ఎప్పుడు ఎవరేమన్నారు? | Sakshi
Sakshi News home page

ఎప్పుడు ఎవరేమన్నారు?

Published Sun, Nov 8 2015 1:07 PM

ఎప్పుడు ఎవరేమన్నారు? - Sakshi

బిహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు నుంచే ఎన్నికల వేడి మొదలైపోయింది. వివిధ పార్టీల నాయకులు ఎన్నికల ఫలితాల గురించి రకరకాలుగా స్పందించారు. ఏ సమయంలో ఎవరు ఏమన్నారో చూద్దామా..

12.20: మహాకూటమి భాగస్వామి పక్షాలను రాహుల్ గాంధీ అభినందించారు. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి విజయమని, దురహంకారానికి పరాజయమని, విద్వేషంపై ప్రేమ విజయమని, మొత్తానికి బీహార్ ప్రజల విజయమని వ్యాఖ్యానించారు.
12.10: బీజేపీ నాయకుడు శత్రఘ్న సిన్హా, నీతీష్, లాలూలకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. బీహార్ ప్రజలిచ్చిన తీర్పును శిరస్సు వంచి స్వీకరిస్తున్నానని తెలిపారు.
11:55 ఏఎం: బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు జేడీయూ నాయకుడు నితీష్ కుమార్‌కు ఫోన్ చేసిన మహాకూటమి విజయం పట్ల అభినందనలు తెలియజేశారు. బీజేపీ ఓటమి పట్ల ఆత్మావలోకనం చేసుకుంటామని చెప్పారు.
11:30: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నితీష్ కుమార్‌కు ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు. ఇది సహనానికి విజయమని వ్యాఖ్యానించారు.
11:15: శివసేన సంజయ్ రౌత్ నితీష్‌ను అభినందిస్తూ దేశ రాజకీయాల్లో ఇది గొప్ప మలుపని, ప్రధాన మంత్రి అహంకారం బీజేపీని ఓడించిందని వ్యాఖ్యానించారు.
11:05: ఇది చారిత్రక విజయమంటూ నితీష్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
11:00: ఓ విజయాన్ని నాయకుడికి ఆపాదిస్తామని, అదే పరాజయాన్ని పార్టీకి ఆపాదిస్తామని, కూటమి విజయసారథి నితీష్ కుమార్ సాహెబ్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. భవిష్యత్ దేశ రాజకీయాలకు తమ విషయం ఓ గుణపాఠం అవుతుందని అన్నారు.
11:00: బీహార్ ప్రజల తీర్పును గౌరవిస్తామని బీజేపీ నాయకుడు రామ్‌మాధవ్ వ్యాఖ్యానించారు.
10:30:బీజేపీ నాయకుడు ప్రకాష్ జవడేకర్ మీడియాతో మాట్లాడుతూ ‘మరికొన్ని గంటలు నిరీక్షిద్దాం. పరస్పరం విమర్శించుకునే పార్టీలన్నీ ఒకచోటకు చేరాయని, ఇది ఎన్నికల ఫలితాలపై కచ్చితంగా ప్రభావాన్ని చూపుతుందని వ్యాఖ్యానించారు.
10:15: జేడీయూ నాయకుడు శరద్ యాదవ్ బీహార్ ప్రజలను అభినందించారు. మహాకూటమికి 150కు పైగా సీట్లు వస్తాయని చెప్పారు.
9:15: ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్‌లను చూపిపోయిన బీజేపీ కార్యకర్తలు పట్నాలోని తమ ఆఫీసు ముందు బాణసంఛా కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు.
9:00: రాష్ట్ర ఎన్నికల్లో అమిత్ షా నిర్వహించిన ప్రచారం తీరును మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నానని, ఈ ఫలితాలు దేశ రాజకీయాలనే పూర్తిగా మార్చివేస్తాయని బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
8:30: బీహార్ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించడం ఖాయమని, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు నిదర్శణమని బీజేపీ నాయకుడు జవదేకర్ వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వం పట్ల, ఆయన అభివృద్ధి నినాదం పట్ల ప్రజలకున్న విశ్వాసం అలాంటిదని అన్నారు.
7.45: బిహార్ రాజకీయాల్లో లాలూ నిర్వహించిన పాత్ర అంతా ఇంతా కాదని, మంచి జరిగిందా, చెడు జరిగిందా ఇక్కడ ముఖ్యం కాదని లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు.
6.30: ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పాత్రికేయులకు గుడ్‌మార్నింగ్ చెప్పారు. మహాకూటమి గెలవబోతోందని, మెజారిటీ ఖాయమని చెప్పారు.

Advertisement
Advertisement