అందమైన అధికారిణుల జాబితాపై ఐపీఎస్‌ ఆగ్రహం! | Sakshi
Sakshi News home page

అందమైన అధికారిణుల జాబితాపై ఐపీఎస్‌ ఆగ్రహం!

Published Wed, May 25 2016 4:00 PM

అందమైన అధికారిణుల జాబితాపై ఐపీఎస్‌ ఆగ్రహం! - Sakshi

'భారత్‌లో కెల్లా అందమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారిణిలు' అంటూ ఓ హిందీ దినపత్రిక జాబితాను ప్రచురించడంపై మహిళా ఐపీఎస్ అధికారి మెరిన్‌ జోసెఫ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'అందమైన ఐపీఎస్‌, ఐఏఎస్‌ పురుష అధికారుల గురించి జాబితాను ఎప్పుడైనా చూశామా?' అని ఆమె ప్రశ్నించారు. కేరళలోని మున్నార్‌ ఏఎస్పీ (అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీసు)గా పనిచేస్తున్న ఆమె తాజా ఈ విషయమై పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది. అందం కొలమానంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను మీడియా చూడటం లింగవివక్షనంటూ ఆమె పెట్టిన పోస్టు ఇప్పటికే వైరల్‌గా మారిపోయింది. ఆమెకు మద్దతుగా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.

భారతీయ మీడియా ఎప్పుడూ వక్ర దృష్టితోనే మహిళలను చూస్తున్నదని ఆమె తన పోస్టులో మండిపడ్డారు. రూపురేఖలు ఒక మహిళ ప్రతిభను ఎలా నిర్ధారిస్తాయని ఆమె ప్రశ్నించారు. 'సంక్లిష్టమైన భారతీయ బ్యూరోక్రసిలో ఎంతో ధైర్యసాహసాలతో ఈ అధికారిణులు పనిచేస్తున్నారు. మన రాజకీయ వ్యవస్థలోని మంచిని, చెడును, వికృతాన్ని తమదైన రీతిలో ఎదుర్కొంటున్నారు. కానీ, వారిని మనం మోహదృష్టితో చూస్తూ జాబితాలు సిద్ధం చేస్తున్నాం' అని ఆ పత్రిక తీరును తప్పుబట్టారు. ఇలా అధికారిణుల అందచందాల ఆధారంగా జాబితాలు తయారుచేయడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆమె మద్దతుగా ఫేస్‌బుక్‌లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

లింగ వివక్షత సంబంధించిన అంశాలను లేవనెత్తడం మెరిన్‌ జోసెఫ్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమెకు ఎండంలో ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ గొడుగు పడుతున్న ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌ అయింది. ఆ తర్వాత నటుడు నవిన్‌ పౌలీతో ఆమె ఫొటో తీయాల్సిందిగా ఓ ఎమ్మెల్యేను కోరడం కూడా సోషల్‌ మీడియాలో దుమారం రేపింది. అయితే, ఆమె మహిళ కావడం వల్లే ఆమె చర్యలను భూతద్దంలో చూపిస్తున్నారని ఆమె మద్దతుదారులు గతంలో పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement