‘రఘును చంపిందెవరు..?’ | Sakshi
Sakshi News home page

వీళ్లు మారరా..?

Published Tue, Nov 28 2017 6:36 PM

This manmade tragedy needs to be pursued to its logical conclusion - Sakshi

సాక్షి, కోయంబత్తూరు : ‘రఘును చంపిందెవరు..?’  30 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రఘుపతిని బలిగొన్న కోయంబత్తూరు రహదారిపై రాసిన ఈ ప్రశ్న అందరినీ నిలదీస్తోంది. తాను పెళ్లాడబోయే వధువును కలుసుకునేందుకు అమెరికా నుంచి ఎన్నో ఆశలతో వచ్చిన ఈ యువకుడిని శుక్రవారం ఉదయం రహదారి మింగేయడంతో ఆగ్రహం, ఆవేదనతో ఇద్దరు యువకులు రోడ్డుపైనే ఇలా రాయడం అందరినీ ఆలోచింపచేస్తోంది. కోయంబత్తూరు, తమిళనాడులు ఈ విషాదాన్ని మర్చిపోలేవని ఈ అక్షరాలు విస్పష్ట సంకేతాలు పంపుతున్నాయి. సోషల్‌ మీడియాలోనూ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ దారుణ ఘటన విషయానికి వస్తే..వివాహబంధంతో ఒక్కటవనున్న తన భాగస్వామిని కలిసేందుకు అమెరికా నుంచి కోయంబత్తూరుకు రెక్కలు కట్టుకుని వాలిన రఘు యాత్రా స్థలం పళనికి దైవదర్శనం కోసం వెళ్లేందుకు బస్సు ఎక్కాలని బస్‌ స్టాప్‌కు బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో తన వైపు వేగంగా దూసుకొస్తున్న లారీని తప్పించుకునేందుకు తన బైక్‌ను ఎడమవైపుకు మళ్లించాడు.

అయితే చీకట్లో అక్కడే ఉన్న భారీ హోర్డింగ్‌ను గమనించకపోవడంతో బైక్‌ హోర్డింగ్‌ను ఢీ కొట్టింది. దీంతో రోడ్డుపై పడిపోయిన రఘు మీది నుంచి లారీ దూసుకుపోవడంతో క్షణాల్లో మృత్యువు కబళించింది. డిసెంబర్‌ 3న జరిగే ఓ కార్యక్రమం కోసం ఏఐఏడీఎంకే ఈ భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. హోర్డింగ్‌ ఉందనే సంకేతాలు ఇచ్చి రోడ్డుపై వెళ్లే బైకర్లు, వాహనదారులను అప్రమత్తం చేసే సూచికలను సైతం ఏర్పాటు చేయలేదు. ఈ హోర్డింగ్‌ ఏకంగా 40 శాతం రోడ్డును ఆక్రమించింది. తన తప్పును సమర్ధించుకునేందుకు ఏఐఏడీఎంకే అడ్డంగా వాదిస్తూ ప్రమాద సమయంలో రఘు మద్యం సేవించాడనే ప్రచారానికి తెరలేపింది. మరికొందరేమో అతనిపై లారీ దూసుకుపోవడంతోనే మరణించాడని, హోర్డింగ్‌కు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్నారు. అయితే అది ఆరు లేన్ల రహదారి కావడంతో ఎడమ వైపున హోర్డింగ్‌ లేకుంటే రఘు సులభంగా తనవైపు దూసుకొచ్చిన లారీని తప్పించుకునేవాడనే విషయాన్ని విస్మరిస్తున్నారు.

