ఇలాగేనా సభ నడిపేది! | Sakshi
Sakshi News home page

ఇలాగేనా సభ నడిపేది!

Published Thu, Dec 8 2016 3:57 AM

ఇలాగేనా సభ నడిపేది!

 పార్లమెంటు స్తంభనపై అడ్వాణీ మండిపాటు    
 స్పీకర్, మంత్రి సభను నడపలేకపోతున్నారన్న అడ్వాణీ
 అధికార, విపక్షాలు రెండూ దొందూ దొందే

 
 న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వరుసగా మూడోవారం కూడా స్తంభించటంపై బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ పార్లమెంటేరియన్ ఎల్‌కే అడ్వాణీ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సభలో కొందరు విపక్ష సభ్యులు.. అధికార ఎంపీల సీట్లవైపు వచ్చి వెల్‌లో నినాదాలు చేస్తుండటంతో ఆగ్రహంగా.. మంత్రి అనంత్ కుమార్‌పై రుసరుసలాడారు. ‘స్పీకర్ కానీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గానీ సభను నడపలేకపోతున్నార’ని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘లోక్‌సభ కార్యకలాపాలను స్పీకర్ నడపటం లేదు. ఈ విషయాన్ని ఆమెకే చెబుతాను. ఇదే విషయాన్ని బహిరంగంగా వెల్లడిస్తాను. ప్రస్తుత పరిస్థితికి అధికార, ప్రతిపక్షాలదే బాధ్యత’ అని నిప్పులు చెరిగారు. విపక్షాల ఆందోళన మధ్య సభ వాయిదా పడగానే.. ‘ఎంతసేపు వాయిదా’ అని లోక్‌సభ అధికారిని అడిగారు. ఆయన పదిహేను నిమిషాలని చెప్పగానే.. సభను ‘నిరవధిక వాయిదా వేయలేకపోయారా?’ అంటూ మౌనంగా వెళ్లిపోయారు. అడ్వాణీకి నచ్చజెప్పేందుకు అనంతకుమార్ యత్నించినా.. పెద్దాయన శాంతించలేదు. అనంతరం మీడియా గ్యాలరీ వైపు చూస్తూ.. ఈ వార్తను కవర్ చేయండనే సంకేతాలిచ్చారు.
 
 అడ్వాణీ సూచనను పాటించండి: కాంగ్రెస్
 పార్లమెంటు వ్యవహారాలను నిర్వహించటంలో అడ్వాణీ ఇచ్చిన సూచనను కేంద్రం పాటించాలని కాంగ్రెస్ సూచించింది. అడ్వాణీ సరైన కోణంలోనే అర్థం చేసుకున్నారని కాంగ్రెస్ నేత సుస్మిత దేవ్ అన్నారు. విపక్షాల మాటల్ని వినని బీజేపీ.. కనీసం తమ ‘మార్గదర్శకుడు’అడ్వాణీ సూచనలనైనా వినాలన్నారు. మరోరోజూ చర్చలేకుండానే..: నోట్లరద్దుపై ప్రతిష్టంభన కారణంగా పార్లమెంటు సమావేశాలు 14వ రోజూ చర్చ జరగకుండానే ముగిశాయి. ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించినా.. విపక్షాలు సభాకార్యక్రమాలను జరగనీయలేదు. ఉభయసభల్లోనూ ఇదే పరిస్థితి వాయిదాకు దారితీసింది.

నోట్లరద్దుపై ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం కారణంగా 84 మంది మృతిచెందారని, దీనికి బాధ్యత ఎవరిదని రాజ్యసభలో విపక్షనేత ఆజాద్ ప్రశ్నించారు.  దీనిపై అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధమని చెప్పినా.. విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయన్నారు. దీంతో సభ వాయిదా పడింది.  కాగా, శనివారం నుంచి లోక్‌సభకు 4రోజులు సెలవులొచ్చాయి. శని, ఆదివారాలకు తోడు సోమవారం సెలవు ఇవ్వాలని పార్లమెంటు వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. మంగళవారం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సెలవు ఉంది.
 

Advertisement
Advertisement