మథురలో మోదీ ప్రచారంతో ముప్పు | Sakshi
Sakshi News home page

మథురలో మోదీ ప్రచారంతో ముప్పు

Published Fri, May 29 2015 2:09 AM

మథురలో మోదీ ప్రచారంతో ముప్పు - Sakshi

సీపీఎం పార్టీ పత్రికలో ఏచూరి ఆరోపణలు
 
న్యూఢిల్లీ: ఎన్డీయే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రచార కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌లోని మథురను ఎంచుకోవడాన్ని సీపీఎం తీవ్రంగా తప్పుబట్టింది. అది ప్రధాని అమాయకత్వం కాదని, దానివల్ల దేశవ్యాప్తంగా మతకల్లోలాలకు దారితీసే ప్రమాదముందని ఆరోపించింది. రామజన్మభూమి(అయోధ్య), కృష్ణ జన్మస్థాన్(మథుర), కాశీ విశ్వనాథ్ ఆలయం(బెనారస్)లకు స్వేచ్ఛ కల్పిస్తామని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఎప్పటినుంచో చెబుతున్న విషయాన్ని సీపీఎం గుర్తు చేసింది.

అందుకు తగినట్లే మథురలో మోదీకి స్థానిక ఎంపీ హేమమాలిని కృష్ణుడి విగ్రహాన్ని బహూకరించడం గమనార్హమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన మోదీ అందులో వారణాసి నుంచే ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకోవడం, ఇప్పుడు ఏడాది పాలనపై మథురలో ప్రచారాన్ని ప్రారంభించడం ప్రమాదకర సంకేతాలనిస్తున్నాయని పార్టీ పత్రిక ‘పీపుల్స్ డెమోక్రసీ’లో ఆయన ఓ కథనం రాశారు. అన్ని రకాల మీడియాలో భారీగా రంగురంగుల ప్రకటనలు వస్తున్నాయని, మీడియా మొత్తం కార్పోరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లడం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.
 
 

Advertisement
Advertisement