జీవితం.. మరణం.. అన్నింటిలోనూ రహస్యమే! | Sakshi
Sakshi News home page

జీవితం.. మరణం.. అన్నింటిలోనూ రహస్యమే!

Published Tue, Dec 6 2016 9:44 AM

Jayalalithaa kept everything secret in life and death

 
చెన్నై: దక్షిణాదిలో ఒక పెద్ద రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అనంతలోకాలకు వెళ్లిపోయేవరకు జయలలితకు సంబంధించిన అన్ని విషయాలూ అత్యంత రహస్యంగానే ఉన్నాయి. చివరిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏడు నెలల్లోపే ఆమె మరణించారు. జయలలితను ఆరాధించేవాళ్లు, పూజించేవాళ్లు ఎంతమంది ఉన్నారో.. ఆమెను ద్వేషించేవాళ్లు, అసలు పట్టించుకోనివాళ్లు కూడా అంతేమంది ఉండేవారు. 16 ఏళ్ల వయసులోనే స్టార్ స్థాయికి ఎదిగినప్పటి నుంచి ఆమె ఎప్పుడూ ఏదో ఒకరకంగా వార్తల్లోనే ఉన్నారు. 
 
తాను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే తనకు పేరుప్రఖ్యాతులు, సిరి సంపదలు అన్నీ వచ్చాయని ఆమె అంటుంటారు. కానీ, ఆమె జీవితంలో ఎప్పుడూ విషాదఛాయలు మాత్రం కనిపిస్తూనే ఉండవి. మహారాణిలాగే బతికినా కూడా ఆమె ఎప్పుడూ ఒంటరే. చిట్టచివరి వరకు ఆమెలో ఏదో ఒక తెలియని అసంతృప్తి ఉంటూనే ఉండేది. జీవితంలో ఎవరో ఒకరి మీద తప్పనిసరిగా ఆధారపడాల్సిందేనని ఆమె ఓ సందర్భంలో అన్నారు. పురుషాధిక్యం స్పష్టంగా ఉండే ద్రవిడ రాజకీయాల్లో.. ఒక మహిళగా ఆమె నిలదొక్కుకోవడం చిన్న విషయం ఏమీ కాదు. ఈ క్రమంలో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ ఆమెకు ఎప్పుడూ అండగానే ఉన్నా కూడా.. చాలామంది సీనియర్ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనేవారు. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత ఆమె పరిస్థితి అత్యంత దారుణం. అప్పటినుంచి కక్షలు, కార్పణ్యాలతో కూడిన రాజకీయాల్లో ఎలాగోలా ఆమె నెగ్గుకొచ్చారు. నాలుగేళ్ల తర్వాత 1991లో తొలిసారి సీఎం అయ్యారు. కానీ, ఆమె అనుసరించిన విధానాలేవీ తమిళ ప్రజలకు నచ్చలేదు. దాంతో తర్వాతి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. ఆ విషయాలను మాత్రం ఎప్పుడూ ఎవరితోనూ పెద్దగా పంచుకునేవారు కారు. అన్నీ తనలో తానే రహస్యంగా ఉంచుకునేవారు. 
 
ఇక సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన తొలి రోజు నుంచి.. డిసెంబర్ 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు మరణించేవరకు ప్రతి విషయం అత్యంత రహస్యంగానే ఉండిపోయింది. కేవలం అపోలో ఆస్పత్రి యాజమాన్యం, కొద్దిమంది వైద్య నిపుణులకు తప్ప ఏ విషయాలూ ఎవరికీ తెలియవు. ఎంత పెద్ద వీఐపీ, వీవీఐపీలు వచ్చినా కూడా వాళ్లెవరూ జయలలితను చూసేందుకు వీలుండేది కాదు. కేవలం అపోలో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి వెళ్లిపోవడమే. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చినా కూడా అమ్మను చూపించలేదు. మధ్యలో ఆమె మాట్లాడుతున్నారని, లేచి కూర్చున్నారని, అన్నం తింటున్నారని, శ్వాస సాధారణ స్థితికి చేరుకుందని.. ఇలా చెబుతూ వచ్చారే తప్ప ఒక్కసారి కూడా ఆమె వీడియో క్లిప్పింగ్స్‌ను బయటపెట్టలేదు, కనీసం కెమెరాల ద్వారా అయినా ఆమెను ప్రజలకు చూపించలేదు. ఆస్పత్రిలో ఆమె పక్కన కేవలం ఒక్క శశికళ మాత్రమే ఉన్నారు. 
 
జీవితంలోను, మరణంతోను పోరాటమే
జయలలిత జీవితం మొత్తం పోరాటాల మయం. చివరకు మృత్యువుతో కూడా చిట్ట చివరి నిమిషం వరకు ఆమె పోరాడుతూనే ఉన్నారు. స్కూలు బోర్డు పరీక్షలలో టాపర్‌గా నిలిచిన తర్వాత తాను లాయర్ కావాలని ఎంతగానో అనుకున్నారు గానీ, కుటుంబ పరిస్థితుల కారణంగా తల్లి బలవంతం మీద సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. తారాపథానికి వెళ్లినా ఏనాడూ వాణిజ్య ప్రకటనల జోలికి వెళ్లలేదు, ఎవరినీ రానివ్వలేదు. ఆస్తుల మీద కేసుల విషయంలో కోర్టులో పోరాడాల్సి వచ్చింది. చివరగా సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ ఆమె చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. అప్పటికి ఆమెకు మధుమేహం తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. క్రమంగా అవయవాలు సహకరించలేదు. అయినా పోరాడారు. అన్నాళ్లుగా పోరాడిన గుండె చిట్టచివరి క్షణాల్లో ఒక్కసారిగా ఆగిపోయింది. దాన్నే వైద్య పరిభాషలో కార్డియాక్ అరెస్ట్ అన్నారు. అయినా, ఆమె తరఫున వైద్యులు పోరాడారు. 'ఎక్మో' అనే పరికరాన్ని అమర్చి, మరికొన్ని గంటల పాటు ప్రాణాలు నిలబెట్టారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు మృత్యువు చేతిలో ఓటమి తప్పలేదు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement