కోట్ల మార్పిడి.. బడా రియల్టర్‌ అరెస్టు | Sakshi
Sakshi News home page

కోట్ల మార్పిడి.. బడా రియల్టర్‌ అరెస్టు

Published Thu, Dec 22 2016 10:37 AM

కోట్ల మార్పిడి.. బడా రియల్టర్‌ అరెస్టు - Sakshi

కోల్‌కతా: ప్రముఖ వ్యాపారవేత్త కోల్‌ కతాకు చెందిన బడా రియల్టర్‌ పర్సామల్‌ లోధాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గురువారం అరెస్టు చేశారు. దాదాపు 25 కోట్లు పాత డబ్బును కొత్త నోట్లు మార్చేందుకు ప్రయత్నించినందుకు ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ తోపాటు, మైనింగ్‌ వ్యాపారాల్లో కూడా ఆయనకు పేరుంది. వడ్డీ వ్యాపారాలు కూడా నిర్వహిస్తారట. ముంబయి విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

లాయర్‌ రోహిత్‌ టాండన్‌ కార్యాలయంలో పెద్ద మొత్తంలో నగదు లభ్యం కావడం, ఆ డబ్బు లోధాది అని చెప్పిన మేరకే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కుమార్తె వివాహాన్ని ఇటీవల కళ్లు చెదిరేలా జరిపించారు. ఈ వివాహ వేడుకకు పెద్దమొత్తంలో రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అప్పటి నుంచే ఐటీ అధికారులు అతడిపై ఓ కన్నేసి ఉంచారు. అంతేకాదు.. టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు జె.శేఖర్‌ రెడ్డి నల్లడబ్బును తెల్ల డబ్బుగా మార్చడంలో కూడా లోధా సహకరించినట్లు సమాచారం. శేఖర్‌ రెడ్డి ఆయన అనుచరుడు కె.శ్రీనివాస రెడ్డిలను సీబీఐ అధికారులు బుధవారం చెన్నైలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

చెన్నై ఎగ్మూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా జనవరి 3వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్‌ విధించడంతో వారిని పుళల్‌ జైలుకు తరలించారు. పెద్ద నోట్లు రద్దు తర్వాత ఇన్‌కమ్‌ టాక్స్‌ (ఐటీ) అధికారులు జరిపిన సోదాల్లో శేఖర్‌ రెడ్డి, ఆయన అనుచరుల ఇళ్లలో రూ. 170 కోట్ల నగదు, 127 కిలోల బంగారం దొరికిన సంగతి తెలిసిందే. దీనిపై శేఖర్‌ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, ప్రేమ్‌ కుమార్‌లపై నేరపూర్వక కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ సమయంలోనే కోల్‌ కతాకు చెందిన వ్యాపార వేత్త లోధాను ఈడీ అధికారులు అరెస్టు చేయడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement