వంతెన కోసం ఓ విద్యార్థి వినూత్న ఆందోళన | Sakshi
Sakshi News home page

వంతెన కోసం ఓ విద్యార్థి వినూత్న ఆందోళన

Published Wed, Jun 15 2016 2:31 PM

వంతెన కోసం ఓ విద్యార్థి వినూత్న ఆందోళన

తిరువనంతపురం: కేరళలోని అలప్పుజా జిల్లా, పెరుంబులం గ్రామానికి చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి అర్జున్ సంతోష్ తన గ్రామానికి వంతెన కోసం వినూత్న పోరాటాన్ని ప్రారంభించారు. ఆ విద్యార్థి పూతొట్టలోని తన బడికి వెళ్లాలంటే ప్రతిరోజు మూడు కిలోమీటర్ల వెడల్పున్న వెంబనాడ్ సరస్సును దాటి వెళ్లాల్సి ఉంటుంది. పడవలో సరస్సు దాటాలంటే పడవలు సరైన సమయానికి రావు. వచ్చినా అవి జనంతో కిక్కిర్సి ఉంటాయి. దారిలో ప్రమాదం జరిగితే అంతే సంగతులు. సరస్సు దాటేందుకు తమ గ్రామానికి ఏ వంతెన కావాలంటూ పెరుంబులం గ్రామానికి చెందిన ప్రజలు గత 25 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.

 అర్జున్ సంతోష్ పడవలో బడికెళ్లడం వల్ల బడికి లేటవుతోంది. బడిలో పనిష్మెంట్ ఎదుర్కోవాల్సి వస్తోంది. వంతెన లేక పోవడం వల్ల తనతోపాటు తన తోటి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాటం చేయాలని ఓ రోజు నిర్ణయించుకున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పడవలో కాకుండా ఈదుకుంటూ బడికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అంతే వారం రోజులుగా మూడు కిలోమీటర్లు నీటిలో ఈదుకుంటూ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళుతున్నారు. సంతోష్ తన నిరసనతో అధికారుల దృష్టిని ఆకర్షించాడుకానీ వంతెన కోసం మాత్రం అధికారులెవరూ సానుకూలంగా స్పందించలేదు.
 
ఓ మైనర్ బాలుడు ఇలా రోజు సరస్సులో మూడు కిలోమీటర్లు ఈదడం ప్రమాదకరమని, ఎప్పుడైనా ఏ ప్రమాదమైనా జరగొచ్చని అలప్పుజా జిల్లా కలెక్టర్ ఆర్. గిరిజా అభిప్రాయపడ్డారు. అందుకని వెంటనే తన నిరసన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందిగా కోరుతూ ఆ బాలుడికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు.
 
కలెక్టర్ విజ్ఞప్తి మేరకు తాను నిరసన కార్యక్రమాన్ని విరమించేందుకు సిద్ధంగానే ఉన్నానని, అయితే వంతెన నిర్మాణ పనులు చేపట్టకపోతే మళ్లీ నిరసన మొదలు పెడతానని సంతోష్ మీడియాకు తెలిపారు. తన గ్రామంలో పది వేల మంది ప్రజలు నివసిస్తున్నారని, వంతెన లేకపోవడం వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా వంతెన మంజూరు చేయాలని విద్యార్థి సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
Advertisement