రూ. 6కే మసాలా దోశ | Sakshi
Sakshi News home page

రూ. 6కే మసాలా దోశ

Published Wed, Jun 24 2015 3:04 AM

రూ. 6కే మసాలా దోశ

* రూ. 20కే మటన్ కర్రీ.. భారీ సబ్సిడీతో ఎంపీలకు తిండి
* 60-150 శాతం రాయితీతో పసందైన వంటలు
* గత ఐదేళ్లలో రూ. 60.7 కోట్ల మేర సబ్సిడీలు

 
న్యూఢిల్లీ: మార్కెట్లో మటన్ కేజీ ధర రూ. 500 దాటింది. మసాలా దోసె రూ. 30-40 మధ్య ఉంది. కానీ మన ఎంపీలకు మాత్రం ఇవి పరమ కారుచవకగా అందుతున్నాయి. వారు పసందైన మటన్ కర్రీని రూ. 20కి, మసాలా దోశను రూ. 6కే లాగించేస్తున్నారు. ఇదంతా పార్లమెంట్ క్యాంటీన్ అందుకుంటున్న సబ్సిడీ మహిమ. ఎంపీలకు ఆహారాన్ని అందించే పార్లమెంటు క్యాంటీన్ గత ఐదేళ్లలో రూ.60.7 కోట్ల భారీ సబ్సిడీని అందుకుంది. 60 నుంచి 150 శాతం రాయితీతో ఇక్కడ ఆహార పదార్థాలను అందిస్తున్నారు. పూరీ సబ్జీ లాంటి పదార్థాలను 88 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. ఎంపీలకు ఆహారాన్ని ఎంత సబ్సిడీతో ఇస్తున్నారో తెలిపే జాబితా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద వెల్లడైంది. ఫిష్ ప్రైడ్ చిప్స్‌ను 63 శాతం సబ్సిడీతో రూ.25కు, మటన్ క ట్లెట్‌ను 65 శాతం రాయితీతో రూ.18కి, ఆయిల్డ్ వెజిటబుల్స్‌ను 83 శాతం సబ్సిడీతో రూ.5కు, మటన్ కర్రీని 67 శాతం రాయితీతో రూ.20కి, మసాలా దోశను 75 శాతం సబ్సిడీతో రూ.6కు అందిస్తున్నట్లు వెల్లడైంది.
 
 పచ్చి కూరగాయలను రూ.41.25తో కొంటుండగా, వండిన పదార్థాలను రూ.4కే ఎంపీలకు ఇస్తున్నారని ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ తెలిపారు. నాన్‌వెజ్ మీల్‌కు అవసరమైన పదార్థాల సేకరణకు రూ.99 అవుతుండగా, వండిన డిష్‌ను రూ.33కే ఇస్తున్నారన్నారు. పార్లమెంటులోని మొత్తం 5 క్యాంటీన్లు నోరూరించే 76 రకాల డిష్‌లను భారీ సబ్సిడీతో ఇస్తున్నాయన్నారు. సబ్సిడీ లేకుండా ఇస్తున్నది కేవలం రోటీ మాత్రమే. రోటీకి అవసరమైన సరుకులు 77పైసలకు వస్తోంటే రోటీని ఒక్క రూపాయికి విక్రయిస్తున్నారు. నార్తర్న్ రైల్వే నిర్వహిస్తున్న ఈ క్యాంటీన్లు సరుకులను ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ భండార్, మదర్ డైరీ, డీఎంఎస్ తదితరాల నుంచి సేకరిస్తాయి. జీతం, ఇతర అలవెన్సులు కలిపి నెలకు రూ. 1.4 లక్షలకు పైగా అందుకుంటున్న ఎంపీలకు మార్కెట్ ధరకే ఆహారాన్ని విక్రయించి సబ్సిడీలను తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు.
 

Advertisement
Advertisement