ఆప్‌ను బలిపశువు చేస్తున్నారు | Sakshi
Sakshi News home page

ఆప్‌ను బలిపశువు చేస్తున్నారు

Published Sun, Jan 21 2018 2:08 AM

Kejriwal Tells MLAs to Get Ready for ‘Big Battle’, Ensure BJP and Congress Lose Deposits in Case of Re-election - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం అంశంలో తమను బలిపశువును చేస్తున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఒకవేళ తమ ఎమ్మెల్యేల్ని అనర్హుల్ని చేసినా ఎన్నికలకు భయపడేది లేదని స్పష్టం చేసింది. ఆప్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించాలని శుక్రవారం రాష్ట్రపతికి ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 13, 2015 నుంచి సెప్టెంబర్‌ 8, 2016 వరకూ ఆ ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శులుగా లాభదాయక పదవుల్లో ఉన్నారని ఈసీ తన నివేదికలో పేర్కొంది.

దీనిపై ఆప్‌ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు గోపాల్‌ రాయ్‌ స్పందిస్తూ.. రాష్ట్రపతికి సిఫార్సుల్ని పంపేముందు ఈసీ తమను సంప్రదించలేదని తప్పుపట్టారు. ‘ఇది అప్రజాస్వామిక చర్య. ఢిల్లీ ప్రజలు, ప్రభుత్వం, ఢిల్లీ ముఖ్యమంత్రిపై వారు కక్ష తీర్చుకుంటున్నారు’ అని విమర్శించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో కూడా పార్లమెంటరీ కార్యదర్శుల్ని నియమించారని, మరి ఆప్‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ‘ద్వంద్వ ప్రమాణాల్ని పాటిస్తున్నారు. అందరికీ రాజ్యాంగ నిబంధనలు వర్తించవా? మమ్మల్ని బలిపశువుల్ని చేస్తున్నారు.

బ్రిటిష్‌ పాలన కంటే ఇది దారుణంగా ఉంది’ అని అన్నారు. న్యాయం కోసం అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ‘వారు లాభదాయక పదవుల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఏ పార్లమెంటరీ కార్యదర్శికి ఢిల్లీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు’ అని వివరణ ఇచ్చారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికలకు భయపడదని, తమ తలరాతను ఢిల్లీ ప్రజలు నిర్ణయిస్తారని రాయ్‌ పేర్కొన్నారు. ఈ అంశం కేవలం పార్లమెంటరీ కార్యదర్శులకు సంబంధించిందే కాదని.. ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయతకు కూడా సంబంధించినదని, అవి రాజీపడుతున్నాయని ఆరోపించారు. 20 మంది ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాల్ని చెప్పేందుకు రాష్ట్రపతిని సమయం కోరారని ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా చెప్పారు.

అనర్హత వెనుక యువ న్యాయవాది చొరవ..
ఒక్కోసారి చిన్న విషయాలే ఆ తర్వాత పెను ప్రభావాన్ని చూపుతాయి. ఆప్‌ ఎమ్మెల్యేలపై అనర్హత సిఫార్సుల వెనుక కూడా అలాంటి కారణమే దాగుంది. అప్పుడే న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన ప్రశాంత్‌ పటేల్‌(30) 2015 జూలైలో ఆప్‌ నిర్ణయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. యూపీలోని ఫతేపూర్‌ జిల్లాకు చెందిన అతను ఎంబీఏ పూర్తి చేశాక సామాజిక సేవపై ఆసక్తితో న్యాయ విద్యను అభ్యసించారు. ఆప్‌ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు వెనుక ఢిల్లీ అసెంబ్లీ మాజీ కార్యదర్శి ఎస్‌కే శర్మ రాసిన పుçస్తకం ప్రోత్సాహం ఉందని ప్రశాంత్‌ వెల్లడించారు.   

Advertisement
Advertisement