అంతా అస్తవ్యస్తం.. గందరగోళం! | Sakshi
Sakshi News home page

అంతా అస్తవ్యస్తం..గందరగోళం!

Published Tue, May 5 2020 7:11 PM

Migrant Workers Struggle To Go Home - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకు పోయిన వలస కార్మికులు తమ ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు ఏప్రిల్‌ 29వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇళ్లకు పోవాలనుకుంటున్న వారు తమ పేర్లను సమీపంలోని పోలీసు స్టేషన్లలో నమోదు చేసుకోవాల్సిందిగా ఆ ప్రకటనలో సూచించింది. అంతేకాకుండా వలస కార్మికులు తమకు కరోనా లేదంటూ ప్రభుత్వ లేదా ప్రైవేటు డాక్టర్‌ నుంచి ‘మెడికల్‌ సర్టిఫికెట్‌’ తీసుకరావాల్సి ఉంటుందని పేర్కొంది. (దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే)

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు వలస కార్మికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక ‘శ్రామిక రైళ్ల’ను నిర్వహిస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా టిక్కెట్లను ముద్రించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలు  కార్మికుల దగ్గరి నుంచి చార్జీలు వసూలు చేసి తమకు ఇవ్వాలంటూ భారతీయ రైల్వే శాఖ మే రెండవ తేదీన మార్గదర్శకాలను విడుదల చేసింది. రైలు సౌకర్యంలేని ప్రాంతాలకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను కేంద్రం, రాష్ట్రాలకు అప్పగించింది. 

చాలా రాష్ట్రాల్లో వలస కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు మూడవ తేదీ నుంచి పోలీసు స్టేషన్లకు పరుగెత్తారు. అక్కడికెళ్లాకగానీ వారికి ‘మెడికల్‌ సర్టిఫికెట్‌’ తప్పనిసరి అనే విషయం తెలియలేదు. దాంతో వారిలో ఎక్కువ మంది ప్రైవేట్‌ డాక్టర్లను ఆశ్రయించగా వారు మెడికల్‌ సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించారు. కొన్ని చోట్ల పోలీసు స్టేషన్ల వద్దనే డాక్టర్లను ఏర్పాటు చేశారు. అదీ ఒక్క ఆదివారం నాడు మాత్రమే. డాక్టర్లు 350 రూపాయలు తీసుకొని మెడికల్‌ సర్టిఫికెట్లు ఇచ్చారు.  ఇక్కడ కరోనా వైరస్‌ ఉందా.. లేదా అనేది పరీక్షించకుండా కేవలం లక్షణాలు తెలుసుకొని మెడికల్‌ సర్టిఫికెట్లు జారీ చేశారు. (షరతుకు ఒప్పుకుంటేనే తరలిస్తాం!)

కరోనా సోకిన బాధితుల్లో ఐదారు రోజుల వరకు లక్షణాలు బయటపడవని, కొందరిలో 15 రోజులైనా లక్షణాలు బయట పడడం లేదని వైద్యులే తేల్చి చెబుతున్నప్పుడు ఇలాంటి ‘మెడికల్‌ సర్టిఫికెట్స్‌’వల్ల ప్రయోజనం ఏమిటీ? పోలీసు స్టేషన్లలో పేర్లు నమోదు సందర్భంగా కార్మికులెవరూ సామాజిక దూరం పాటించడం లేదు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్న ప్రయోజనం కనిపించడం లేదు. 

శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసిన రేల్వే అధికారులు వలస కార్మికుల సొంత రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఎలా డబ్బులు వసూలు చేయాలో తెలియక నేరుగా వలస కార్మికులకే టిక్కెట్లను విక్రయించింది. డబ్బున్న వారు మాత్రమే వాటిని కొనుగోలు చేయగలిగారు. మే 3వ తేదీ ఆదివారం నాడు మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి యూపీలోని లక్నోకు మూడు శ్రామిక రైళ్లు, ఒక ప్రవేటు బస్సు బయల్దేరాయి. నాసిక్‌ నుంచి ప్రతి రైల్వే ప్రయాణికుడు స్లీపర్‌ చార్జీ అయిన 580 రూపాయలతోపాటు అదనంగా 50 రూపాయల సర్‌చార్జి చెల్లించాల్సి వచ్చింది. ఇక ప్రైవేటు బస్సు మరీ దారుణం. ఒక్కొక్కరి నుంచి నాలుగు వేల రూపాయలను వసూలు చేసింది. ప్రతి మూడు సీట్లలో ఒక్క సీటును సామాజిక దూరం కోసం వదిలేయాల్సి వచ్చింది కనుక అదనపు చార్జీలు వసూలు చేయాల్సి వచ్చిందని ఆ బస్సు యాజమాన్యం మీడియాకు వివరణ ఇచ్చింది. 

వలస కార్మికుల నుంచి చార్జీలు వసూలు చేసిన విషయం తెల్సుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వాటిని తమ పార్టీ భరిస్తుందని ప్రకటించారు. అందుకు స్పందనగా బీజేపీ కేంద్ర నాయకులు 85 శాతం రైల్వే చార్జీలను కేంద్రమే భరిస్తోందని, 15 శాతం చార్జీల భారాన్నే రాష్ట్రాలు మోయాల్సి ఉంటుందన్నారు. పైగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలే వలస కార్మికుల చార్జీలు చెల్లించడం లేదని విమర్శించారు. 85 శాతం రైల్వే చార్జీలను కేంద్రం ఎలా భరిస్తుందని బీజేపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ను మీడియా సంప్రతించగా, వలస కార్మికుల కోసం రైల్వే శాఖ వాస్తవ చార్జీల్లో 57 శాతాన్ని తగ్గించిందని, కార్మికులను దించిన రైళ్లు ఖాళీగా వెనక్కి రావాల్సి ఉంటుందని, దానికి 28 శాతం ఖర్చు అవుతుందని, మొత్తం 85 శాతం నష్టం రైల్వే శాఖ భరించడమంటే కేంద్ర ప్రభుత్వం భరించడేమేని చెప్పారు. (కరోనా చికిత్సలో కొత్త కోణం)

దేశంలో మొట్టమొదటి సారిగా వలస కార్మికుల కోసం తెలంగాణ  ప్రభుత్వం లింగం పల్లి నుంచి జార్ఖండ్‌కు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. కార్మికుల నుంచి చార్జీలు వసూలు చేయలేదు. అలాగే జార్ఖండ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ (బీజేపేతర ప్రభుత్వాలు) రాష్ట్రాలు కార్మికుల రైల్వే చార్జీలను సొంతంగా భరిస్తున్నాయి. అదే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, బీజేపీ రాష్ట్రాల మధ్య నిన్నటి వరకు నడిచి శ్రామిక రైళ్లలో టిక్కెట్‌ చార్జీలను వలస కార్మికుల నుంచే వసూలు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement