మావోయిస్టుల వార్తలు రాస్తే  పాత్రికేయులను హత మార్చండి..!

29 Sep, 2017 11:38 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌ పోలీసు అధికారి ఆదేశాలు?

పోలీసులు, మావోయిస్టుల మధ్య నలుగుతున్న పాత్రికేయులు

జయపురం(ఒడిశా): రాష్ట్ర సరిహద్దున గల మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పాత్రికేయులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. తమ సమాచారాలను పోలీసులకు అందజేస్తున్నారన్న ఆరోపణతో మావోయిస్టులు వారిని హతమారుస్తుండగా, మావోయిస్టులకు పోలీసుల సమాచారం అందిస్తున్నారని నిందిస్తూ ఖాకీలు వారిపై దాడులు జరుపుతున్నారు. ఉభయ వర్గాల మధ్య నలిగిపోతున్న పాత్రికేయులపై ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర  బీజాపూర్‌ పోలీసు అధికారి ఒకరు పోలీసులకు మరో ఆదేశం జారీ చేయడం పాత్రికేయులలో భయాందోళనలు సృష్టిస్తున్నట్లు సమాచారం. బీజాపూర్‌ పోలీస్‌ అ«ధికారి ఒకరు విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్‌లో మావోయిస్టుల వార్తలు  రాసే పాత్రికేయులను హతమార్చండి అని తన ఆధీనంలో ఉన్న పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు  సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత బస్తర్‌ ప్రాంతంలో బుధవారం ఒక వీడియో క్లిప్పింగ్‌  ప్రచారమైంది.  –ఆ వీడియో క్లిప్పింగ్‌లో ఒక ఉన్నత పోలీసు అధికారి, మావోయిస్టులకు  సంబంధించిన వార్తలను ప్రచురిస్తే  ఆ పాత్రికేయులను హతమార్చండి అని  తన పరిధిలోగల పోలీసులను ఆదేశించారని ఆరోపణ. ఈ విషయంలో  బీజాపూర్‌ ప్రెస్‌క్లబ్‌ తరఫున ఒక క్లిప్పింగ్‌ ప్రజలకు తెలియజేసినట్లు సమాచారం. ఈ క్లిప్పింగ్‌లో ఒక ఉన్నత పోలీసు అదికారి హిందీ భాషలో ఆదేశించిన విషయం ఇలా ఉంది. ‘రెహనా, ఉదర్‌ సే కోయి పత్రకార్‌ దేఖె జో నక్సలియోంకో ఖబర్‌ కరనే కేలియే గయాహో తె ఉసే గోలి మారి మరిదే(హైఅలర్ట్‌గా ఉండండి. ఆ వైపు ఎవరైనా పాత్రికేయుడు కనిపిస్తే అతడు నక్సలైట్లకు సమాచారం అందించేందుకు వెళ్తే తుపాకీ తూటాలతో కాల్చండి) అని ఉంది. దీనిపై ఆ ప్రాంత  జర్నలిస్టులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్లిప్పింగ్‌లో బీజాపూర్‌ జిల్లా  పోలీస్‌ఉన్నతాధికారి, పోలీసులకు  ఇటువంటి ఆదేశాలు జారీ  చేశారని దీనిని తాము నిరసిస్తున్నామని  సంబంధిత అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత పాత్రికేయులు  డిమాండ్‌ చేస్తున్నారు. 

మావోయిస్టు ప్రాంతంలో పని చేయడం కష్టం
పోలీసులకు సమాచారం అందిస్తున్న వారిగా అనుమానిస్తూ  జర్నలిస్టులను మావోయిస్టు హతమారుస్తున్నారని   పాత్రికేయులు మావోయిస్టుల సమర్థకులని భావిస్తూ  వారిపై దాడి చేస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పాత్రికేయులు పనిచేయడం చాలా కష్టమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ     విషయం  వెల్లడి కావడంతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పోలీసు స్వతంత్ర డీజీ(నక్సల్‌ వ్యతిరేక ఆపరేషన్‌ విభాగం) డీఎన్‌ అవష్థి ఆ వీడియో క్లిప్పింగ్‌పై దర్యాప్తుచేసేందుకు ఆదేశించారు. దీనిలో ఏ పోలీసు అధికారికి సంబంధం ఉన్నా  వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.ఇదే నిజమైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పాత్రి కేయులు, మీడియా ప్రతినిధులు పనిచేయడం ప్రాణాలను పణంగా పెట్టడమేనని  భయపడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పనిచేసే పాత్రికేయులు, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని పాత్రికేయులు కోరుతున్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు