హైదరాబాద్‌లో జయలలితకు గెస్ట్ హౌజ్ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో జయలలితకు గెస్ట్ హౌజ్

Published Tue, Dec 6 2016 5:37 AM

హైదరాబాద్‌లో జయలలితకు గెస్ట్ హౌజ్

హైదరాబాద్ : జయలలితకు హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. జీడిమెట్ల గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 52లో నాలుగు ఎకరాలు, పేట్‌బషీరాబాద్ సర్వే నెంబరు 93లో ఏడు ఎకరాల భూమి 44వ జాతీయ రహదారిని ఆనుకుని ఉంది. ఈ భూములు 40 ఏళ్లుగా జయలలిత గ్రీన్ గార్డెన్‌గా ఆమె పేరుపైనే ఉన్నారుు. 11 ఎకరాలున్న ఈ గార్డెన్ చుట్టూ 12 అడుగుల ఎత్తులో సోలార్ పెన్సింగ్ ఏర్పాటు చేశారు. తమిళనాడుకు చెందిన వారే ఇక్కడ పని చేస్తున్నారు.  ఇదివరకు ఆమె ఏడాదికి ఒకసారి ఇక్కడికి వచ్చి రెండు రోజుల పాటు విడిది చేసి వెళ్లేవారు. అప్పట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య వచ్చేవారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు సార్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కృష్ణంరాజు అనే వ్యక్తి ఎకరానికి రూ.25 వేల చొప్పున లీజుకు తీసుకుని కూరగాయలు పండిస్తున్నారు. ఇక్కడి సిబ్భంది రెండు రోజుల క్రితం  జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనతో చెన్నైకి వెళ్లినట్లు తెలిసింది. 

రాధిక కాలనీలో జయ జ్ఞాపకాలు
సికింద్రాబాద్ సమీపంలోని వెస్ట్ మారేడుపల్లి రాధిక కాలనీలో ఫ్లాట్ నెంబర్ 16లో జయలలితకు ఇల్లు ఉంది. ఈ ఇల్లు ఆమె స్నేహితురాలు ఎన్ శశికళ పేరుతో ఉంది. ప్రస్తుతం ఇంటి పన్ను రూ.35,424 బకాయి ఉందని కంటోన్మెంట్ అధికారులు తెలిపారు. 2001 నుండి 2003 మధ్య కొంత కాలం జయ ఈ ఇంట్లో ఉండిందని కాలనీ సెక్రెటరి సురేన్ పొరురి తెలిపారు. జయలలిత వచ్చిన సమయంలో సందడిగా ఉండేదని, పార్టీ నేతలు, అభిమానులు భారీగా వచ్చేవారన్నారు. రెండేళ్లుగా ఆ ఇల్లు ఖాళీగా ఉందని, ఇటీవలే శుభ్రపరిచామని సురేన్ పొరురి తెలిపారు. ప్రస్తుతం కాలనీ వాసులంతా జయలలిత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారన్నారు.

నాడు ఎంజీఆర్.. నేడు జయ
నాయకత్వంతోపాటు అనారోగ్యంలోనూ ఇద్దరిదీ అదే శైలి

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్, జయలలిత అనేక అంశాల్లో ఒకే ఒరవడిని సృష్టించుకున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీని అప్రతిహతంగా పరుగులు పెట్టించిన ఆనాటి ఎంజీఆర్ రాజకీయ వారసురాలు జయలలిత పార్టీని విజయకేతనంలో నడిపించడంలోనే కాదు, అనారోగ్యంలోనూ వారసురాలిగా నిలిచారు. వివరాల్లోకి వెళితే...ఎంజీఆర్, జయలలిత ఇద్దరూ సినిమా నేపథ్యం నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎంజీఆర్ పురట్చి తలైవర్(విప్లవ నాయకుడు), జయలలిత పురట్చితలైవీ(విప్లవ నాయకి)గా పేరుగాంచారు. అన్నాడీఎంకే అధికారంలో ఉండగా అస్వస్థతకు లోనైన ఎంజీఆర్ 1984 అక్టోబరు 5న అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

శ్వాసతీసుకోవడంలో ఇబ్బందితోనే ఆయన ఆడ్మిట్ అయ్యారని, ఇది స్వల్ప అస్వస్థతగా అపోలో ప్రకటించింది. అరుుతే, గుండెపోటుకు గురి కావడం వల్లనే ఎంజీఆర్ అపోలోలో చేరినట్లు కొన్ని రోజుల తరువాత గానీ వెల్లడికాలేదు. ఆస్పత్రిలో ఎంజీఆర్ చికిత్స పొందుతున్న ఫొటోలు విడుదల చేయాలని అన్నాడీఎంకే శ్రేణులు పట్టుపట్టాయి. దీంతో ఎంజీఆర్ చికిత్స పొందుతున్న ఫొటోతోపాటూ ఆయన ఆడియోను కూడా పార్టీ విడుదల చేసింది. అపోలోలో ఆరోగ్యం కుదుటపడక పోవడంతో 45 రోజుల తరువాత అమెరికాలోని బ్లూకిన్ ఆస్పత్రికి ఎంజీఆర్‌ను తరలించారు. అమెరికాలో చికిత్స పొందుతూనే ఎన్నికల్లో నామినేషన్ వేసి గెలిచిన ఎంజీఆర్.. ఆ తరువాత బాగా కోలుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. తర్వాత మూడేళ్లకు 1987లో అనారోగ్యంతో అమెరికాలో మరణించారు.

నేడు జయ...
ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరడంతో 32 ఏళ్ల కిందటి చరిత్ర దాదాపు ఒకే పోలికతో పునరావృతమైంది. ఎంజీఆర్ లాగానే జయలలిత కూడా సినిమా నేపథ్యం నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న పుడే జయలలిత జ్వరం, డీహైడ్రేషన్ వంటి స్వల్ప అస్వస్థను కారణంగా చూపుతూ సెప్టెంబరు 22న అపోలో ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజుల తరువాతనే ఆమె అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. జయ కూడా గుండెపోటుకు గురయ్యారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయ ఫోటోలను విడుదల చేయాలని అన్నాడీఎంకే శ్రేణులు పట్టుబట్టారు. అరుుతే అది నెరవేరలేదు. ఎంజీఆర్ ఆస్పత్రిలో ఉన్నపుడు అప్పటి ఆర్థికమంత్రి నెడుంజెళియన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అలాగే జయ రెండు సార్లు జైలుకెళ్లినపుడు ఆమె కేబినెట్‌లోని ఆర్థికమంత్రి పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వర్తించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement