతేడాది రుతుపవనాలు ఆలస్యం కావటంతో పంట ఆలస్యమైంది. అందుకే తొలిసారిగా కనీస మద్దతు ధరకే ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించాం. ఇటీవలే కొందరు రైతులు సేకరణ గడువు పెంచాలని కోరారు. అందుకే దీన్ని వారం రోజులు పెంచుతున్నాం’ అని మోదీ ప్రకటించారు.

రైతులు సౌరవిద్యుత్‌ ప్యానెల్లు, బయోగ్యాస్‌ ప్లాంట్‌లు, తేనె ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేసుకోవాలని ప్రధాని సూచించారు. నవీ పార్డీ గ్రామంలో ఐస్‌క్రీమ్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ.. పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వజ్రాలు, ఆభరణాల రంగంలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దటంలో సూరత్‌ వజ్రాల వ్యాపారులు పనిచేయాలని ప్రధాని కోరారు. సూరత్‌లో వజ్రాల కటింగ్‌ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం వ్యాపారులనుద్దేశించి మోదీ మాట్లాడారు.

కాంగ్రెస్‌చేతిలో మోసపోయారు
కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గిరిజనులకు భూముల కేటాయింపులో గత యూపీఏ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మోదీ విమర్శించారు. నేరుగా కేంద్రం ఆజమాయిషీలో ఉండే కేంద్రపాలిత ప్రాంతాల గిరిజనుల భూముల హక్కుల విషయంలోనూ యూపీఏ సర్కారు తన బాధ్యతను నిర్వహించకపోగా.. రాష్ట్రాలను విమర్శించిందని గుర్తుచేశారు. దాద్రా, నగర్‌ హవేలీలో ఏర్పాటుచేసిన సభలో ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క గిరిజనుడికి కూడా భూమిపై హక్కులు ఇవ్వలేదని తెలిసి ఆశ్చర్యపోయాను అని మోదీ చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

కాన్వాయ్‌ ఆపి.. చిన్నారిని కలిసి
సూరత్‌కు చెందిన నాలుగేళ్ల నాన్సీ అనే చిన్నారి ప్రధాని మోదీకి వీరాభిమాని. టీవీలో మోదీని చూసినపుడల్లా ఉత్సాహంగా ‘మోదీ దాదా’ అంటూ గంతులేస్తుంది. మోదీని కలవాలన్నది ఆమె కల. ప్రధానిని కలవటం కష్టమే.. కానీ ఆమెకు మాత్రం చాలా సులువుగా ప్రధానిని కలిసి మాట్లాడే అవకాశం దక్కింది. సోమవారం సూరత్‌ పర్యటనలో భాగంగా మోదీ ఆసుపత్రి ప్రారంభానికి వెళ్తున్నారు. రోడ్డుకిరువైపులా ప్రజలు నిలబడి మోదీకి స్వాగతం పలుకుతున్నారు.

డైమండ్‌ కట్టర్‌గా పనిచేసే నాన్సీ తండ్రి.. కూతురితో రోడ్డుపక్కన నిలబడ్డారు. కాన్వాయ్‌ వేగంగా సాగుతుండగానే.. తం డ్రి చంక దిగిన నాన్సీ ప్రధాని కారు వైపు పరిగెట్టింది. ఆ చిన్నారిని ఆపేందుకు ఎస్పీజీ కమాండోలు యత్నిస్తుండగానే.. ఆశ్చర్యకరంగా మోదీ తన కాన్వాయ్‌ ఆపారు. ఆమెను కారులోకి తీసుకొని ఆప్యాయంగా పలకరించి ముద్దాడారు.

Advertisement
Advertisement