హైకోర్టు వ్యాఖ్యలతో తప్పుకున్న కేరళ మంత్రి | Sakshi
Sakshi News home page

హైకోర్టు వ్యాఖ్యలతో తప్పుకున్న కేరళ మంత్రి

Published Wed, Nov 15 2017 1:48 PM

Kerala minister Thomas Chandy resigns - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సొంత ప్రభుత్వంపై పిటిషన్‌ దాఖలు చేయడం పట్ల కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టడంతో ఆ రాష్ట్ర కేబినెట్‌ మంత్రి థామస్‌ చాందీ బుధవారం రాజీనామా చేశారు. 2016లో ఎల్‌డీఎఫ్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి మండలి నుంచి వైదొలగిన మూడవ మంత్రి థామస్‌ కావడం గమనార్హం. భూములు లాక్కున్నాననే ఆరోపణలు రావడంతోనే కేబినెట్‌ నుంచి తప్పుకుంటున్నానని ఆయన చెప్పారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ త్వరలోనే తాను రాష్ట్ర కేబినెట్‌లోకి తిరిగి వస్తానని థామస్‌ చాందీ ధీమా వ్యక్తం చేశారు.

అలప్పుజలోని తన లేక్‌ ప్యాలెస్‌ రిసార్ట్‌లో థామస్‌ పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఆయన అక్రమాలపై అలప‍్పజ జిల్లా కలెక్టర్‌ వెల్లడించిన నివేదికను సవాల్‌ చేస్తూ థామస్‌ కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్‌ నివేదికను సవాల్‌ చేస్తూ కేబినెట్‌ మంత్రి పిటిషన్‌ వేయడం రాజ్యాంగం నిర్ధేశించిన మంత్రివర్గ ఉమ్మడి బాధ్యతకు విరుద్ధమని పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తనకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను తొలగించాలని తాను సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని థామస్‌ చెప్పారు.

Advertisement
Advertisement