ఆచారం పేరిట ఇదేమి అనాచారం | Sakshi
Sakshi News home page

ఆచారం పేరిట ఇదేమి అనాచారం

Published Fri, Mar 2 2018 4:45 PM

Kerala Attukal Devi temple Ritual Kuthiyottam - Sakshi

సాక్షి, తిరువనంతపురం : మహిళల అయ్యప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందిన కేరళ, తిరువనంతపురం జిల్లాలోని అట్టుకల్‌ భగవతీ దేవీ ఆలయంలో ఏటా వైభవోపేతంగా జరిగే పొంగల్‌ పండుగలో సకల సంప్రదాయ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈసారి కూడా నిరాటంకంగా అంతే వైభవంగా జరిగాయి. ఫిబ్రవరి 22వ తేదీన ప్రారంభమై మార్చి 3న ముగియనున్న ఈ పది రోజుల మహోత్సవంతో అత్యంత కీలకమైన తొమ్మిదవ రోజు శుక్రవారం ‘అట్టుకల్‌ పొంగల్‌’  కార్యక్రమంలో లక్షలాది మంది మహిళలు పాల్గొని బియ్యం, బెల్లం, కొబ్బరితో మట్టి కుండల్లో పొంగలి వండి అట్టుకల్‌ భగవతీ దేవీకి నైవేద్యంగా అర్పించారు. ఈసారి దాదాపు ఆరు లక్షల మంది మహిళలు పాల్గొన్న ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూసేందుకు ఏకంగా 4,200 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు.

అయినప్పటికీ వారికి తెలియకుండా లేదా తెలిసి ఓ ఘోరం, ఓ అనాచారం యథావిధిగా జరిగిపోయింది. ఎనిమిదేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు వయస్సున్న కొన్ని వందల మంది బాలుర శరీరాల్లోకి ఇనుప రింగులు రక్తాన్ని చిందిస్తూ దూసుకుపోయాయి. బాధను భరించలేక బయటకొచ్చిన వారి ఆక్రందనలు దైవ వాయిద్యాల ఘోషలో ఎవరికి వినిపించకుండా పోయాయి. ఈ ఘోర అపచారాన్ని అడ్డుకునేందుకు సాక్షాత్తు కేరళ డీజీపీ ఆర్‌ శ్రీలేఖ (మొట్టమొదటి మహిళా డీజీపీ), ఆమెకు తోడుగా డాక్టర్‌ పీ. మురళీధరన్, ‘అట్టుకుల్‌ అమ్మ’  పుస్తక రచయిత లక్ష్మీ రాజీవ్‌ చివరి వరకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దైవభీతికి దాసోహం అన్న ఆలయ పూజారులు ఎప్పటిలాగ, కాకపోతే ఈసారి కాస్త గుట్టుగా ‘కుతియొట్టం’ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

కుతియొట్టం కార్యక్రమం
పొంగల్‌ కార్యక్రమం ప్రారంభమైన రెండు రోజుల తర్వాత ప్రారంభమై ఒక రోజు ముందుగా ముగిసే ఓ సంప్రదాయ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ‘కుతియొట్టం’ అని పిలుస్తారు. ఈ కార్యక్రమంలో కేరళతోపాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎనిమిదేళ్ల నుంచి 12 ఏళ్లలోపు వయస్సున్న బాలురు పాల్గొంటారు. వీరంతా ప్రతిరోజూ ఆలయ కోనేరులో మూడుసార్లు మునుగు స్నానాలు చేసి వస్తారు. మొలతాడు వరకు లుంగీలాగా తెల్లటి దుస్తులు ధరించి అణుక్షణం ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. పూటకు ఓ ముద్ద ప్రసాదం చొప్పు, అది రెండు పూటలు మాత్రమే వీరికి ఆహారంగా అందుతుంది. రాత్రిపూట ఆలయ ప్రాంగణంలో నేలమీద చాపలపై మాత్రమే పడుకోవాలి. వారం రోజుల ఈ కార్యక్రమం ముగిసేవరకు తల్లిదండ్రులను చూసేందుకు పిల్లలను అనుమతించరు. అలాగే తల్లిదండ్రులను కూడా పిల్లల వద్దకు అనుమతించారు.

ఆకలికి తాళలేక, చలికి తట్టుకోలేక పిల్లలు ఏడ్చి పెడబొమ్మలు పెట్టినా అలయ అధికారులెవరూ పట్టించుకోరు. ఏడో రోజు అంటే, ఆలయ పొంగల్‌ ఉత్సవాలు ముగిసే ముందు రోజున ఈ పిల్లలను ఆభరణాలు, కిరీటాలు, పూల దండనలతో అలంకరిస్తారు. ఆ తర్వాత వారి పక్కటెముకల కింది భాగంలో వెండి ధారం దూర్చిన ఇనుప రింగులను శరీరంలోకి పంపిస్తారు. 24 గంటల తర్వాత వాటిని మళ్లీ తొలగిస్తారు. రింగులు పంపిన చోట ఇన్పెక్షన్లు వచ్చి పిల్లలకు పుండ్లు అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కొన్ని వందల మంది పిల్లలు పాల్గొంటారు. గతేడాది 900 మంది పిల్లలు పాల్గొనగా, ఈ సారి అంతకన్నా ఎక్కువ మంది పాల్గొన్నట్లు తెల్సింది.

