ఆ సీటు గెలిస్తే.. యూపీలో గెలిచినట్లే! | Sakshi
Sakshi News home page

ఆ సీటు గెలిస్తే.. యూపీలో గెలిచినట్లే!

Published Wed, Feb 8 2017 7:05 PM

ఆ సీటు గెలిస్తే.. యూపీలో గెలిచినట్లే! - Sakshi

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?. బీజేపీ, ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి గెలుపు కోసం హోరాహోరి ప్రచారం చేస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ కీలకపాత్ర పోషించేది అక్కడి కుల రాజకీయాలే. 1974 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఓ అసెంబ్లీ స్ధానం అందరి దృష్టినీ ఆకర్షిస్తూ వస్తోంది. అదే కస్‌ఘంజ్‌. ఈ స్ధానంలో పోటీ చేసి గెలిచిన పార్టీ.. 1974 నుంచి రాష్ట్రంలోనూ అధికారాన్ని దక్కించుకుంటూ వస్తోంది. ఈ ఎన్నికల్లో కస్‌ఘంజ్‌ నుంచి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అభ్యర్ధి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
 
రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అగ్రకులాలు బీజేపీకి దన్నుగా నిలుస్తూ వస్తున్నాయి.  1990ల్లో అగ్రవర్ణాలు, బీసీల మధ్య సయోధ్య కుదర్చలేక ఉత్తరప్రదేశ్‌లో చతికిలపడిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లను బీసీలకు కేటాయించింది. దీంతో అగ్రవర్ణాల్లో కొంతవరకూ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కస్‌ఘంజ్‌లో ఓటర్లను ప్రశ్నించిన విశ్లేషకులకు విభిన్న అభిప్రాయాలు దృష్టికి వచ్చాయి. కస్‌ఘంజ్‌లో 20 శాతం మంది వ్యాపారులు ఉన్నారు. వీరందరూ నోట్ల రద్దు తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. వారిలో రగులుతున్న వ్యతిరేకత తెలిసి కూడా అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్ధికి కస్‌ఘంజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి బీజేపీ అవకాశం ఇవ్వలేదు. 
 
బీజేపీకి ఓట్లు వేస్తారా? అని ఓ పత్రికా రిపోర్టర్‌ అక్కడి అగ్రకులాలకు చెందిన వారిని ప్రశ్నించగా వారు "చూద్దాం" అని వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫును ఓ బీసీ అభ్యర్థి కస్‌ఘంజ్‌లో బరిలోకి దిగుతున్నారు. మరి అగ్రకులాలకు చెందిన వారు బీజేపీకి దన్నుగా నిలుస్తారా? లేదా ఎస్సీ, బీఎస్సీల తరఫున బరిలో ఉన్న అగ్రకులాలకు చెందిన అభ్యర్ధులకు పట్టం కడతారా అనేదే తేలాల్సివుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement