ఐఎస్ విస్తరణ ఆందోళనకరమే! | Sakshi
Sakshi News home page

ఐఎస్ విస్తరణ ఆందోళనకరమే!

Published Sun, Nov 30 2014 1:30 AM

ఐఎస్ విస్తరణ ఆందోళనకరమే!

డీజీపీల సదస్సులో రాజ్‌నాథ్
పాక్ తన బుద్ధి మార్చుకోవడం లేదు
సదస్సులో గుర్రుపెట్టి బజ్జున్న సీబీఐ చీఫ్

గువాహటి: భారత్‌లో కొందరు యువకులు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ పట్ల ఆకర్షితులవడంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోబోదని స్పష్టంచేశారు. పాకిస్థాన్‌లో అధికారంలో ఉన్నవారు ప్రభుత్వేతర శక్తుల ముసుగులో భారత్‌ను అస్థిరపరిచేందుకు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. శనివారమిక్కడ డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత్‌కు ఏదో ఒక రూపంలో హాని చేయాలన్న బుద్ధిని పాకిస్తాన్ ఇప్పటికీ మార్చుకోలేదన్నారు.

ఐఎస్ మిలిటెంట్ సంస్థ నుంచి ముంబైకి చెందిన ఆరిఫ్ మజీద్ అనే యువకుడు భారత్‌కు తిరిగిరావడాన్ని ప్రస్తావించారు. ‘‘ఈ సంస్థ సిరియా, ఇరాక్‌లకు అవతల పుట్టినా దీని జాడ్యం భారత ఉపఖండానికి విస్తరిస్తోంది. ఆరిఫ్‌ను అరెస్టు చేయడం ఆయనను బాధించడానికి కాదు’ అని చెప్పారు. భారత్‌లోని ముస్లింలు దేశభక్తి కలవారని అన్నారు.

లష్కరే తోయిబా వంటి సంస్థలతో భారత్ భద్రతకు ఎప్పుడూ ముప్పు పొంచే ఉంటుందని ఇంటెలిజెన్స్ విభాగం డెరైక్టర్ ఆసిఫ్ ఇబ్రహీం అన్నారు. కాకాగా దేశభద్రత, ఉగ్రవాదం వంటి  కీలక అంశాలపై చర్చ జరుగుతుండగా ఈ సదస్సుకు హాజరైన సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా మాత్రం ఇవేవీ పట్టనట్టు హాయిగా కునుకేశారు! రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతుండగా.. ఆయన గుర్రుపెట్టి నిద్రపోవడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement