అట్టుడికిన మహారాష్ట్ర | Sakshi
Sakshi News home page

అట్టుడికిన మహారాష్ట్ర

Published Wed, Jan 3 2018 2:37 AM

Maharashtra caste clashes: Several schools and colleges shut in Mumbai - Sakshi

సాక్షి, ముంబై: భీమా–కోరేగావ్‌ ఘటనపై నిరసనలు పుణే నుంచి మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాలు మంగళవారం దళితుల ఆందోళనలతో అట్టుడికాయి. ముంబైలో రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. పుణే దగ్గర్లోని భీమా–కోరేగావ్‌ యుద్ధ స్మారకం వద్ద 200వ విజయోత్సవాల సందర్భంగా సోమవారం హిందూ, దళిత సంస్థల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్తా ముదిరి హింసాత్మకంగా మారింది. ఆందోళన కారులు పదుల సంఖ్యలో వాహనాలను తగులబెట్టి ధ్వంసం చేశారు.

ఈ ఘర్షణల్లో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హింసకు ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ భరిపా బహుజన్‌ మహాసంఘ్‌(బీబీఎం) బుధవారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌ పిలుపునకు మహారాష్ట్ర డెమోక్రటిక్‌ ఫ్రంట్, మహారాష్ట్ర లెఫ్ట్‌ ఫ్రంట్‌ తదితర 250 సంస్థలు మద్దతు తెలిపాయని బీబీఎం నేత ప్రకాశ్‌ అంబేడ్కర్‌ చెప్పారు. పుణే ఘర్షణలు మంగళవారం  ముంబైకి పాకాయి. ప్రభుత్వమే ఘర్షణలకు కారణమంటూ దళితులు చేపట్టిన ఆందోళనలతో ముంబైలో రైళ్లు ఆగిపోయాయి. వందకుపైగా బస్సులు ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల దుకాణాలు మూతబడ్డాయి. ఆందోళనకారులు ముంబైలోని ముఖ్య ప్రాంతాల్లో వాణిజ్య, విద్యా సంస్థలు, దుకాణాలను మూసివేయించారు.

హార్బర్‌ లైన్‌లోని గోవండీ, చెంబూర్‌ రైల్వే స్టేషన్లలో రైళ్లను అడ్డుకున్నారు. ఈ ఘటనలతో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఆందోళనకారులు 134 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని అధికారులు తెలిపారు. దాదాపు 100 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోరేగావ్‌ విజయోత్సవాలకు వెళ్లి వస్తున్న ఓ మహిళపై సోమవారం దాడికి పాల్పడ్డారనే ఫిర్యాదుపై హిందూ ఏక్తా అఘాదీ నేత మిలింద్‌ ఎక్బొటే, శివ్‌రాజ్‌ ప్రతిష్టాన్‌ నేత సంభాజీ భిండేలపై పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ రెండు సంస్థలు బ్రిటిష్‌ వాళ్ల గెలుపునకు విజయోత్సవాలేమిటంటూ మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నాయి.

హైకోర్టు జడ్జితో విచారణ: ఫడ్నవిస్‌
ఈ హింసాత్మక ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తామని సీఎం ఫడ్నవిస్‌ చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని, యువకుడి మృతిపై సీఐడీ దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ ఫాసిస్ట్‌ విధానాలపై భీమా–కోరేగావ్‌ ఉత్సవాలు గెలుపునకు ప్రతీకలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ అన్నారు.

కోరేగావ్‌ చరిత్ర ఇదీ...
పుణే సమీపంలో భీమా నది ఒడ్డున భీమా–కోరేగావ్‌ యుద్ధ స్మారకం మహారాష్ట్రలో సంకుల సమరానికి కేంద్ర బిందువుగా మారింది. పీష్వా బాజీరావు–2 సైన్యంతో బ్రిటిష్‌ సైన్యానికి ఇక్కడే యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ముగిసి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఉత్సవాలు జరిగాయి. ఇక్కడ జరిగిన ఘర్షణలే పెద్దవయ్యాయి. 1857 తొలి స్వాతంత్య్ర సమరానికి ముందే బాంబే ఆర్మీ (బ్రిటీష్‌)లో 25 శాతం మహర్‌లు(దళితులు) ఉండేవారు. బ్రిటిష్‌ మెరైన్‌ బెటాలియన్‌లో కీలక సైనికులుగా ఉన్నారు. పీష్వాల పాలనలో అంటరానితనం తీవ్రస్థాయిలో అమలవుతున్న రోజులవి. ఆ సమయంలోనే 1818 జనవరి 1న∙పీష్వా బాజీరావు–2 పెద్ద సైన్యంతో పరిమిత సంఖ్యలో ఉన్న బ్రిటిష్‌ సైన్యం పోరాడింది.

పుణేపై దాడికి వస్తున్న పీష్వా సైన్యాన్ని కెప్టెన్‌ స్టౌంట్‌సన్‌ నేతృత్వంలో 21వ రెజిమెంట్‌ ఆఫ్‌ ద బాంబే నేటివ్‌ ఇన్‌ఫాంట్రీ(మహర్‌ మెజారిటీ) నిలువరించింది. ఇరవై వేలకు పైబడిన అశ్వికదళం, 8 వేల మంది కాల్బలంతో కేవలం 800మంది సైనికులు (వారిలో 500–600 మంది మహర్లు) ఆహారం, నీరు, ఎలాంటి విశ్రాంతి లేకుండా ఏకధాటిగా 12 గంటల పాటు పోరాడారు. ఈ యుద్ధంలో 21 మంది మహర్‌ సైనికులు అసువులు బాశారు. మరింత పెద్ద సంఖ్యలో బ్రిటిష్‌ సైన్యం రావొచ్చునని భావించిన బాజీరావు–2  తన సైన్యాన్ని వెనక్కు రప్పించారు. వీరోచితమైన ఈ సంఘర్షణే మూడో బ్రిటిష్‌–మరాఠా యుద్ధంలో కీలక పరిణామంగా మారింది.

భారత గడ్డపై ఆంగ్లేయులు తమ పట్టును బిగించేందుకు ఇది ఉపయోగపడింది. ఈ సంగ్రామంలో అమరులైన 21 మంది సైనికుల పేర్లు ఈ యుద్ధస్మారకంపై చెక్కి ఉన్నాయి.  1927 జనవరి 1న డాక్టర్‌ భీమ్‌రావు అంబేడ్కర్, పలువురు దళిత ప్రముఖులు, బ్రిటిష్‌ సైన్యంలో పనిచేస్తున్న వారితో కలిసి ఈ స్మారకాన్ని సందర్శించారు. అప్పటికి 109 ఏళ్ల క్రితం జరిగిన కోరేగావ్‌ యుద్ధంలో పీష్వాలకు వ్యతిరేకంగా బ్రిటిష్‌ సైన్యంలో అత్యధికంగా ఉన్న మహర్‌ సైనికులు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ పర్యటన సాగింది. సైనికపరంగా దళితుల శక్తిసామర్థ్యాలకు కోరేగావ్‌ యుద్ధాన్ని గొప్ప ఉదాహరణగా పరిగణిస్తుంటారు. బ్రిటిష్‌ ఆర్మీలో అంబేడ్కర్‌ తండ్రి, ఆయన సోదరులు ఆరుగురు సుబేదార్‌ మేజర్లుగా పనిచేయటం గమనార్హం.                   
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

Advertisement
Advertisement