ఐటీ కంపెనీల్లోనూ ట్రేడ్ యూనియన్లు | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీల్లోనూ ట్రేడ్ యూనియన్లు

Published Fri, Jun 10 2016 11:14 PM

ఐటీ కంపెనీల్లోనూ ట్రేడ్ యూనియన్లు - Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలు, కొన్ని ప్రైై వేటు రంగాలకు పరిమితమైన కార్మిక సంఘాలు ఇక నుంచి ఐటీ కంపెనీల్లోనూ పుట్టుకురానున్నాయి. ఇందుకు తమిళనాడు వేదిక అవుతోంది. ఐటీ కంపెనీల్లోని ఉద్యోగులు సైతం కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చంటూ తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 30 లక్షల పైచిలుకు ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల హక్కుల అంశం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఉద్యోగుల హక్కులను కాలరాసే కంపెనీలకు మాత్రం ఇది పెద్ద హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. సంఘాల ఏర్పాటు ఇబ్బందికర పరిణామమేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

సొంత రాజ్యాంగాలకు చెల్లు..
ఉద్యోగుల హక్కుల విషయంలో పెద్ద కంపెనీలు కార్మిక చట్టాల నిబంధనలను అనుసరిస్తున్నాయి. మానవ సంబంధాల విషయంలో అంతర్జాతీయ సంస్థలు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటుండడం ఇందుకు కారణం. తాము ప్రాజెక్టు అప్పగించే ముందు సదరు కంపెనీలో స్నేహపూర్వక వాతావరణం ఉందీ లేనిదీ పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటాయి. సమస్యల్లా కొన్ని చిన్న కంపెనీలతోనే. ప్రమోటర్లు తాము సొంతంగా రాసుకున్న రాజ్యాంగం ప్రకారమే అన్నీ సాగాలని హెచ్‌ఆర్ విభాగాలను ఆదేశిస్తున్నారు. సెలవులు, అలవెన్సులు, వేతనాల వంటి విషయంలో నిబంధనలను పాటించని కంపెనీలెన్నో ఉన్నాయి. కార్మిక సంఘాలు ఏర్పాటైతే ఇటువంటి సొంత రాజ్యాంగాలకు తావులేదని హెచ్‌ఆర్ రంగ నిపుణులు బి.అపర్ణరెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోతో అన్నారు. ‘ఉద్యోగులను తొలగించే విషయంలోనూ కంపెనీలు జాగ్రత్త వహిస్తాయి. పనితీరు బాగోలేదంటూ తప్పుడు సాకుతో తొలగించే చాన్స్ లేదు. ఇప్పటి వరకు ఉద్యోగి తన సమస్యను కంపెనీ ఏర్పాటు చేసిన కమిటీకి చెప్పుకునేవారు. అన్యాయం జరిగితే ఇక నుంచి కార్మిక శాఖకు మొరపెట్టుకోవచ్చు. ఉద్యోగుల్లో సై ్థర్యం పెరుగుతుంది. నిబంధనల విషయంలో కంపెనీల్లో క్రమబద్ధత వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

ఉద్యోగులను బాగా చూసుకుంటాం..
పనితీరు, వ్యాపారం విషయంలో విదేశీ సంస్థలతో భారత ఐటీ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల యోగక్షేమాలకు పరిశ్రమ పెద్దపీట వేస్తోందని ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్ ఎండీ రమేష్ లోగనాథన్ అన్నారు. ఉద్యోగికి సమస్య ఏదైనా వస్తే కంపెనీ ఏర్పాటు చేసిన కమిటీ పరిష్కరిస్తోందని చెప్పారు. యూనియన్ ఏర్పాటు చట్టానికి ఏమాత్రం వ్యతిరేకం కాదు. సంఘం ఏర్పాటైనంత మాత్రాన పని వాతావరణం చెడిపోతుందని ఏమీ లేదు. తిరోగమన ప్రభావమేదీ సంస్థలపై ఉండకపోవచ్చు’ అని వివరించారు. ఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని విజన్ 2కే ప్లస్ ఇంక్ మేనేజింగ్ పార్టనర్ పి.సౌదామిని అన్నారు. ఉద్యోగులు సమస్యలేవైనా ఉంటే సామరస్యంగానే పరిష్కరించుకుంటారని తెలిపారు. సమస్యలు సష్టించిన ఉద్యోగులకు ఇతర సంస్థల్లో అవకాశాలు రావన్నారు.

క్లయింట్ల వెనుకంజ..
కార్మిక సంఘాలున్న కంపెనీలతో చేతులు కలిపేందుకు ఎమ్మెన్సీలు విముఖత వ్యక్తం చేస్తాయని ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నేషనల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, గ్లోబల్ ఇన్ఫోవిజన్ ఎండీ ఎస్.పూర్ణచంద్ర రావు వెల్లడించారు. డెడ్‌లైన్స్‌పైన పనిచేసే ఈ రంగంలో ఏమాత్రం అనిశ్చితి ఉన్నా ప్రాజెక్టులు రావని హెచ్చరించారు. పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో పరిశ్రమకు నష్టదాయక చర్యలేవీ మంచివి కాదన్నారు. దీర్ఘకాలంలో కంపెనీలకు ప్రమాదమని అన్నారు. పరిశ్రమకు రక్షణ ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టేందుకే ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తారన్నారు. తక్కువ వేతనాలున్న బీపీవో రంగంలో సంఘాల ఏర్పాటుకు ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల్లో అసంతప్తి మొదలైతేనే యూనియన్లు ఏర్పాటవుతాయని హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఉద్యోగి కందుకూరి సురేష్‌బాబు తెలిపారు. ఇలా సంఘం ఏర్పాటైన కంపెనీలు ఎదగలేవని అన్నారు. డేటాబేస్‌లో సమాచారం ఉంటుంది కాబట్టి ప్రొఫైల్ బాగోలేని ఉద్యోగికి ప్రపంచంలో ఎక్కడా జాబ్ రాదన్నారు.

Advertisement
Advertisement