జయకు మద్దతుగా 90 కిలోమీటర్ల మానవహారం | Sakshi
Sakshi News home page

జయకు మద్దతుగా 90 కిలోమీటర్ల మానవహారం

Published Mon, Oct 6 2014 3:05 AM

జయకు మద్దతుగా 90 కిలోమీటర్ల మానవహారం

సిఫ్‌కాట్/ హొసూరు/ క్రిష్ణగిరి:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారం హొసూరు పారిశ్రామికవాడ సమీపంలోని కర్ణాటక సరిహద్దు అత్తిపల్లి నుంచి బర్గూరు వరకు సుమారు 90 కిలోమీటర్లు మానవహారం నిర్వహించారు.  

అత్తిపల్లి వద్ద హొసూరు మున్సిపాలిటి 1వ వార్డు కౌన్సిలర్ అశోక్‌కుమార్ అధ్యక్షతన  అన్నా కార్మిక సంఘ అధ్యక్షుడు మాదేవ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు దర్గావరకు మానవహారం నిర్వహించారు.   జయలలితను వెంటనే విడుదల చేయాలని  నినాదాలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు త్యాగరాజరెడ్డి, నందకుమార్, నాయకులు లజపతిరెడ్డి, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
హొసూరులో...  :  జయలలితను జైలు శిక్ష నుంచి విముక్తి కలిగించాలని  మున్సిపల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో బాగలూరు రోడ్డు నుంచి రెండో సిఫ్‌కాట్ వరకు జాతీయ రహదారిలో మానవహారం నిర్వహించారు. అన్నాడీఎంకే నాయకులు వైస్ చైర్మన్ రాము, మాజీ మున్సిపల్ చైర్మన్ నంజుండస్వామి, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
 
సూళగిరిలో... సూళగిరిలో అన్నాడీఎంకే  చైర్మన్ హేమనాథ్ (మధు ) నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. అదేవిధంగా స్వరకాయపల్లి గ్రామానికి చెందిన తిమ్మరాజు (22), కళావతి(19)లకు ఆదివారం ఉదయం సూళగిరిలోని చెన్నరాయశెట్టి కల్యాణ మంటపంలో వివాహం జరిగింది.  ఈ సందర్భంగా నూతన వధూవరులు కూడా మానవహారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకరన్, కార్యదర్శి తాయప్ప, రాఘవ న్, కుమార్, నాగరాజు, పార్టీ కౌన్సిలర్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
 
క్రిష్ణగిరిలో... : క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే  జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో క్రిష్ణగిరి ఎంపి అశోక్‌కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement