‘ప్రత్యేక హోదా’పై చర్చించాలని కోరాం: మేకపాటి | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక హోదా’పై చర్చించాలని కోరాం: మేకపాటి

Published Mon, Feb 23 2015 2:08 AM

‘ప్రత్యేక హోదా’పై చర్చించాలని కోరాం: మేకపాటి - Sakshi

* అఖిలపక్ష సమావేశం
* అనంతరం మీడియాతో మేకపాటి

 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అన్ని హామీల అమలుతోపాటు, ఏపీకి ‘ప్రత్యేక హోదా’ అంశంపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్టు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలు, రాజ్యసభలో అప్పటి ప్రధాని డా.మన్మోహన్‌సింగ్ ఇచ్చిన అన్ని వాగ్దానాల అమలుకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసినట్టు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశానికి మేకపాటి హాజరయ్యారు. అనంతరం సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు అన్ని పార్టీల పార్లమెంటరీ నాయకులతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.
 
  ఏ ఏ అంశం ఎవరు లేవనెత్తాలనేదానికి సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. కేంద్రానికి ముఖ్యంగా మేము చేసిన విజ్ఞప్తి ఏమిటంటే రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి మీరు ఇచ్చిన హామీలతోపాటు ఆ రోజు రాజ్యసభలో అప్పటి ప్రధాని చేసిన అన్ని వాగ్దానాలకు కేంద్రం కట్టుబడి ఉండాలి. కొత్తగా ఏర్పడినందువల్ల ఏపీ ఎన్నో ఇబ్బందుల్లో ఉంది. హుద్‌హుద్ తుపాన్‌తో నాలుగు జిల్లాల ప్రజలు ఇబ్బందులపాలయ్యారు. రాజధానిని నిర్మించుకోవాలి. అనేక ఇబ్బందులు ఉన్నందున విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సి ఉందని గుర్తు చేశాను’ అని అన్నారు. ఏపీకి ‘ప్రత్యేక హోదా’ అంశంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, బీజేడీ, టీడీపీ సహా ఇతర పార్టీల నాయకులు మద్దతు ఇచ్చారన్నారు. కాగా అఖిల పక్ష సమావేశంలో భాగంగా ఆర్డినెన్స్‌లన్నీ బిల్లుల రూపంలోకి వచ్చేలా అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రం కోరిందన్నారు.
 
 ఆ భూముల సేకరణకు వ్యతిరేకం
 పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావనకు రానున్న భూసేకరణ ఆర్డినెన్స్ విషయంలో వైఎస్సార్‌సీపీకి కొన్ని అభ్యంతరాలున్నట్టు చెప్పారు. ‘ ఏడాదిలో ముక్కారు పంటలు పండే భూములను తీసుకుంటామని కేంద్ర ం చెబుతోంది. దీనికి మేం వ్యతిరేకం. భవిష్యత్తులో ఆహారధాన్యాల కొరత దృష్ట్యా, వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూముల సేకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం. కేంద్ర ం సైతం దీనిపై పునరాలోచన చేస్తుందనుకుంటున్నాం. అందరికీ అనుకూలమైన నిర్ణయానికొస్తుందని ఆశిస్తున్నాం’ అని మేకపాటి పేర్కొన్నారు.

Advertisement
Advertisement