హాట్సాఫ్‌; రూ.300 కోట్ల భవనం దానం

4 Jan, 2020 17:35 IST|Sakshi

బెంగళూరు: రూపాయి దానం చేయాలంటేనే వంద విధాలుగా ఆలోచించే రోజులు ఇవి. కానీ ఓ మహిళ మాత్రం దాన గుణానికి హద్దులు లేవని నిరూపించారు. ఏకంగా రూ.300 కోట్ల విలువైన తన ఆస్తిని దానం చేసింది. తనకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో నుంచి చేసిన సహాయం ఎందరో నిరుపేదలకు ఇప్పుడు నీడలా మారబోతోంది. ఇంత మంచి మనసున్న ఆ అమ్మ పేరు మీరా నాయుడు. క్యాన్సర్‌తో బాధపడే బాలల సంక్షేమం కోసం 32 గదులున్న, రూ.300 కోట్ల విలువ చేసే ఆస్తిని కేటాయించి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.

చదవండి: మాయల్లేవ్‌..మంత్రాల్లేవ్‌..ప్రయత్నించానంతే!

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో మెజిస్ట్రిక్‌ ప్రాంతంలో మూడంతస్తుల భవనం ఉంది. ఒకప్పుడు లక్ష్మీ హోటల్‌గా పేరుగాంచిన ఆ భవనం నేడు బాలల ఆరోగ్య కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ భవనాన్ని కొనుగోలు చేయడానికి ఎంతో మంది పోటీపడినా.. వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా దానం చేయడానికే ఆమె ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే క్యాన్సర్‌ బాధిత పిల్లల కోసం ఆ భవనాన్ని కేటాయించడానికి ఆమె నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఉచితంగా క్యాన్సర్‌ చికిత్స అందిస్తున్న నగరంలోని శంకర్‌ ఆసుపత్రికి మీరా నాయుడు దానిని అప్పగించారు.

చదవండి: భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘భవనం ఉన్న ప్రదేశంలో నేను మరో బిల్డింగ్ కడితే ఇంకా డబ్బు వచ్చి చేరి నా సంపద పెరుగుతుంది. అంతేకానీ నాకు ఆత్మ సంతృప్తి ఉండదు. నా భర్త శ్రీనివాసులు నాయుడు ఎంతో కష్టపడి ఈ బిల్డింగ్ కట్టించాడు. దీన్ని పేదవారి కోసం దానం చేయడం వల్ల ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని' ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భవనాన్ని ఆమె శంకర్ ఆస్పత్రి నిర్వాహకులకు అప్పగించారు. ఇక్కడికి వచ్చే క్యాన్సర్ బాధితులకు వీరు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అలా వైద్యం పొందిన చిన్నారులకు ఇక్కడ వసతి కల్పించాలని ఆమె కోరారు. ఇది విన్నవారంతా మీరా నాయుడు నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు