పోలీసులకు చిక్కని కరగ డాన్సర్ | Sakshi
Sakshi News home page

పోలీసులకు చిక్కని కరగ డాన్సర్

Published Thu, Jun 5 2014 12:21 AM

పోలీసులకు చిక్కని కరగ డాన్సర్ - Sakshi

 వేలూరు, న్యూస్‌లైన్: కాట్పాడి గోవిందరాజ్ నగర్‌లోని అద్దె ఇంటిలో నివాసం ఉన్న కరగ డాన్సర్ మోగనాంబల్ ఇంటిలో పోలీసులు 25వ తేదీ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో  4 కోట్ల 4లక్షల 73,500 నగదుతో పాటు 73 సవరాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తనిఖీల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కరగ డాన్సర్‌కు ఇంత పెద్ద నగదు ఎలా వచ్చిందనే పోలీసులు విచారణ జరిపారు.  మోగనాంబల్ పరారీలో ఉండడంతో ప్రత్యేక పోలీస్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
 
 ఇప్పటికే పోలీసులు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలకు వె ళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. మోగనాంబల్ అక్క కుమారుడు శరవణన్ కూడా పరారీలో ఉండడంతో శరవణన్ భార్య దేవిబాల, ఈమె అన్న పయణిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కాట్పాడి వీజిరావ్ నగర్‌కు చెందినబాబుకు మోగనాంబాల్‌కు సంబంధాలున్నాయని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి విచారించగా అనకట్టు యూనియన్ డీఎంకే కార్యదర్శి అని తెలిసింది. పోలీసులు బాబును అదుపులోకి తీసుకొని విచారించగా బాబు ఎర్రచందనం స్మగ్లర్లకు సాయపడే వాడని తెలిసింది. మోగనాంబల్ సోదరుడు శరవణన్‌తో మంచి సంబంధాలున్నాయని ఆ సమయంలోనే ఎర్రచందనంకు ఉపయోగించే నగదును ఇక్కడ దాచి ఉంచుతున్నట్లు తెలిసింది.
 
 బాబుతో పాటు ఎర్రచందనం తరలించే ముఠా సభ్యులు వెంకటేషన్, సేట్టు, హరిమూర్తి, జయరామన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న మోగనాంబల్‌ను పట్టుకొని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
 ముందస్తు బెయిల్ కోసం మోగనాంబాల్ ప్రయత్నం: పోలీసులు మోగనాంబల్ కోసం గాలిస్తున్నటికీ మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఇందుకు ప్రభుత్వ న్యాయవాది అడ్డు చెప్పడంతో బెయిల్ అందలేదని సమాచారం అందింది.
 
ఆంధ్రలో గాలింపు వేగవంతం: మోగనాంబల్ ఆంధ్రాలో తలదాచుకొని ఉండవచ్చునని పోలీసులు అనుమానించి తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో గాలింపు చర్యలను వేగవంతం చేశారు. తిరుపతి ప్రాంతాల్లో ఎక్కువగా వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన ఎర్రకూలీలతో పాటు, ఎర్రచందనం తరలించే ముఠా సభ్యులతో సంబంధాలు ఉండడంతో పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు.

Advertisement
Advertisement