దెబ్బకు దెబ్బ | Sakshi
Sakshi News home page

సర్జికల్‌ స్ట్రయిక్స్‌ 2 సక్సెస్‌

Published Wed, Feb 27 2019 3:35 AM

Indias revenge for Pulwama attack - Sakshi

న్యూఢిల్లీ: ఉగ్ర ముష్కరుల చర్యలను చూస్తూ ఊరుకోం.. అమర జవాన్ల త్యాగాలు వృథాగా పోనీయమన్న భారత అధినాయకత్వ మాటలు నిజమయ్యాయి. పుల్వామా దాడికి భారత్‌ మంగళవారం గట్టిగా బదులు తీర్చుకుంది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ను చావు దెబ్బతీసింది. 2016 నాటి సర్జికల్‌ దాడుల్ని గుర్తుకు తెస్తూ, పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లో జైషే నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. బాంబుల్ని జారవిడిచి సుమారు 350 మంది ఉగ్రవాదులు, సీనియర్‌ కమాండర్లు, వారి శిక్షకుల్ని మట్టుపెట్టింది. వేకువజామున గాఢ నిద్రలో ఉన్న ఉగ్రవాదుల్ని సులభమైన లక్ష్యంగా చేసుకొని విరుచు కుపడింది. ఏం జరుగుతోందో వారు తెలుసుకునే లోపే మిషన్‌ను దిగ్విజయంగా ముగించింది. ఈ దాడిపై ‘వైమానిక దళ సభ్యులకు సెల్యూట్‌’ అంటూ దేశం నలుమూలల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతు న్నాయి. పుల్వామా ఘటన తరువాత జైషే తమ సభ్యుల్ని బాలాకోట్‌ శిబిరంలోనే ఉంచి ఆశ్రయం కల్పించినట్లు సమాచారం.

తాజా దాడిలో పుల్వామా దాడి కుట్రదారులు, అమలుదారులంతా అంతమైన ట్లేనని భావిస్తున్నారు. అమర జవాన్లకు ఇదే సముచిత నివాళి అంటూ దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. దేశం అత్యంత సురక్షితమైన చేతుల్లో ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నా నని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. 1971 యుద్ధం తరువాత పాకిస్తాన్‌ భూభా గంలో భారత్‌ వైమానిక దాడులకు పాల్పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు, పాత పల్లవే అందుకున్న పాకిస్తాన్‌.. నియంత్రణ రేఖ దాటి వచ్చిన భారత్‌ దుస్సాహ సానికి పాల్పడిందని ఆరోపించింది. సమయం వచ్చినప్పుడు తిప్పికొడతామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. మరోవైపు  కశ్మీర్‌లోని జమ్మూ, రాజౌరీ, పూంఛ్‌ జిల్లాల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్‌ కాల్పులకు తెగబడింది. దీంతో ఐదుగురు భారత జవాన్లకు గాయాలయ్యాయి. (త్రివిధ దళాలకు సెలవులు రద్దు)

పక్కా నిఘా సమాచారంతో..
పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను బలిగొన్న 12 రోజుల తరువాత భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఈ దాడికి బాధ్యత ప్రకటించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ శిక్షణా శిబిరాలపై అత్యంత కచ్చితత్వంతో ఏకకాలంలో బాంబుల వర్షం కురిపించిన వైమానిక దళం 350 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది. వేకువజామున 3.45–4.05 గంటల మధ్య  20 నిమిషాల్లోనే ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించింది. నియంత్రణ రేఖ వెంబడి బాలాకోట్, ముజఫరాబాద్, చకోటి ప్రాంతాల్లోని ఉగ్రవాదుల శిబిరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. జైషేకు అత్యంత కీలకమైన బాలాకోట్‌ శిబిరాన్ని నేలమట్టం చేయడం మన వైమానిక దళం సాధించిన గొప్ప విజయంగా భావిస్తున్నారు. (వైమానిక దాడులపై స్పందించిన విదేశాంగ శాఖ)

ఈ దెబ్బతో జైషే కోలుకోవడం కష్టమేనని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పుల్వామా ఘటన తరువాత దేశంలోకి చొరబడి మరిన్ని దాడులకు పాల్పడాలని జైషే కుట్ర పన్నుతోందని, నిఘా వర్గాలు అందించిన ఈ సమాచారం ఆధారంగానే ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు దిగినట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే చెప్పారు. దేశంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు జైషే ఉగ్రవాదులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోందని నిఘా వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందిందని గోఖలే తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నివారణ మార్గంగా సైనికేతర, ముందస్తు వైమానిక దాడులకు దిగినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో బాలాకోట్‌లో జైషేకు చెందిన అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని నేలమట్టం చేశామని వెల్లడించారు. ఆత్మాహుతి దాడిలో శిక్షణ పొందుతున్న ఉగ్రవాదులు, కమాండర్లు, శిక్షకులు ఇలా చాలా మందిని అంతమొందించామని తెలిపారు. అయితే దాడులు జరిగిన విధానం, వాడిన యుద్ధ విమానాలు తదితర సమాచారాన్ని ఆయన వెల్లడించలేదు.

పాక్‌ అధికారుల్ని తికమకపెడుతూ..
జైషే శిబిరాలపై వైమానిక దళం విరుచుకుపడిన తీరును ప్రభుత్వ వర్గాలు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. 12 మిరాజ్‌ యుద్ధ విమానాలు, కొన్ని సుఖోయ్‌–30లు, గాలిలోనే ఇంధనం నింపుకునే ఒక విమానం, రెండు అవాక్స్‌ వ్యవస్థ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. తూర్పు, సెంట్రల్‌ కమాండ్‌ కేంద్రాల నుంచి ఒకేసారి ఈ విమానాలు గాల్లోకి లేచాయి. అవి ఎటు వైపు వెళ్తున్నాయో అర్థం కాక పాకిస్తాన్‌ రక్షణ అధికారులు గందరగోళానికి గురయ్యారు. ఆ గుంపు నుంచి కొన్ని విమానాలు వేరుపడి బాలాకోట్‌ వైపు దూసుకెళ్లాయి. ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న ఉగ్రవాదులు మన వైమానిక దళానికి సులువైన లక్ష్యాలుగా మారారు.  (బాంబుల వర్షం కురిసేటప్పుడు మోదీ అక్కడే ఉన్నారా..!)

వారు తేరుకునే లోపే బాంబుల వర్షం కురిపించి పని పూర్తి చేశారు. సుమారు 350 మంది ఉగ్రవాదుల్ని 20 నిమిషాల వ్యవధిలో మట్టుపెట్టారు. చుట్టుపక్కనున్న గ్రామాల్లో సాధారణ ప్రజలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడ్డారు. పాకిస్తాన్‌ నుంచి ఎదురుదాడి ఎదురైతే తిప్పికొట్టేలా అన్ని వైమానిక స్థావరాల్ని అప్పటికే అప్రమత్తం చేశారు. ఢిల్లీ నుంచే వైమానిక దళ చీఫ్‌ బీఎస్‌ ధనోవా ఈ మిషన్‌ను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ఆర్మీ, నేవీ చీఫ్‌లు జనరల్‌ బిపిన్‌ రావత్, చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లాంబాలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. ఆపరేషన్‌ ముగిశాక విమానాలన్నీ సురక్షితంగా తిరిగొచ్చాయి. 

5స్టార్‌ రిసార్టు లాంటి శిబిరం..
పాకిస్తాన్‌లోని ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్సులోని బాలాకోట్‌ పట్టణం నియంత్రణ రేఖకు సుమారు 80 కి.మీ దూరంలో ఉంది. అల్‌ ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికా బలగాలు అంతమొందించిన అబోటాబాద్‌ ఈ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. స్విమింగ్‌ పూల్, ఇతర విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన బాలకోట్‌ శిక్షణా శిబిరం 5 నక్షత్రాల రిసార్ట్‌ను తలపిస్తుంది. దట్టమైన అరణ్య ప్రాంతంలో ఎత్తైన గుట్టపై ఉన్న ఈ శిబిరంలో 500 నుంచి 700 మంది బస చేయడానికి అవసరమైన అన్ని వసతులు కల్పించారు. ఆయుధాల తయారీ, రణరంగంలో వ్యవహరించాల్సిన పద్ధతులు, కాన్వాయ్‌లు, భద్రతా బలగాలపై దాడులకు పాల్పడటం, ఐఈడీలు తయారీ, వాటిని పాతిపెట్టడం, ఆత్మాహుతి దాడులకు పాల్పడటం, ఒకవేళ పట్టుబడినా విచారణ సందర్భంగా ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి? తదితర అంశాల్లో ఇక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు. బాలాకోట్‌ శిబిరానికి జైషే చీఫ్‌ మసూద్‌ అజహర్‌ బావమరిది మౌలానా యూసుఫ్‌ అజర్‌ అలియాస్‌ ఉస్తాద్‌ ఘోరి నేతృత్వం వహిస్తున్నాడు. 

వాయుసేనకువందనం: కేటీఆర్‌
‘భారత వాయుసేన బలగాలకు వందనం. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి తిరిగి వచ్చిన సేనలకు అభినందనలు. భారత వాయుసేన శక్తిసామర్థ్యాలకు ఈ దాడులు ప్రతీక. జైహింద్‌’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

ఉగ్రవాదులపైచర్యకుఅభినందనలు: వైఎస్‌జగన్‌ 
‘ఐఏఎఫ్‌ పైలట్లు సమర్థవంతమైన రీతిలో వెరపు లేకుండా ఉగ్రవాదులపై చేసిన దాడికి అభినందనలు తెలుపుతున్నాను. వారు చూపిన సాహసానికి గర్విస్తున్నాను’ అంటూ సర్జికల్‌ స్ట్రైక్స్‌–2పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  (సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు.. పరిస్థితి ఉద్రిక్తం)

Advertisement
Advertisement