చెన్నై తీరానికి దగ్గర్లోనూ గాలింపు | Sakshi
Sakshi News home page

చెన్నై తీరానికి దగ్గర్లోనూ గాలింపు

Published Sat, Mar 15 2014 1:51 AM

malaysia fight still no more

 ఇంకా లభించని మలేసియా విమానం ఆచూకీ
 
 న్యూఢిల్లీ/కౌలాలంపూర్:అదృశ్యమై వారం రోజులైనా.. మలేసియా విమానం జాడ ఇంకా లభించలేదు. మలక్కా జలసంధి నుంచి అండమాన్ ప్రాంతం వరకూ జరిపిన అన్వేషణలో ఫలితం కనిపించకపోవడంతో.. శుక్రవారం బంగాళఖాతం వరకు గాలింపును విస్తరించారు. మలేసియా ప్రభుత్వ విజ్ఞప్తిపై భారత్ గాలింపు పరిధిని బంగాళాఖాతంలో 9 వేల చదరపు కి.మీకిపైగా పెంచింది. ఈ ప్రాంతం చెన్నై తీరానికి 300 కి.మీ దూరంలో ఉంది. విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండొచ్చని అమెరికా రక్షణ, వైమానిక నిపుణులు చెప్పడంతో గాలింపు ప్రాంతాన్ని విస్తరించాలని మలేసియా భారత్‌ను కోరింది. కాగా, శాటిలైట్ సమాచారాన్ని, చిత్రాలను విశ్లేషించడం ద్వారా ఆ విమానం జాడ కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ప్రయత్నిస్తోంది. వారం క్రితం మలేసియా నుంచి బీజింగ్‌కు ఐదుగురు భారతీయులు సహా 239 మందితో వెళుతున్న విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. దాని ఆచూకీ కోసం భారత్ సహా 13 దేశాలకు చెందిన 48 విమానాలు, 57 నౌకలు గాలిస్తున్నాయి. అమెరికా రక్షణ, వైమానిక శాఖ సూచనల ప్రకారం.. గాలింపు చర్యలను హిందూ మహాసముద్ర ప్రాంతానికి విస్తరించారు. అయితే, ఆ విమానం అండమాన్ వైపు వెళ్లి ఉండవచ్చని ఒకవైపు, కాదు ప్రస్తుతం గాలిస్తున్న ప్రాంతానికి దూరంగా వెళ్లి ఉండవచ్చని మరోవైపు వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ రెండింటినీ కొంద రు వైమానిక నిపుణులు కొట్టిపడేస్తున్నారు.
 
     మరోవైపు విమానం రాడార్ల నుంచి అదృశ్యమైన నాలుగు గంటల అనంతరం దాని నుంచి ఒక ఉపగ్రహానికి సిగ్నల్స్ వచ్చాయని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అవి సహాయం కోసం విమానం నుంచి పంపిన సిగ్నల్స్ అయి ఉంటాయని పేర్కొన్నారు.
 
     విమానం జాడను కనుగొనేందుకు ఒక ముస్లిం మత గురువును ఆశ్రయించినట్లు వచ్చిన వార్తలను మలేసియా ఖండించింది. అదృశ్యమైన విమానం టేకాఫ్ అయిన కౌలాలంపూర్ విమానాశ్రయంలో... ఇబ్రహీం మత్‌జిన్ అనే మతగురువు పూజలు చేస్తున్న చిత్రాలు, వీడియోలు విస్తతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే దానితో ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని ప్రకటించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement