భావోద్వేగానికి గురైన మంద కృష్ణ | Sakshi
Sakshi News home page

భావోద్వేగానికి గురైన మంద కృష్ణ

Published Thu, Aug 11 2016 8:28 AM

ఎమ్మార్పీఎస్ ధర్నాకు హాజరైన వెంకయ్యనాయుడుకు పాదాభివందనం చేస్తున్న మందకృష్ణ - Sakshi

న్యూఢిల్లీ: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం జంతర్‌మంతర్ వద్ద జరిగిన మహాధర్నాకు హాజరైన వెంకయ్య నాయుడికి పాదాభివందనం చేసిన మంద కృష్ణ ధర్నాలో భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమంలోని ఆటుపోట్లను, కుట్రలను ఆయన వివరించారు. ‘తినడానికి తిండిలేని జాతి. ప్రయాణానికి ఖర్చులు లేని జాతి. ఎన్ని త్యాగాలు చేస్తే ఎన్ని బాధలు భరిస్తే ఈరోజు ఢిల్లీకి వేలాదిగా తరలిరాగలిగిందో అర్థం చేసుకోవాలి. మాదిగ జాతి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మీదే..  మీరు వర్గీకరణకు సహకరించి మాకు మరో అంబేడ్కర్‌గా నిలవాలి..’ అంటూ వెంకయ్య నాయుడికి విన్నవించారు.
 

వర్గీకరణపై ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తా: వెంకయ్య
షెడ్యూలు కులాల వర్గీకరణ దిశగా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తానని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. మహాధర్నాకు హాజరైన వెంకయ్య నాయుడు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని, ఈ ఉద్యమం విజయం సాధిస్తుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాన మంత్రికి వివరించినట్టు తెలిపారు.

‘మీ కోరిక అసాధారణమైనది కాదు. అన్యాయమైనదీ కాదు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాల్సిందే. వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలతో ఈ అంశం మాట్లాడాను. అందరూ ఈ డిమాండ్ సహేతుకమని అన్నారు. వర్గీకరణపై అధ్యయనం జరుగుతోంది. ఒకసారి అడుగు ముందుకు పడితే మళ్లీ వెనక్కి రావడం ఉండదు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. దళితులపై దాడులు, ఇతర సమస్యలను రాజకీయ కోణంలో చూడకండి. ఇది సామాజిక రుగ్మత. కులాలను ఓటు బ్యాంకుగా చూడరాదు. సమాజంలో వెనకబడి, ఆఖరి వరుసలో ఉన్న వారిని ముందు పైకి తేవాలని దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్నారు. ఈ సమావేశాల్లో బిల్లు పెట్టడం సాధ్యం కాదు. నేను ఉత్తుత్తి హామీలు ఇవ్వను. ఏకాభిప్రాయం సాధించేందుకు అన్ని పార్టీలతో చర్చిస్తున్నాం. రాజకీయాలకతీతంగా వర్గీకరణ జరిగి తీరుతుందని నాకు నమ్మకం ఉంది..’ అని పేర్కొన్నారు. వర్గీకరణ వల్ల దళితుల్లోని 59 కులాలకు మేలు జరుగుతుందని, దీన్ని గ్రహించి మాలలు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు.

మావంతు ప్రయత్నం చేస్తాం...
కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ  ‘ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. ఎస్సీ వర్గీకరణ కోసం మావంతు ప్రయత్నం చేస్తాం. ఈ విషయమై ప్రధానితో మాట్లాడుతాను. యూపీఏ హయాంలో వర్గీకరణకు అనుకూలంగా ఉషామెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చినా వర్గీకరించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైంది. ఢిల్లీ గడ్డపై ఎవరూ సాహసించని, ఎవరూ చేయని దీక్షలు ఎమ్మార్పీఎస్ చేయగలిగింది.. ఈ దీక్షలు ఫలితాన్ని ఇస్తాయి..’ అని పేర్కొన్నారు.

మాదిగలకు మంద కృష్ణ మాదిగ దేవుడిచ్చిన వరమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కొనియాడారు. వర్గీకరణ చేస్తే బీజేపీ వెంట నిలబడతామని హర్యానా వర్గీకరణ ఉద్యమ నేత స్వదేశ్ కబీర్ పేర్కొన్నారు. వర్గీకరణతోనే మాదిగలకు స్వాతంత్య్రం లభిస్తుందని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ మహాధర్నాకు ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగాటి  సత్యం సభాధ్యక్షత వహించగా జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్య రావు, నేతలు మందకుమార్, నాగయ్య, బ్రహ్మయ్య, బి.ఎన్.రమేశ్, కోళ్ల వెంకటేశ్, తీగల ప్రదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement