హలో.. నా పేరు వ్యోమమిత్ర | Sakshi
Sakshi News home page

హలో.. నా పేరు వ్యోమమిత్ర

Published Thu, Jan 23 2020 4:03 AM

ISRO Gaganyaan Manned Mission and the Vyommitra Humanoid Robot - Sakshi

సాక్షి, బెంగళూరు:  మానవులకంటే ముందుగా అంతరిక్షంలోకి మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ‘మానవసహిత అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలు, సవాళ్లు’ అన్న అంశంపై బుధవారం బెంగళూరులో జరిగిన సదస్సులో ‘వ్యోమమిత్ర’ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘హలో.. నా పేరు వ్యోమమిత్ర,. నేను గగన్‌యాన్‌ ప్రయోగం కోసం తయారైన నమూనా హ్యూమనాయిడ్‌ రోబోను’ అంటూ అందరినీ పలకరించింది.

గగన్‌యాన్‌లో తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘మాడ్యూల్‌ పారామీటర్ల ద్వారా నేను పరిశీలనలు జరపగలను. మానవులను హెచ్చరించగలను. స్విచ్‌ ప్యానెల్‌ వంటి పనులు చేయగలను’ అని తెలిపింది.   వ్యోమగాములకు స్నేహితురాలిగా ఉంటూ  వారితో మాట్లాడగలనని ఆ రోబో తెలిపింది. వ్యోమగాముల ముఖాలను గుర్తించడంతోపాటు వారి ప్రశ్నలకు సమాధానమూ ఇవ్వగలనని చెప్పింది.  ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ మాట్లాడుతూ వ్యోమమిత్ర అంతరిక్షంలో మనుషులు చేసే  పనులను అనుకరించలగదని, లైఫ్‌ కంట్రోల్‌ సపోర్ట్‌ సిస్టమ్స్‌ను నియంత్రించగలదని తెలిపారు.  

చురుగ్గా సన్నాహాలు..
మానవ సహిత ప్రయోగం కోసం నాసా, ఇతర అంతరిక్ష సంస్థల సహకారం, సూచనలు కూడా తీసుకుంటున్నట్లు శివన్‌ తెలిపారు. గగన్‌యాన్‌ ప్రయోగం ఇస్రో దీర్ఘకాల లక్ష్యమైన ఇంటర్‌ ప్లానెటరీ మిషన్‌కు ఉపయోగపడుతుందని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటికే గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా 10 టన్నుల పేలోడ్‌ సామర్థ్యం ఉన్న లాంఛర్, కీలక సాంకేతిక అంశాలను, అంతరిక్షంలో మనిషి మనుగడకు సంబంధించిన అంశాలను అభివృద్ధి చేస్తున్నాం.

త్వరలోనే దేశంలో వ్యోమగాములకు సాధారణ అంతరిక్ష ప్రయాణ శిక్షణ ఇస్తాం. చంద్రయాన్‌–3 పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చంద్రయాన్‌–3 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. చంద్రునిపైకి మానవుణ్ని పంపే ప్రాజెక్టు తప్పకుండా ఉంటుంది, కానీ అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. దీని కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసి, శిక్షణ నిమిత్తం ఈ నెలాఖరుకు వారిని రష్యాకు పంపనున్నాం. 1984లో రష్యా మాడ్యూల్‌లో రాకేశ్‌ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు, కానీ ఈసారి భారత  మాడ్యూల్‌లో భారతీయులు అంతరిక్షంలోకి వెళతారు’ అని చెప్పారు.  

3 దశల్లో గగన్‌యాన్‌..
మానవ సహిత గగన్‌యాన్‌ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఇస్రో చైర్మన్‌ శివన్‌ తెలిపారు. 2021 డిసెంబర్‌లో మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌ను చేపట్టబోతున్నట్లు తెలిపారు. దానికంటే ముందు రెండు సార్లు (2020 డిసెంబర్, 2021 జూన్‌) మానవ రహిత మిషన్లను చేపట్టబోతున్నట్లు చెప్పారు. ‘గగన్‌యాన్‌లో భాగంగా సుమారు ఏడు రోజుల పాటు వ్యోమగాములను ఆర్బిటర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నాం. ఈ మిషన్‌ కేవలం భారత తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగమే కాదు, మానవుడు అంతరిక్షంలో నిరంతరంగా నివసించేలా కొత్త స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో సాగుతున్న ప్రాజెక్టు. ఇది భారత్‌ ఘనతను చాటుతుంది’ అని చెప్పారు. 

Advertisement
Advertisement