జై జపాన్‌-జై ఇండియా | Sakshi
Sakshi News home page

జై జపాన్‌-జై ఇండియా

Published Thu, Sep 14 2017 11:15 AM

జై జపాన్‌-జై ఇండియా - Sakshi

  • మేకింగ్ ఇండియాకు కట్టుబడి ఉన్నాం
  • బుల్లెట్‌ రైలు శంకుస్థాపనలో జపాన్‌ ప్రధాని షింజో అబే
  • రాబోయే రోజులు హైస్పీడ్‌ కారిడార్‌లవే
  • జపాన్ మనకు నిజ స్నేహితుడు
  • అబేకు కృతజ్ఞతలు తెలియజేసిన మోదీ
 
 
సాక్షి, అహ్మదాబాద్‌: భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపు ఉన్న నేత అని, అందుకే మేకింగ్‌ ఇండియా కలను సార్థకం చేసుకునేందుకు జపాన్‌ లాంటి దేశాన్ని భాగస్వామిగా ఎంచుకున్నారని జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే తెలిపారు. గురువారం ఉదయం సబర్మతిలో ప్రతిష్టాత్మక ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించగా, అనంతరం అబే ప్రసంగించారు. 
 
నమస్కారం అంటూ తన ప్రసంగం మొదలుపెట్టిన అబే.. భారత్‌ తో జపాన్‌ అనుబంధం ప్రత్యేకమైనదన్న ఆయన మేకింగ్ ఇండియాకు కట్టుబడి ఉన్న దేశం జపానేనని తెలిపారు. భారత్‌-జపాన్‌ల చేతులు కలిస్తే అన్ని సుసాధ్యాలే అని చెప్పిన అబే.. జై జపాన్‌-జై ఇండియా నినాదంతో ఇరు దేశాలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.  తన తదుపరి పర్యటనలో మళ్లీ ఇక్కడికి వస్తే మోదీతో కలిసి షింకసెన్‌(బుల్లెట్‌ ట్రైన్‌) లో కలిసి ప్రయాణించాలనుకుంటున్నానని షింజో అబే ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా భారత్‌ తో మరిన్ని వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకుంటామని ఆయన ప్రకటించారు.
 
 
 
ఇక ఏ దేశ అభివృద్ధికైనా రవాణా వ్యవస్థే ప్రాథమిక అవసరమని భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బుల్లెట్‌ ప్రాజెక్టును ఉద్దేశిస్తూ... తర్వాతి తరాలు హై స్పీడ్‌ కారిడార్‌లతోనే వృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. సాంకేతికతతో పేదలకు సాధికారత ప్రయత్నిస్తే పేదరికంపై విజయం సాధించినట్లేనని మోదీ పేర్కొన్నారు. మన రైల్వే సంస్థ చాలా పెద్దదని పేర్కొన్న మోదీ.. ఒక వారం రైళ్లలో ప్రయాణించే మన దేశ ప్రజల సంఖ్య.. జపాన్‌ మొత్తం జనాభాకు సమానమని చెప్పుకొచ్చారు. సగటు భారతీయుడికి మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకురావటమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా వేగవంతమైన రవాణా వ్యవస్థను నెలకొల్పటంతోపాటు ఉద్యోగాల కల్పన ఆస్కారం లభించదన్నారు. కాలుష్య రహితం అయిన ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు మన జీవితాలలో కీలకంగా మారబోతుందని అభిప్రాయపడ్డారు. 
 
‘88,000 కోట్లను కేవలం 0.1 శాతం వడ్డీకే జపాన్‌ భారత్‌ కు ఇచ్చిందని, కీలకమైన మెట్రో ప్రాజెక్టు కోసం ఆర్థిక సాయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించేందుకు ముందుకు వచ్చిందని, అందుకే జపాన్‌ భారత్‌కు ఓ నిజమైన ఆత్మీయ దేశమని మోదీ చెప్పుకొచ్చారు.  2022-23 కల్లా మెట్రో రైలు ప్రారంభం అవుతుందన్న ఆకాంక్షను ప్రధాని వ్యక్తం చేశారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అవాంతరాలు ఉండబోవని ప్రకటించిన జపాన్‌ ప్రధాని షింజో అబేకు.. మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.

Advertisement
Advertisement