Sakshi News home page

డిప్యూటీ సీఎంగా మీసా భారతి?

Published Tue, Nov 10 2015 8:18 AM

డిప్యూటీ సీఎంగా మీసా భారతి? - Sakshi

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈనెల 20వ తేదీన ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గంలో మూడు పార్టీలు 4:4:2 నిష్పత్తిలో పదవులను పంచుకోవాలని భావిస్తున్నాయి. అయితే, అత్యంత కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని మాత్రం తన కూతురు మీసా భారతికి ఇవ్వాలని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ పట్టుబట్టే అవకాశం ఉంది. నిజానికి ఈ ఎన్నికల్లో లాలు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ మాత్రమే పోటీచేసే విజయం సాధించారు.

మీసాభారతి గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. కానీ ఆమెను శాసన మండలికి పంపించి డిప్యూటీ సీఎం పదవి ఇప్పించాలన్నది లాలు ఆశగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉండి, తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తన పీఏ భోలా యాదవ్ స్థానాన్ని తన కూతురికి కేటాయిస్తారని చెబుతున్నారు. అలాగే కుమారులిద్దరిలో ఒకరికి తప్పనిసరిగా మంత్రిపదవి తీసుకుంటారని అంచనా. అయితే, ఇద్దరిలో ఎవరికి పదవి ఇవ్వాలన్న విషయమై నిర్ణయం తీసుకోవడం మాత్రం లాలుకు కష్టమే. బిహార్ అసెంబ్లీ స్థానాలను బట్టి చూస్తే గరిష్ఠంగా 36 మంది మంత్రులు కేబినెట్‌లో ఉండే అవకాశం ఉంది. కానీ అక్కడ ముందు జాగ్రత్తగా 8-10 స్థానాలను ఖాళీగా ఉంచుకుని, తర్వాత విస్తరించుకోవాలన్నది సీఎం నితీష్ కుమార్ వ్యూహంలా కనిపిస్తోంది.

ఇక అనూహ్యంగా ఈ ఎన్నికల్లో 27 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అధికారాన్ని పంచుకోవాలనే భావిస్తోంది. ఏడు అంశాల కార్యక్రమాన్ని అమలుచేస్తామని తాము బిహార్ ప్రజలకు మాటిచ్చామని, దాన్ని అమలుచేస్తామని బిహార్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి సీపీ జోషి అన్నారు. ఈ పార్టీ నుంచి ప్రధానంగా అశోక్ కుమార్ చౌదరి, సదానంద సింగ్, అవధేష్ కుమార్ సింగ్, షకీల్ అహ్మద్ ఖాన్, మహ్మద్ జావేద్‌లలో కొందరికి మంత్రిపదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement