కాంగ్రెస్‌తో పొత్తుండదు: కరుణానిధి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో పొత్తుండదు: కరుణానిధి

Published Mon, Dec 16 2013 4:08 AM

కాంగ్రెస్‌తో పొత్తుండదు: కరుణానిధి - Sakshi

సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని డీఎంకే అధినేత కరుణానిధి స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు విషయంపై మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఆదివారం చెన్నైలోని అన్నా అరివాళయంలో డీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా పలు తీర్మానాలు చేశారు. కొందరు నాయకులు కాంగ్రెస్‌తో చేయి కలుపుదామని సూచించగా, మరి కొందరు బీజేపీతో  కలసి పయనిద్దామని సలహా ఇచ్చారు. ఇంకొందరు ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగి సత్తా చాటుదామన్నారు. చివరగా, పొత్తులకు సంబంధించిన పూర్తి నిర్ణయాధికారాలను పార్టీ అధ్యక్షుడు కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌లకు అప్పగిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం కరుణానిధి మీడియూతో మాట్లాడారు.  కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారా అన్న ప్రశ్నకు, అలాంటి పరిస్థితే లేదని, తమను అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్ యత్నించిందని చెప్పారు. అరుుతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా, అది వాజపేరుుతోనే ముగిసిన అధ్యాయమని పేర్కొంటూ, ఎన్నికల పొత్తులు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ వేశామని అందులో తుది నిర్ణయం తీసుకుంటామని కరుణానిధి పేర్కొన్నారు.  సమావేశంలో 2జీ స్పెక్ట్రం కేసును గుర్తు చేస్తూ.. కాంగ్రెస్‌తో పొత్తు ప్రతిపాదనను కరుణానిధి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ కుంభకోణంలో పార్టీ నేత రాజాతో పాటు డీఎంకే కూడా అవమానాల పాలైందన్నారని వెల్లడించాయి. ఆ కేసుకు సంబంధించి కరుణానిధి కూతురు, రాజ్యసభ ఎంపీ కనిమొళి, పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజాలు జైలు పాలైన విషయాన్ని కూడా కరుణానిధి ప్రస్తావించారని చెప్పాయి. శ్రీలంక తమిళుల సమస్యపై విభేదాలతో ఈ మార్చిలో డీఎంకే కాంగ్రెస్‌కు దూరమైంది. తాజా నిర్ణయం డీఎంకేకు కాకుండా, అన్నాడీఎంకేకు ఎక్కువగా లాభిస్తుందని ఒక నేత అభిప్రాయపడ్డారు. కాగా డీఎంకే నిర్ణయంపై కాంగ్రెస్ స్పందించలేదు. ‘పొత్తులపై ఏర్పాటైన ఆంటోనీ కమిటీకి మాత్రమే ఈ విషయంపై వాఖ్యానించే హక్కు ఉంది’ అని పార్టీ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ న్యూఢిల్లీలో పేర్కొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement