రూ. 30 వేలకు భార్య తాకట్టు.. ఆపై స్నేహితుడి హత్య! | Sakshi
Sakshi News home page

రూ. 30 వేలకు భార్య తాకట్టు.. ఆపై స్నేహితుడి హత్య!

Published Tue, Nov 17 2015 9:10 AM

రూ. 30 వేలకు భార్య తాకట్టు.. ఆపై స్నేహితుడి హత్య!

స్నేహితుడి నుంచి రూ. 30 వేలు అప్పు తీసుకుని, దానికి బదులుగా తన భార్యను తాకట్టు పెట్టేశాడో పెద్దమనిషి. అయితే, ఆమెను విడిచిపెట్టాలంటే మరింత అదనపు సొమ్ము కావాలని స్నేహితుడు డిమాండ్ చేయడంతో.. అతడిని చంపేశాడు. మహ్మద్ గులామ్ (35) అనే వ్యక్తి శవం రెండు వారాల క్రితం పోలీసులకు దొరికింది. ఆ కేసును ఛేదించే క్రమంలో ఈ వివరాలన్నీ బయటపడ్డాయి. బిహార్‌లోని అరియా జిల్లాకు చెందిన గులామ్ గత రెండున్నరేళ్లుగా యమునానగర్‌లో ఉంటున్నాడు. జనవరిలోఅతడు తన స్నేహితుడు సబీర్ అలీకి రూ. 30వేలు అప్పుగా ఇచ్చాడు. అతడు కూడా బిహార్‌ నుంచి వలస వచ్చినవాడే. అతడు ఓ టిఫిన్ సెంటర్ నడుపుతూ కాంట్రాక్టర్లకు కూలీలను సరఫరా చేస్తుంటాడు. గులాం పత్తి ప్రాసెసింగ్ వ్యాపారం చేస్తుంటాడు. సబీర్ భార్య సల్మా చేతి వంట తింటూ ఉండేవాడు.

అయితే మొన్న జనవరిలో సబీర్ తన భార్య సల్మాను గులాం వద్ద తాకట్టు పెట్టి రూ. 30వేలు అప్పు తీసుకున్నాడు. దాంతో గులాం ఆమెను యమునానగర్ సమీపంలోని జగధారి నగరంలో గల తన ఇంటికి తీసుకెళ్లాడు. మార్చిలో సల్మా, గులాం కలిసి బిహార్ వెళ్లి, తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు తిరిగారు.

సెప్టెంబర్‌లో మళ్లీ పత్తి సీజన్ మొదలవడంతో ఇద్దరూ యమునానగర్ తిరిగొచ్చారు. వాళ్లిద్దరూ అక్టోబర్ నెలాఖరు వరకు కూడా సహజీవనంలోనే ఉన్నారు. తర్వాత ఉన్నట్టుండి గులాం దారుణ హత్యకు గురై కనిపించాడు.

తాను రూ.30 వేలు చెల్లించినా, సల్మాను విడిచిపెట్టాలంటే మరో రూ. 20 వేలు వడ్డీగా ఇవ్వాల్సిందేనని గులాం చెప్పాడని, సరేనని ఆ మొత్తం కూడా ఇచ్చినా తన భార్యను వదల్లేదని.. దాంతో తాను, తన భార్య కలిసి గులాంను చంపేశామని సాబిర్ పోలీసులకు తెలిపాడు. ఈ హత్యలో వాళ్లకు మరికొందరు స్నేహితులు కూడా సహకరించారు. అందరినీ పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement