పీఎస్‌ఎల్‌వీ సీ-36 ప్రయోగం విజయవంతం | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్‌వీ సీ-36 ప్రయోగం విజయవంతం

Published Wed, Dec 7 2016 10:50 AM

పీఎస్‌ఎల్‌వీ సీ-36 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 10.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-36 విజయవంతంగా నింగికి దూసుకెళ్లింది. సోమవారం రాత్రి 10.25 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 36 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్‌ఎల్‌వీ సీ-36 రాకెట్ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 17.9 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేశారు. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ-36 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. ఈ ప్రయోగం ద్వారా 321 టన్నుల బరువును తీసుకుని రాకెట్ భూమి నుంచి నింగికి పయనమైంది.

ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనంతోపాటు కోర్‌అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనం సాయంతో 110.48 సెకన్లకు మొదటిదశను పూర్తి చేసుకుంది. ఆ తరువాత 41.7 టన్నుల ద్రవ ఇంధనంతో 261.9 సెకన్లకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 521.7 సెకన్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1,028.26 సెకన్లకు నాలుగోదశను పూర్తి చేసుకుంది. అనంతరం నాలుగోదశకు శిఖరభాగంలో పొందికగా అమర్చిన 1,235 కిలోల బరువు కలిగిన రిసోర్స్‌శాట్-2ఏ 1,075.26 (17.9 నిమిషాల్లో) సెకన్లకు భూమికి 827 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో 98.719 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఇంధనం బరువు తగ్గించి ఉపగ్రహాల బరువును పెంచేందుకు దోహదపడేలా ఈ ప్రయోగం ఉపయోగపడనుంది.

రిసోర్స్‌శాట్-2ఏతో ఉపయోగాలు
2003 అక్టోబర్ 10న పీఎస్‌ఎల్‌వీ సీ5 ద్వారా రిసోర్స్‌శాట్-1, 2011 ఏప్రిల్ 20న పీఎస్‌ఎల్‌వీ సీ16 ద్వారా రిసోర్స్‌శాట్-2 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ రెండు ఉపగ్రహాలకు అనుసంధానంగా 1,235 కిలోలు బరువు కలిగిన రిసోర్స్‌శాట్-2ఏ రోదసీలోకి పంపించారు. భూమిపై జలవనరులు, అర్బన్ ప్లానింగ్, వ్యవసాయ రంగం, రక్షణశాఖకు ఎంతో ఉపయోగకరంగా మూడు ఉపగ్రహాలు ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఉపగ్రహంలో మూడు రకాల పేలోడ్స్‌ (త్రీ టైర్ ఇమేజింగ్ సిస్టం) అమర్చి పంపించారు. ఇందులో లీనర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్స్ (లిస్-3), (లిస్ -4) అనే రెండు  పేలోడ్స్‌తోపాటు అడ్వాన్‌‌స్‌డ్‌ వైడ్ ఫీల్డ్ సెన్సార్ పరికరాలను అమర్చి పంపించారు. ప్రస్తుతం రెండు ఉపగ్రహాలు ఒకచోటును స్కానింగ్ చేసిన తరువాత మళ్లీ అదే చోటును స్కానింగ్ చేయడానికి 24 రోజుల సమయం పడుతుంది. రిసోర్స్‌శాట్-2ఏ ఉపగ్రహ సేవలు అందుబాటులోకి వస్తే మూడు ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై 12 రోజులకు ఒకసారి లోకేట్ చేస్తుంది. అంటే భూమిపై వనరుల విషయంలో అత్యుత్తమైన సేవలు అందిస్తాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement