ఈపీఎఫ్ కనీస పెన్షన్ వెయ్యి | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్ కనీస పెన్షన్ వెయ్యి

Published Fri, Aug 29 2014 1:49 AM

ఈపీఎఫ్ కనీస పెన్షన్ వెయ్యి

వేతన పరిమితి 15 వేలు
సెప్టెంబర్ 1 నుంచి అమలుకు ప్రభుత్వం నోటిఫికేషన్

 
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పరిధిలోని పెన్షన్ పథకం కింద ఉద్యోగ విరమణ అనంతరం పెన్షనర్లకు చెల్లించే నెలసరి కనీస పెన్షన్‌ను వెయ్యి రూపాయలుగా, సామాజిక భద్రతా పథకాల కింద ఈపీఎఫ్ చందాదారుల వేతన పరిమితిని రూ. 15,000లుగా ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 1వ తేదీనుంచి తాజా నిర్ణయం అమలులోకి వస్తుంది.
 
వెయ్యి రూపాయల కనీస పెన్షన్‌వల్ల దాదాపు 28లక్షలమంది పెన్షనర్లకు తక్షణం ప్రయోజనం కలుగుతుంది. ఈపీఎఫ్‌ఓ చందాదారుడు కావడానికి రూ. 15,000లుగా నిర్ణయించిన వేతన పరిమితివల్ల అదనంగా 50 లక్షల మంది కార్మికులు ఈపీఎఫ్‌ఓ సామాజిక భద్రతా పథకం పరిధిలోకి వస్తారు. 1995వ సంవత్సరపు ఉద్యోగుల పెన్షన్ పథకం నిబంధనల కింద ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
 
ఇక ఉద్యోగుల డిపాజిట్‌తో అనుసంధానించిన బీమా (ఈడీఎల్‌ఐ) పథకం కింద చెల్లించే గరిష్ట మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచినట్టు సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ కేకే జలాన్ చెప్పారు. ఇరవై శాతం అడ్‌హాక్ ప్రయోజనాలతో కలిపితే ఈడీఎల్‌ఐ కింద గరిష్టంగా చెల్లించే బీమా మొత్తం రూ 3.6 లక్షలకు చేరుతుందన్నారు. అంటే, ఈపీఎఫ్‌ఓ చందాదారు ఎవరైనా మరణిస్తే, సదరు చందాదారు కుటుంబానికి గరిష్టంగా రూ.3.6 లక్షలు బీమాగా లభిస్తుందని, ప్రస్తుతం ఈ మొత్తం రూ. 1.56లక్షలు మాత్రమేనని జలాన్ చెప్పారు. ఇప్పటివరకూ రూ.వెయ్యికి లోపు పెన్షన్ పొందేవారికి అక్టోబర్ నుంచి వెయ్యిరూపాయల కనీస పెన్షన్ వర్తిస్తుందన్నారు.

Advertisement
Advertisement