చర్మం ఒలిచేస్తున్నారు! | Sakshi
Sakshi News home page

చర్మం ఒలిచేస్తున్నారు!

Published Sun, Mar 19 2017 4:25 AM

చర్మం ఒలిచేస్తున్నారు! - Sakshi

నేపాల్‌లో ఒళ్లు గగుర్పొడిచే దందా
కాస్మొటిక్‌ వ్యాపారానికి యువతులు, మహిళల బలి
వేశ్యావాటికలకు తరలిస్తూ అమ్మాయిల చర్మం ఒలుచుకుంటున్న వైనం
మత్తు మందు ఇచ్చి.. మంచానికి కట్టేసి.. తోలు తీసుకుంటున్న దారుణం
భారత్‌లో కాస్మొటిక్‌ ఆపరేషన్ల కోసం తెల్ల చర్మానికి పెరుగుతున్న గిరాకీ
దనవంతుల శరీర సౌష్టవం పెంపు, సౌందర్య శస్త్రచికిత్సలలో వినియోగం
భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి.. మళ్లీ అక్కడ్నుంచి కాస్మొటిక్‌ ఉత్పత్తులుగా దిగుమతి


చర్మం తీసుకునే మహిళకు చెల్లించేది... (రూ.) 5,000 - 10,000
ఏజెంటుకు చెల్లించేది... (రూ.) 30,000 - 50,000


వంద చదరపు అంగుళాలు.. లక్ష రూపాయలు..! ఇది చర్మం విలువ! మనిషి చర్మం. అందునా మహిళ చర్మం.. నేపాలీ మహిళ చర్మం విలువ!! భారత్‌లో ధనవంతుల సౌందర్య శస్త్రచికిత్సలకు, కాలిన గాయాల సర్జరీలకు ఈ చర్మాన్ని ఉపయోగిస్తున్నారు. భారత కాస్మొటిక్‌ సర్జరీ మార్కెట్‌లో చర్మానికి రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. ఆరోగ్యవంతమైన, తెల్లని చర్మం కావాలి. దీంతో నేపాలీ యువతులు, మహిళల చర్మాన్ని నిలువునా ఒలుస్తున్నారు. ఇప్పటికే నేపాలీ యువతులు, మహిళల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వారిని వేశ్యలుగా మారుస్తూ ఇండియా తదితర దక్షిణాసియా దేశాలకు అక్రమ రవాణా చేస్తున్న మాఫియా.. ఇప్పుడు ఈ కొత్త దందాకు వారినే బలిపశువులుగా వాడుకుంటోంది. మహిళల చర్మాన్ని దౌర్జన్యంగా ఒలుచుకుని డబ్బు చేసుకుంటున్నారు. ఒళ్లు గగుర్పొడిపించే ఈ దారుణ దందా గురించి సోమాబసు అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ నేపాల్, భారత్‌లో పర్యటించి పరిశోధించి వెలుగులోకి తీసుకువచ్చారు. తాజాగా ఒక వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఈ పరిశోధనాత్మక కథనంలోని ముఖ్యాంశాలివీ..
- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మాదకద్రవ్యాల మత్తులో ముంచేసి..
ఈ పార్లర్లు, వేశ్యావాటికల్లో విటుల విపరీత పోకడలు, పైశాచిక కోరికలకు ఈ మహిళలు సహకరించడానికి వీలుగా మాదకద్రవ్యాలు, మత్తు మందులు ఇచ్చి వారిని మంచానికి కట్టివేస్తారు. ఆ మత్తు ప్రభావం నుంచి బయటపడి మెలకువ వచ్చేసరికి ఈ మహిళల శరీరాలు గాయాలతో నెత్తురోడుతూ ఉంటాయి. వీపు, పొత్తి కడుపు, తొడలు అన్ని భాగాల్లో చర్మం లేకుండా గాయాలు తేరి ఉంటాయి. దీంతో వారు వెంటనే ప్రాణభయంతో పరుగులు పెడతారు. అవన్నీ విటులు పైశాచిక ఆనందం కోసం చేసిన గాయాలని అనుకుంటారు. తమ ఖర్మకు తమనే నిందించుకుంటూ ఆ వృత్తిలోనే కొనసాగుతారు. కాకపోతే వారికి అంతకుముందు ఉన్నంత డిమాండ్‌ ఉండదు. అయితే వారిలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. వారి శరీరం నుంచి చర్మం వలుచుకున్నారని, నిర్దాక్షిణ్యంగా దోచుకున్నారని, దాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని! తర్వాత తెలిసినా వారు చేయగలిగిందేమీ లేదు.. మౌనంగా రోదించడం తప్ప!!

తెల్ల చర్మానికి గిరాకీ ఎక్కువ
మనుషుల చర్మానికి, ముఖ్యంగా తెల్లని మేనిఛాయ గల మహిళల చర్మానికి చాలా డిమాండ్‌ ఉంది. 100 చదరపు అంగుళాల చర్మపు ముక్కకు ఢిల్లీ, ముంబై నగరాల్లో రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకూ ధర పలుకుతుంది. ఆ చర్మాన్ని చిన్న చిన్న పాథలాజికల్‌ ల్యాబ్‌లకు అమ్ముతారు. అక్కడ చర్మం టిష్యూను శుద్ధి చేసి.. అమెరికాకు జీవ అవయవాలను సరఫరా చేసేందుకు లైసెన్స్‌ ఉన్న పెద్ద ల్యాబ్‌లకు సరఫరా చేస్తారు. అందులో కొన్ని ప్రముఖ ల్యాబ్‌లు కూడా ఉన్నాయి. అమెరికాలో ఈ శుద్ధి చేసిన చర్మాన్ని.. ‘అల్లోడెర్మ్‌’ లేదా అటువంటి ఉత్పత్తులుగా అభివృద్ధి చేస్తారు. తిరిగి ఇతర దేశాలతో పాటు భారత్‌కు ఎగుమతి చేస్తారు. వీటిని పురుషాంగ పరిమాణం పెంపు, మహిళల వక్షోజాల పరిమాణం పెంపు, పెదవులు సరిచేయడం, కాలిన గాయాలను సరిచేయడం వంటి శరీరాకృతి సౌందర్య, సౌష్టవాలను పెంపొందించే కాస్మొటిక్‌ సర్జరీల్లో ఉపయోగిస్తారు. ఈ సర్జరీలకు ఇప్పుడు భారత్‌లో గిరాకీ విపరీతంగా పెరుగుతోంది.

సమ్మతితోనూ చర్మం తీసుకుంటారు
ఈ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. పురుషుల్లో చాలామంది మద్యపానం, ధూమపానం చేస్తుంటారు కాబట్టి.. వారి కన్నా మహిళల చర్మం, కిడ్నీలు ఎక్కువ ఆరోగ్యవంతంగా ఉంటాయి కాబట్టి.. మహిళలనే ఎక్కు వగా ఇందుకోసం ఎంచుకుంటారు. పైగా నేపాలీ మహిళల చర్మం తెల్లగా ఉండటంతో దాన్ని కాకాసియన్‌ జాతి వ్యక్తి చర్మంగా నమ్మించగలగడం వల్ల కూడా వారు ఎక్కువగా బాధితులవుతున్నారు. కొందరు మహిళల నుంచి వారి సమ్మతితోనే చర్మం తీసుకుంటున్నారు. నిజానికి నేపాల్‌లో చాలా మంది పేదరికం, అప్పుల వల్ల కిడ్నీలు, చర్మం అమ్ముకోవడం మామూలుగా మారింది. మానవ అవయవాల విక్రయం నేపాల్‌ చట్ట ప్రకారం నేరం. ఇండియాలో కూడా ఈ క్రయవిక్రయాలు నిషిద్ధం. అయితే.. రిజిస్టర్‌ చేసుకున్న అవయవ దాతల నుంచి మాత్రం అవయవాలను, టిష్యూలను తీసుకోవచ్చు. దీంతో చర్మం తీసుకోవడం కోసం అటు నేపాల్‌లో, ఇటు ఇండియాలో నకిలీ ధ్రువపత్రాలను కూడా తయారు చేస్తున్నారు.

బాధితులకు మిగిలేది శూన్యం
కాస్మొటిక్‌ సర్జరీ కోసం చర్మం కావలసిన వారు ముందుగా ఇండియాలో లేదా నేపాల్‌లో ఒక ఏజెంటును సంప్రదిస్తారు. అవసరమైన చర్మపు రంగు ఫొటో, సదరు వ్యక్తి రక్తపు గ్రూపు వివరాలతో పాటు.. నిజమైన కస్టమరో కాదో నిర్ధా రించుకోవడానికి చికిత్సకు సంబంధించిన పత్రాలు చూపాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో ‘శాంపిల్‌’ చర్మం పంపిస్తారు. అడ్వాన్సుగా కొంత మొత్తం తీసుకుంటారు. ‘‘ఏ మహిళ చర్మం తీసుకుంటారో.. ఆ మహిళకు రూ.5,000 నుంచి రూ. 10,000 చెల్లిస్తారు. ఆ చర్మం శాంపిల్‌ను పంపించిన మొదటి ఏజెంటుకు రూ.30 వేల నుంచి రూ.50 వరకు లభిస్తాయి. ఆ మహిళను భారత్‌-నేపాల్‌ సరిహద్దుల వరకూ తీసుకెళ్తారు. అక్కడ్నుంచి మరో ఏజెంటు వారిని సరిహద్దు దాటించి భారత్‌కు తీసుకెళ్లి మూడో ఏజెంటుకు అప్పగిస్తారు.
ఆ మూడో ఏజెంటు ఆమె నుంచి చర్మం ఒలిచే ఏర్పాట్లు చేస్తాడు. ఆ చర్మాన్ని తాము దానం చేశామని, అమ్మలేదని సదరు మహిళలు ధ్రువపత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది’’ అని 40 ఏళ్ల ట్రాఫికర్‌ ప్రేమ్‌ బాస్గాయ్‌ చెప్పాడు. నేపాల్లోని కాబ్రేపాలన్‌చౌక్‌ జిల్లాలో కిడ్నీలు విక్రయిస్తున్న కేసులో ఇతడిని గత ఏడాది అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.


నైట్‌ క్లబ్బులు, మసాజ్‌ పార్లర్లలో వేశ్యలుగా
నేపాల్‌లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు చాలా మంది దుర్భర దారిద్య్రంలో మగ్గు తున్నారు. వారి పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు ఏజెంట్లు.. వారిని వేశ్యలుగా మార్చి ఈ థామెల్‌తోపాటు ఇతర పర్యాటక ప్రాంతాల్లోని నైట్‌ క్లబ్బులు, మసాజ్‌ పార్లర్లకు తీసుకువస్తారు. ఆ మహిళలు మూడు నెలల ‘జీతం’ ఆ ఏజెంట్లకు కమీషన్‌ కింద చెల్లించాలి. దక్షిణాసియా దేశాల నుంచి.. ముఖ్యంగా భారత్‌ నుంచి వచ్చే పురుషులు ఇక్కడ విటులు. యువతి కాస్త చక్కగా ఉంటే ఒక్కో ‘సిటింగ్‌’కి రూ.5,000 వరకూ చెల్లిస్తారు. కానీ కొంత కాలానికే చాలా మంది యువతుల శరీరాలు గాయపడతాయి. ఇలా గాయపు మచ్చలున్న వారికి రూ.300 నుంచి రూ.500 దక్కడమే ఎక్కువ. ఇక ఆ మహిళలు కండోమ్‌ ఉపయోగించాలని పట్టుబడితే అదీ ఇవ్వరు. అలాగే చాలా మంది నేపాలీ మహిళలను భారత్‌లోని కోల్‌కతా, ముంబై ప్రాంతాల్లోని వేశ్యావాటికలకు తరలించడం షరా మామూలే.

బాధితులే ఏజెంట్లుగా...
కుసుమ్‌ శ్రేష్ఠ అనే మహిళ వయసు 40 ఏళ్లు. ఆమె ఖట్మాండుకు 62 కి.మీ. దూరంలోని నువాకోట్‌ గ్రామంలో నివసిస్తున్నారు. తన చర్మాన్ని ఒక ఏజెంటుకు అమ్మారు. ఆ ఏజెంట్లకు చాలా బలమైన నెట్‌వర్క్‌ ఉందని, ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సాహసిస్తే వారి కుటుంబాన్ని హింసిస్తారని భయంభయంగా చెప్పారు. నిజానికి చాలా కుటుంబాలు జీవనాధారం కోసం చిన్న చిన్న పనులు చేయడానికి ఈ ఏజెంట్ల మీద ఆధారపడతారు. అలా కిడ్నీలు, చర్మం అమ్ముకున్న బాధితులు కూడా ఆ తర్వాత ఏజెంట్లుగా మారుతున్న ఉదంతాలూ ఉన్నాయి. ప్రేమ్‌ బాస్గాయ్‌ అలాగే ఏజెంటుగా మారాడు. తొలుత అతడు, అతడి భార్య తమ కిడ్నీలు అమ్ముకున్నారు. ఆ డబ్బులు అయిపోయాక.. ఇతరులను కిడ్నీలు అమ్మడానికి ఒప్పించి కమీషన్‌ తీసుకునే ఏజెంటుగా మారాడతడు.

ఎదురు తిరిగితే చంపేసి కాల్వలో తొక్కేస్తారు!
కాబ్రేపాలన్‌చౌక్‌ జిల్లా ‘నేపాల్‌ కిడ్నీ బ్యాంకు’గా పేరుపడింది. ఇక్కడి జనంలో చాలా మంది కిడ్నీలు అమ్ముకున్న వారు ఉన్నారు. ఇక్కడ్నుంచి దాదాపు 300 కిడ్నీలు అక్రమ రవాణా చేసినట్లు బయటపడినా.. కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. చర్మం విక్రయాల పరిస్థితీ ఇంతే. ఈ రాకెట్‌ చాలా పకడ్బందీగా అనేక అంచెల్లో ఉండటం ఒక ఎత్తయితే.. ఆ విషయం ఎక్కడైనా బయటపెడితే తమతో పాటు తమ కుటుంబ సభ్యులకూ జరిగే ప్రాణహాని గురించిన భయం మరొక ఎత్తు. దీంతో బాధితులు ఎవరూ ఎక్కడా నోరు విప్పడానికి ఇష్టపడరు.  ‘‘ఎవరు ఫిర్యాదు చేస్తారు? అక్కడ ప్రాణానికి విలువ లేదు. కస్టమర్లను సుఖపెట్టడానికి నిరాకరించిన మహిళలను లేదంటే పారిపోవడానికి ప్రయత్నించిన మహిళలను చంపేసి మురుగు కాల్వల్లో తొక్కేసిన ఘటనలు నా కళ్లతో చూశాను. ఒక కస్టమర్‌ నా రెండేళ్ల కుమారుడి నాలుకను సిగరెట్‌తో కాల్చాడు. నా కుమారుడికి ఇప్పుడు ఏడేళ్లు. అయినా ఇంకా సరిగ్గా మాట్లాడలేడు. ఆ కూపాల నుంచి మమ్మల్ని రక్షించి పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చినప్పుడు.. గతం గురించి మేం మాట్లాడం. దాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తాం. అలాంటి భయానక సంఘటనలేవీ జరగలేదని మాకు మేం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం’’ అని రేఖ అనే మహిళ వివరించారు. ఆమె వయసు 30 ఏళ్లు దాటింది. ఆమె కిడ్నీని విక్రయించారు. ముంబై, కోల్‌కతాల్లోని వేశ్యావాటికలకు ఆమెను అమ్మేశారు.

నేపాల్‌ రాజధాని ఖట్మాండు నగరంలో థామెల్‌ ప్రాంతం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కళ్లు తెరుస్తుంది. అప్పుడిక అక్కడ ప్రతీదీ అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. నైట్‌ క్లబ్బులు వెలుగులీనుతుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే.. భారత విలాస పురుషులకు ఇదో చిన్న లాస్‌ వేగాస్‌ వంటిది. ఇక్కడ చాలా మంది ‘ఏజెంట్లు’ ఉంటారు. వాళ్లలో 14-15 ఏళ్ల బాలురు కూడా ఉంటారు. వీధుల్లో పురుష పర్యాటకులకు ఇక్కడి నైట్‌ క్లబ్బుల్లో లభించే ‘సేవల’ గురించి చెబుతూ వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ పార్లర్లలో నేపాల్‌ యువతులు, మహిళలు పురుషులకు కావలసిన ‘సేవలు’ అందిస్తారు.

Advertisement
Advertisement