ఐబీ చీఫ్‌గా అర్వింద్‌.. ‘రా’ చీఫ్‌గా గోయల్‌ | Sakshi
Sakshi News home page

ఐబీ చీఫ్‌గా అర్వింద్‌.. ‘రా’ చీఫ్‌గా గోయల్‌

Published Thu, Jun 27 2019 4:09 AM

IPS officer Samant Goel made RAW chief, Arvind Kumar new IB chief - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ సమావేశమైన కేబినెట్‌ నియామకాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో నిఘా సమాచారాన్ని సేకరించే ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) నూతన అధిపతిగా ఐపీఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ను నియమించింది. అలాగే విదేశా ల నుంచి నిఘా సమాచారాన్ని సేకరించే రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) చీఫ్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సామనత్‌ కుమార్‌ గోయల్‌ను నియమించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అర్వింద్‌ కుమార్, గోయల్‌లు రాబోయే రెండేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఐబీ ప్రస్తుత చీఫ్‌ రాజీవ్‌ జైన్‌ పదవీకాలం జూన్‌ 30తో, ‘రా’ చీఫ్‌ అని ల్‌ కె.ధస్మనా పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. వీరిద్దరి పదవీకాలం 2018, డిసెంబర్‌లోనే ముగిసినప్పటికీ సర్వీసును 6 నెలలు పొడిగించారు.

కశ్మీర్‌ నిపుణుడు అర్వింద్‌..
ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో రెండో అత్యంత సీనియర్‌ అధికారి అయిన అర్వింద్‌ కుమార్‌(59) 1984 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అస్సాం–మేఘాలయ కేడర్‌ అధికారి. 1991, ఆగస్టులో ఐబీలో చేరిన కుమార్, ప్రస్తుతం స్పెషల్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలోని భారత ఎంబసీలో ఆయన పనిచేశారు. జమ్మూకశ్మీర్‌లో వ్యవహారాలు, మావోయిస్టుల విషయంలో నిపుణుడిగా పేరు గడించారు. ఆయన అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ‘ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌’ను బహూకరించింది.

‘బాలాకోట్‌’ సూత్రధారి గోయల్‌..
1984 బ్యాచ్, పంజాబ్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సామనత్‌ కుమార్‌ గోయల్‌ ప్రస్తుతం ‘రా’లో ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌ బాలాకోట్‌లోని జైషే ఉగ్రస్థావరంపై చేసిన వైమానిక దాడుల వ్యూహ రచనలో గోయల్‌ కీలకంగా వ్యవహరించారు. అలాగే 2016, సెప్టెంబర్‌ 29న చేపట్టిన సర్జికల్‌ దాడుల పథకరచనలో ముఖ్యభూమిక పోషించారు. నిఘా విషయంలో విశేషానుభవం ఉన్న గోయల్‌ తన కెరీర్‌లో ఎక్కువగా పంజాబ్‌లోనే పనిచేశారు. 1990ల్లో పంజాబ్‌లో తీవ్రవాదాన్ని నియంత్రించడంతో గోయల్‌ కీలకంగా వ్యవహరించారు. 2001లో ఆయన ‘రా’లో చేరారు. ఆయన అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం పోలీస్‌ మెడల్‌(గ్యాలెంట్రీ), పోలీస్‌ మెడల్‌(మెరిటోరియస్‌)లను ప్రకటించింది. సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాల ముడుపుల వ్యవహారం కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పిం చిన అఫిడవిట్‌లో గోయల్‌ పేరు కనిపించింది.

Advertisement
Advertisement