కశ్మీర్ ‘ప్రభుత్వం’పై తొలగని అనిశ్చితి | Sakshi
Sakshi News home page

కశ్మీర్ ‘ప్రభుత్వం’పై తొలగని అనిశ్చితి

Published Mon, Feb 1 2016 12:59 AM

కశ్మీర్ ‘ప్రభుత్వం’పై తొలగని అనిశ్చితి - Sakshi

పార్టీ నేతలతో మెహబూబా మంతనాలు
కేంద్రం స్పందన తర్వాత ఆలోచిద్దామని వ్యాఖ్య

 
 శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. దివంగత సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ కూతురు, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కటువుగా మాట్లాడుతుండటంతో.. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఆదివారం పీడీపీ నేతలతో 4 గంటలు భేటీ అయిన మెహబూబా.. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక అంశాలపై కేంద్రం స్పష్టమైన వైఖరి చెబితేనే.. బీజేపీపై పొత్తుపై ఆలోచిస్తామన్నారు. కశ్మీర్ లోయలో శాంతి నెలకొల్పి రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు దివంగత సీఎం ప్రయత్నిస్తే.. రాష్ట్రం, కేంద్రంలోని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నాయని ఆమె అన్నట్లు సమాచారం. 

పీడీపీ-బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మెల్లిగా ముందడుగు వేస్తున్నాయని.. అయితే.. ఇరు పార్టీల మధ్య నెలకొన్న సమస్యలతో.. ఎంత చేసినా ప్రజల్లో సానుకూల అభిప్రాయమే లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య బీజేపీతో పొత్తుపై పునరాలోచించాల్సిందేననే అభిప్రాయం పార్టీనేతల్లోనూ వ్యక్తమైనట్లు తెలిసింది. నిర్ణయాధికారాన్ని మెహబూబాకే వదిలేసినట్లు సమాచారం.

Advertisement
Advertisement