'ఫేస్‌బుక్‌' జుకర్‌బర్గ్‌తో కొచ్చి కుర్రాడి డీల్‌! | Sakshi
Sakshi News home page

'ఫేస్‌బుక్‌' జుకర్‌బర్గ్‌తో కొచ్చి కుర్రాడి డీల్‌!

Published Sat, Apr 16 2016 1:20 PM

'ఫేస్‌బుక్‌' జుకర్‌బర్గ్‌తో కొచ్చి కుర్రాడి డీల్‌! - Sakshi

కొచ్చి: మార్క్‌ జుకర్‌బర్గ్ పేరు తెలియని వారు ఉండరు. సోషల్‌ మీడియా రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చి.. ఫేస్‌బుక్‌ స్థాపనతో కుబేరుడు అయ్యాడు ఈ యువ పారిశ్రామికవేత్త. తన కూతురు పుట్టిన సందర్భంగా తన కంపెనీలో 99శాతం వాటాలను స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాడు. అలాంటి జుకర్‌బర్గ్‌ తనను ఆశ్రయించి.. డీల్‌ కుదుర్చుకునేలా చేశాడు కొచ్చి కుర్రాడు అమల్ ఆగస్టిన్‌.

జూక్‌కు తిరుగులేని ఇంటర్నెట్‌ రంగంలోనే ఆయనకు తన సత్తా చూపించాడు అమల్. ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్న అమల్‌ ఇటీవల 'మాక్స్‌చాన్‌జుకర్‌బర్గ్‌.ఓఆర్‌జీ' పేరిట ఓ వెబ్‌సైట్‌ డొమైన్‌ ను రిజిస్టర్‌ చేయించుకున్నాడు. ఈ వెబ్‌సైట్ పేరులో జుకర్‌బర్గ్‌ కూతురు మాక్సీమా చాన్‌ జుకర్‌బర్గ్‌ సంక్షిప్తనామం ఉండటంతో ఈ డొమైన్ హక్కులు కొనుగోలు చేసేందుకు ఫేస్‌బుక్‌ ముందుకొచ్చింది. అమల్‌తో బేరసారాలు ఆడి.. 700 డాలర్ల (రూ. 46వేల)కు ఈ వెబ్‌సైట్‌ను సొంతం చేసుకుంది.

ఈ డొమైన్‌ పేరుకు ఎంత డబ్బు వచ్చిందన్న దానికన్నా.. ఏకంగా ఫేస్‌బుక్‌ తనను ఆశ్రయించి బేరసారాలు జరిపిందన్న అంశమే తనకు ఎక్కువగా థ్రిల్‌ ఇస్తున్నదని అమల్‌  చెప్పాడు. ఇంటర్నెట్‌ డొమైన్ పేర్లను సొంతం చేసుకోవడం తన హాబీ అని, ఈ హాబీ వల్ల కొంత ఆదాయం కూడా ఆనందం కలిగిస్తున్నదని తెలిపాడు. జుకర్‌బర్గ్ దంపతులకు కూతురు పుట్టిన డిసెంబర్‌ నెలలో తాను ఈ పేరుతో డొమైన్‌ రిజిస్టర్‌ చేశానని చెప్పాడు.

మొదట 'గోడ్యాడీ' వెబ్‌ హోస్టింగ్ కంపెనీ ద్వారా తన డొమైన్‌ కొనుగోలుకు ఆఫర్‌ వచ్చిందని, ఎంతకు అమ్ముతారని అడిగితే.. తాను ఎక్కువగా అడుగకుండా కేవలం 700 డాలర్లు చెప్పానని, వాళ్లు అంగీకరించారని అమల్ తెలిపాడు. కానీ డొమైన్‌ కొనుగోలు డీల్‌ పూర్తయిన తర్వాత తన డొమైన్ సొంతం చేసుకున్నది ఫేస్‌బుక్‌ అని తెలియడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాడు. జుకర్‌బర్గ్‌ ఆర్థిక వ్యవహారాలు చూసే 'ఐకానిక్‌ క్యాపిటల్‌' సంస్థ మేనేజర్‌ సారా చాపెల్‌ నుంచి నేరుగా ఈమెయిల్‌ రావడంతో ఈ డొమైన్‌ ఫేస్‌బుక్‌ కొన్నట్టు స్పష్టమైందని, ఫేస్‌బుక్‌ ముందుకొచ్చినా ఎలాంటి బేరసారాలు చేయకుండా, ఎక్కువ సొమ్ము ఆశించకుండా చెప్పిన ధరకు అమ్మేశానని చాలా హుందాగా ఫేస్‌బుక్‌లో ప్రకటించాడు అమల్‌.

Advertisement

తప్పక చదవండి

Advertisement