సివిల్స్ టాపర్ గౌరవ్ అగర్వాల్ | Sakshi
Sakshi News home page

సివిల్స్ టాపర్ గౌరవ్ అగర్వాల్

Published Fri, Jun 13 2014 6:46 AM

సివిల్స్ టాపర్ గౌరవ్ అగర్వాల్ - Sakshi

* నాలుగేళ్లలో తొలిసారి పురుషుడికి మొదటి ర్యాంక్
* ఐదో ర్యాంక్‌తో మహిళల టాపర్‌గా నిలిచిన భారతీ దీక్షిత్
* 1,228 పోస్టులకు   1,122 మంది ఎంపిక
* టాప్ 25లో తెలుగు వారికి     దక్కని చోటు

 
న్యూఢిల్లీ: జైపూర్‌కు చెందిన 29 ఏళ్ల గౌరవ్ అగర్వాల్ సివిల్స్-2013 టాపర్‌గా నిలిచారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత స్థాయి ఉద్యోగాల భర్తీకి గత ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించారు. పురుష అభ్యర్థి ఈ ఘనత సాధించడం గత నాలుగేళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. 2010 నుంచి వరుసగా మహిళలే సివిల్స్ టాపర్లుగా నిలిచారు. గురువారం విడుదలైన సివిల్స్-2013 పరీక్షా ఫలితాల్లో మాత్రం గౌరవ్ అగర్వాల్ రెండో ప్రయత్నంలో తొలి ర్యాంకు సాధించారు. ఇక రెండు, మూడు స్థానాల్లో ఢిల్లీకి చెందిన మునీశ్ శర్మ, జార్ఖండ్‌కు చెందిన రచిత్ రాజ్ నిలిచారు. ఇక భారతీ దీక్షిత్ మహిళల్లో టాపర్‌గా నిలిచారు.  
 
 టాపర్లలో పది మంది మహిళలు
 సివిల్స్-2013లో భాగంగా 1,228 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, తాజా ఫలితాల ప్రకారం 1,122 మంది ఎంపికయ్యారు. వీరిని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర కేంద్ర సర్వీసుల్లో కేంద్రం నియమించుకుంటుంది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈసారి తొలి 25 స్థానాల్లో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. తొలి 25 మందిలో ఐదుగురు తొలియత్నంలో, 11 మంది మలి ప్రయత్నంలోనే టాప్ ర్యాంకులు పొందారు.
 
 ఈసారి టాప్-25లో తెలుగు వారెవరూ లేకపోవడం గమనార్హం. టాపర్లలో 20 మంది ఢిల్లీ నుంచే పరీక్షలకు హాజరయ్యారు. కేటగిరీలవారీగా చూస్తే 517(జనరల్), 326(ఓబీసీ), 187(ఎస్సీ), 92 మంది ఎస్టీ వర్గానికి చెందిన వారు సివిల్స్‌కు ఎంపికయ్యారు. గత ఏడాది మే 26న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు సుమారు 3.24 లక్షల మంది హాజరు కాగా, దాదాపు 15 వేల మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వీరిలో 3,003 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. వీరి మార్కులను 15 రోజుల్లోగా యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచే అవకాశముంది.
 
 నమ్మలేకపోయా: గౌరవ్

 సివిల్స్‌లో టాపర్‌గా నిలవడాన్ని మొదట నమ్మలేకపోయానని తొలి ర్యాంకర్‌గా నిలిచిన 29 ఏళ్ల గౌరవ్ అగర్వాల్ తెలిపారు. ‘మొదట నమ్మలేకపోయా. తర్వాత నా కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వరుస ఫోన్లు వచ్చాయి. అందరూ శుభాకాంక్షలతో ముంచెత్తారు’ అని ఆయన చెప్పుకొచ్చారు. గౌరవ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. ఇంతకుముందు తొలి ప్రయత్నంలో 244వ ర్యాంక్ సాధించిన గౌరవ్.. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.

Advertisement
Advertisement