ఇక రఘు హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్లే విషాదం చోటుచేసుకుందని మరికొందరు వేలెత్తిచూపుతున్నారు. ఈ వాదనలో కొంత హేతుబద్ధత ఉన్నా ఏఐఏడీఎంకే తప్పిదాన్ని కప్పిపుచ్చలేరు. దారుణ ఘటనకు బాధ్యులను గుర్తించి, శిక్షించాల్సిన కార్పొరేషన్‌ అధికారులు చోద్యం చూస్తుంటే పోలీసులు తమ రాతలతో వ్యవస్థను నిలదీసిన యువకులను ప్రశ్నించడం గమనార్హం. వారికి ఏమైనా రాజకీయ పార్టీలతో సంబంధం ఉందా అని ఆరాతీసిన పోలీసులకు అలాంటిదేమీ లేదనే సమాచారం లభించింది. రాజకీయ హంగామా కోసం బహిరంగ ప్రదేశాలను, రహదారులను ఆక్రమించి ప్రచార ఆర్భాటాలతో రెచ్చిపోవడం ఏఐఏడీఎంకేకు అలవాటేననే విమర్శలు ఎదురవుతున్నాయి. డిసెంబర్‌ 2015లో జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా చెన్నై నగరాన్ని ఆ పార్టీ హోర్డింగ్‌లతో ముంచెత్తింది. నగరంలోని పేవ్‌మెంట్స్‌నూ ఆక్రమించింది. పాదచారులకు ఇబ్బందికరంగా ఉన్న హోర్డింగ్‌లను తొలగించేందుకు ప్రయత్నించిన అవినీతిపై పోరాడే ఎన్‌జీవో అరప్పోర్‌ ఇయకం కార్యకర్తలను ఏఐఏడీఎంకే శ్రేణులు అడ్డుకుని దాడులకు తెగబడటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఈ ఘటనలో ముగ్గురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్‌ చేసి చెన్నై సెంట్రల్‌ జైలుకు తరలించడం, పార్టీ కార్యకర్తలపై ఈగ వాలనీయకపోవడం విస్మయం కలిగించింది. ఇక జయలలిత అధికారంలో ఉండగా ఫుట్‌పాత్‌లపై హోర్డింగ్‌లను తొలగించినందుకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్‌ రామస్వామిపై కేసు నమోదైంది. కోయంబత్తూర్‌లో హోర్డింగ్‌ల ఏర్పాటుపై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి తీసుకోలేదు. మున్సిపల్‌ మంత్రి ఎస్‌పీ వేలుమణి స్వయంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించడం గమనార్హం.

హోర్డింగ్‌ ఏర్పాటుకు ఆదేశించిన వారిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీనిపై కేవలం విపక్ష డీఎంకే మాత్రమే గళమెత్తింది. పార్టీలు రాచరిక వ్యవస్థను తలపించేలా అహంభావపూరితంగా వ్యవహరించరాదని డీఎంకే స్పష్టం చేసింది. అయినా సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వంలు ఈ అంశంపై ఇప్పటివరకూ నోరుమెదపలేదు. జీవించి ఉన్న వ్యక్తుల కటౌట్లు ఏర్పాటు చేయరాదని నెల కిందట మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో పళనిస్వామి, పన్నీర్‌సెల్వంల నిలువెత్తు కటౌట్ల స్ధానంలో వారి ఫోటోలతో కూడిన భారీ బెలూన్లను ఎగురవేశారు.

రఘు దుర్మరణం పాలైన కొద్దిరోజుల్లోనే థానే జిల్లాలోనూ ఇటువంటి హోర్డింగ్‌లు దర్శనమిచ్చాయి. రఘు మరణంపై ప్రజల్లో నిరసన పెల్లుబుకుతోంది. ఈ విషాదాన్ని హైలైట్‌ చేసేందుకు, బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు ఒత్తిడి పెంచేలా ఛేంజ్‌.ఓఆర్‌జీలో పిటిషన్‌లపై ఉద్యమ స్ఫూర్తితో సంతకాలు జరుగుతున్నాయి. ఈ తరహా దారుణ ఘటనలకు చరమగీతం పాడాలని, రఘు వంటి అమాయకుల ప్రాణాలను ఇక తమిళనాడు త్యాగం చేయబోదనే గట్టి సందేశం బలంగా వినిపించాలనే ఆకాంక్ష సర్వత్రా వ్యక్తమవుతోంది.
-టీఎస్‌ సుధీర్‌

 

Advertisement
Advertisement