ఒంటరి పోరాటం
ఆచారం పేరుతో జరుగుతున్న ఈ అనాచారాన్ని ఎలాగైన ఆపాలని తొలి రాష్ట్ర మహిళా డీజీపీగా రికార్డుల్లోకి ఎక్కిన శ్రీలేఖ చివరకు కృషి చేశారు. ఆమె ఆలయ అధికారులను కలుసుకొని ఈ అనాచారాన్ని ఆపాలని కోరారు. అలా చేయడం అది అపచారం అవుతుందని, అమ్మోరికి కోపం వస్తుందని అధికారులు భయాందోళనలు వ్యక్తం చేశారు. తాను కూడా అమ్మవారి భక్తురాలినేనని, ఆమెకు కోపం రాదని నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు. బాలుర శరీరంలోకి ఇనుప రింగులను పంపించేటప్పుడు నొప్పి కలిగే మాట వాస్తవమేగానీ, ఆ తర్వాత వారికి ఎలాంటి గాయం కాదని, కొన్ని రోజుల్లోనే వారి శరీరాలపై మరక కూడా మాయం అవుతుందని, భవిష్యత్తులో ఆ పిల్లలకి అంతా మంచే జరుగుతుందిని ఆలయ అధికారులు వాదించారు.

దేవుడిని నమ్మే శ్రీలేఖ తన పదవ ఏట నుంచి ప్రతి ఏటా ఈ పొంగల్‌ ఉత్సవాల్లో పాల్గొంటున్నారట. గత ఏడాది కూడా పాల్గొన్నారట. ఆ సందర్భంగా ఆమె బాడీగార్డ్‌ ఆచారం పేరిట పిల్లలను వేధిస్తున్న అనాచారం గురించి చెప్పారట. అందుకని ఈసారి ఈ కార్యక్రమాన్ని ఎలాగైన ఆపాలని చూశారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే మత సంబంధిత కార్యక్రమాల్లో తాము జోక్యం చేసుకోలేమని సమాధానం వచ్చిందట. మతం పేరిట హింసను కొనసాగిస్తుంటే  హింస నుంచి పిల్లలను రక్షించేందుకున్న చట్టాలను ఉపయోగించడంలో తప్పులేదని కూడా ఆమె వాదించారట.

ప్రతి ఏట పిల్లలకు చికిత్స
కుతియొట్టం కార్యక్రమంలో గాయపడిన పిల్లల్లో తాను ప్రతి ఏటా ఐదారుగురికి వైద్య చికిత్సను అందజేస్తున్నట్లు ఆలయ ప్రాంతంలో 30 ఏళ్లుగా ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్‌ పీ. మురళీధరన్‌ మీడియాకు తెలియజేశారు. 24 గంటలకుపైగా ఇనుప రింగులు బాలుర చర్మంలో ఉండడం వల్ల అక్కడ వారికి నీరుతో ఉబ్బడం, ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. తాను ఈ అనాచారాన్ని 2014లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ దష్టికి తీసుకెళ్లానంటూ అప్పుడు జరిగిన విషయాలను వెల్లడించారు.

హక్కుల కమిషన్‌ దర్యాప్తునకు ఆదేశించగా, పిల్లలకు స్టెరిలైజ్‌ చేసిన ఇనుప రింగులనే ఎక్కిస్తున్నారని, ఆ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు, వైద్య బందం సమక్షంలోనే ఈ కార్యక్రమం జరుగుతుందని పోలీసులు మానవ హక్కుల సంఘానికి నివేదిక సమర్పించారు. అన్ని కోణాల నుంచి ఈ అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగిస్తూ మానవ హక్కుల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆ అంశాన్ని పక్కన పడేసింది.

‘పిల్లలకు ఇనుప రింగులు గుచ్చతుంటే ‘అట్టుకల్‌ అమ్మ’కు కూడా నిజంగా నొప్పి కలుగుతుంటుంది’ అని ‘అట్టుకల్‌ అమ్మ: ది గాడెస్‌ ఆఫ్‌ మిలియన్స్‌’ అనే పుస్తకం రాసిన రచయిత లక్ష్మీ రాజీవ్‌ వ్యాఖ్యానించారు. ఈ అనాచారాన్ని వదిలేయాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. అనాచారానికి వ్యతిరేకంగా పోరాడిన రాష్ట్ర డీజీపీ దీనికి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా పొంగల్‌ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే పొంగల్‌ వేడుకల సందర్భంగా మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు మొట్టమొదటి సారిగా మహిళా బెటాలియన్‌ను వేడుకల వద్దకు పంపించారు. అనాచారాన్ని ఆపాల్సిన బాధ్యతను ఇక సాక్షాత్తు అట్టుకల్‌ అమ్మకే అప్పగించారు. ప్రముఖ తమిళ పౌరాణిక సాహిత్యం ‘శిలప్పాధికారం (తెలుగులో అనువాదం: కళ్యాణ మంజీరాలు)లోని కన్నగీ క్యారెక్టరే అట్టుకల్‌ అమ్మగా అవతరించిందన్నది తమిళుల విశ్వాసం.

Advertisement
Advertisement