Sakshi News home page

ఫన్ వీడియో వెనుక సంచలన వాస్తవాలు

Published Tue, Nov 1 2016 12:42 PM

ఫన్ వీడియో వెనుక సంచలన వాస్తవాలు

పుణె: కంటికి కనిపించేదంతా వాస్తవం కాకపోవచ్చు. ప్రేమలత షిండే విషయంలో ఇది అక్షరాల నిజం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పనిచేస్తున్న ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అవుతోంది. 'ప్రపంచంలోనే అతివేగంగా పనిచేసే క్యాషియర్ మహిళ' అన్న వాక్యంతో ఈ వీడియోకు కోటి 30 లక్షల వ్యూస్ వచ్చాయి. బ్యాంకులో మెల్లగా పనిచేస్తున్న ఆమెను అవహేళన చేస్తూ ఈ వీడియో తీశారు. దీన్ని బాలరాజు సోమిశెట్టి అనే వ్యక్తి అక్టోబర్ 24న సోషల్ మీడియాలో పెట్టాడు. నిజానిజాలు పట్టించుకోకుండా 1,54,000 మంది ఈ వీడియోను షేర్ చేశారు. గుడ్డిగా 72 వేల మంది లైక్ కొట్టారు.

అయితే అందరిలా కాకుండా కుందన్ శ్రీవాస్తవ అనే సామాజిక కార్యకర్త నిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆయన పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. వీడియోలో ఉన్న మహిళ పేరు ప్రేమలత షిండే అని, ఆమె పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పనిచేస్తున్నారని తెలుసుకున్నారు. ఆమె వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ కానున్నారు. ప్రేమలత పక్షవాతం బారిన పడి కోలుకున్నారని, రెండుసార్లు గుండెపోటుకు గురయ్యారని తెలియడంతో ఆశ్చర్యపోయారు. వైద్యం చేయించుకోవడానికి ఆమె చాలా కాలం పాటు సెలవు పెట్టారు. అయితే సెలవులు అయిపోవడంతో ఆరోగ్యం సహకరించకున్నా మళ్లీ బ్యాంకులో అడుగుపెట్టారు. అయితే రిటైర్మెంట్ వరకు నెలనెలా జీతం ఇస్తామని, బ్యాంకులో పనిచేయాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు ఆమెకు భరోసాయిచ్చారు.

పనిచేయకుండా జీతం తీసుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో అదరనపు క్యాష్ కౌంటర్ ఏర్పాటు చేసి ఆమెకు అప్పగించారు. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా ఆమె నిబద్దతతో విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె ఒక్కగానొక్క కొడుకు తన భార్యపిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు. ఆమె మంచాన పడినప్పుడు కొద్దిరోజులు తల్లికి సేవలు చేసి వెళ్లాడు.

ఇదంతా తెలియకుండా ఎవరో ఆకతాయి ప్రేమలత పనితీరును వీడియో తీశాడు. స్ఫూర్తిదాయకమైన ఆమె కథ గురించి తెలుసుకోకుండా అవమానించడం సరికాదని శ్రీవాస్తవ అన్నారు. మహిళ, వృద్ధురాలు అనే కనీసం గౌరవం లేకుండా ఆమెను ఆడిపోసుకోవడం అవమానవీయమని మండిపడ్డారు. ఈ వీడియో చూసి నవ్వుకుంటున్న మతిలేనివాళ్ల కళ్లు తెరిపించాలన్న ఉద్దేశంతో ప్రేమలత గురించి అన్ని విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ వీడియోను చూడాలని శ్రీవాస్తవ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement