లీ ప్రపంచ దార్శనిక మేధావి | Sakshi
Sakshi News home page

లీ ప్రపంచ దార్శనిక మేధావి

Published Mon, Mar 30 2015 2:01 AM

లీ ప్రపంచ దార్శనిక మేధావి - Sakshi

ఆయన మరణంతో ఒక శకం ముగిసింది: మోదీ
{పభుత్వ లాంఛనాలతో సింగపూర్ జాతిపితకు అంత్యక్రియలు
జోరు వర్షంలో సుదీర్ఘ అంతిమయాత్ర.. వేలాది మంది హాజరు
{పపంచ దేశాల నేతలతో పాటు హాజరైన భారత ప్రధాని

 
సింగపూర్: సింగపూర్ జాతిపిత, ఆ దేశ తొలి ప్రధానమంత్రి లీ క్వాన్ యీ.. సమకాలీన అగ్రగణ్య మేధావుల్లో ఒకరని, ఆసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు ముందుకు సాగేందుకు అవిశ్రాంత కృషి సల్పారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. దార్శనికుడైన లీ మరణంతో ఒక శకం ముగిసినట్లయిందన్నారు. లీతో తన స్నేహానికి.. తన ఆర్థిక ప్రగతికి ఆయన మద్దతుకు భారత్ ఎంతో విలువనిచ్చిందన్నారు. తనకు వ్యక్తిగతంగా లీ ఒక స్ఫూర్తి ప్రదాత అని తెలిపారు. గత సోమవారం కన్నుమూసిన లీ క్వాన్ యీ(91) అంత్యక్రియలను ఆదివారం సింగపూర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కుండపోత వానను సైతం లెక్కచేయకుండా వేలాది మంది అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. భారత ప్రధాని మోదీ సహా పలు ప్రపంచ దేశాల అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్లమెంట్ భవనం నుంచి 15.4 కిలోమీటర్ల దూరంలోని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ వరకూ జోరు వానలోనే లీ అంతిమయాత్ర సాగింది. సింగపూర్ త్రివిధ సైనిక దళాలు.. 21 తుపాకుల వందనం, నాలుగు ఎఫ్-16 జెట్ విమానాలతో వైమానిక వందనం, నౌకా వందనం సమర్పించాయి. లీ తన మరణానికి ముందే ఒక లేఖలో కోరినట్లు.. ఆయన అస్థికలను, ఆయన భార్య అస్థికల పక్కన సమాధి చేయటానికి.. వర్సిటీ నుంచి ప్రైవేటుగా తరలించారు.

లీ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆదివారం సింగపూర్ చేరుకున్న మోదీ.. లీ కేవలం ఆగ్నేయాసియానే కాక.. మొత్తం ఆసియా తన స్వీయ గమ్యాన్ని విశ్వసించేలా స్ఫూర్తినిచ్చారని కీర్తించారు. సింగపూర్ స్వాతంత్య్ర స్వర్ణోత్సవం జరుపుకుంటున్న వేళ.. సింగపూర్ సాధించిన విజయాలతో లీ సంతృప్తి చెందివుంటారని, దేశ భవిష్యత్తు పట్ల ధీమాగా ఉండివుంటారని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సింగపూర్ ప్రజలు తమ జాతిపితను కోల్పోయిన విచారాన్ని భారత్ పంచుకుంటోందని.. లీ గౌరవార్థం భారత్‌లో ఆదివారం అధికారిక సంతాప దినం పాటిస్తున్నామని తెలిపారు. లీ క్వాన్ యీ తనయుడు సింగపూర్ ప్రస్తుత ప్రధాని లీ సీన్ లూంగ్ మాట్లాడుతూ.. తన తండ్రి జీవితాంతం సింగపూరే శ్వాసగా బతికారని నివాళులర్పించారు. ఇన్నేళ్లూ తమకు మార్గదర్శనం చేసిన వెలుగు ఇప్పుడు ఆరిపోయిందని పేర్కొన్నారు. అంత్యక్రియలకు హాజరైన ప్రపంచ నేతల్లో.. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గ్వెన్-మే, ఆస్ట్రేలియా ప్రధాని అబాట్ తదితరులు ఉన్నారు.

ఇజ్రాయెల్ అధ్యక్షుడితో మోదీ చర్చలు...

ఇదిలావుంటే.. తన సింగపూర్ పర్యటనలో మోదీ ఆ దేశ గౌరవ సీనియర్ మంత్రి గో చోక్ టాంగ్, ఉప ప్రధానమంత్రి తార్మాన్ షముగరత్నంలతో ఆదివారం ఉదయం సమావేశమై చర్చలు జరిపారు. లీ క్వాన్ యీ ఆకాంక్షలకు అనుగుణంగా భారత్ - సింగపూర్‌లు కలిసి పనిచేయగల అంశాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ భేటీలో చర్చలు జరిపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి తెలిపారు. 2006 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో సింగపూర్‌లో పర్యటించిన మోదీ.. మళ్లీ ఆ దేశంలో పర్యటించటం ఇదే తొలిసారి. మరోవైపు.. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్లిన్‌తో కూడా మోదీ సింగపూర్‌లో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీని ఇజ్రాయెల్ పర్యటనకు రావాల్సిందిగా రివ్లిన్ మరోసారి ఆహ్వానించారు. క్లింటన్ తదితర దేశాల నేతలతోనూ మోదీ ముచ్చటించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement