థాంక్యూ అమెరికా! | Sakshi
Sakshi News home page

థాంక్యూ అమెరికా!

Published Thu, Oct 2 2014 1:55 AM

థాంక్యూ అమెరికా! - Sakshi

భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
యూఎస్ పర్యటన విజయవంతంగా, సంతృప్తికరంగా ముగిసిందన్న ప్రధాని
కీలకాంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయన్న యూఎస్ మీడియా

 
వాషింగ్టన్/న్యూఢిల్లీ: ‘థాంక్యూ అమెరికా’ అంటూ భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనను ముగించారు. ఐదు రోజుల పాటు ఊపిరి సలపని స్థాయిలో వరుస కార్యక్రమాలతో యూఎస్‌లో బిజీగా గడిపిన ప్రధాని బుధవారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ సహా కొందరు మంత్రివర్గ సహచరులు స్వాగతం పలికారు. అంతకుముందు వాషింగ్టన్‌లోని ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి ‘ఎయిర్ ఇండియా వన్’ ప్రత్యేక విమానంలో భారత్ తిరుగు ప్రయాణమైన మోదీకి అమెరికాలో భారత్ రాయబారి జైశంకర్, అమెరికా విదేశాంగ సహాయమంత్రి నిశాదేశాయి బిస్వాల్‌లు వీడ్కోలు పలికారు.

అమెరికా పర్యటన విజయవంతంగా, సంతృప్తికరంగా సాగిందని మోదీ ప్రకటించారు. తన పర్యటన ద్వారా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో వ్యక్తిగత సంబంధాలను, అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను మోదీ మెరుగుపర్చుకోగలిగారని యూఎస్‌లోని విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యూహా త్మక ద్వైపాక్షిక సంబంధాలను, అంతర్జాతీయ అంశాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా జరిగిన చర్చల అనంతరం మోదీ, ఒబామాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. భారతదేశాన్ని తన శక్తి సామర్థ్యాలు, నిబద్ధతతో సమూలంగా మార్చగల నేతగా వ్యాపార, వాణిజ్య వర్గాల్లో ఇమేజ్ సాధించిన మోదీ.. అందుకు రైల్వేలు, రక్షణ ఉత్పత్తులు సహా అన్ని రంగాల్లో పెట్టుబడులు, సహకారం కావాలని వారిని కోరారు. భారత్ బయల్దేరే ముందు ‘యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్‌ఐబీసీ)’ సమావేశంలో మాట్లాడుతూ.. సమయం మించిపోకముందే భారత్‌లోకి విస్తరించాలని పారిశ్రామికవేత్తలకు మోదీ విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రభుత్వపరమైన నిబంధనలను సులభతరం చేసే ప్రక్రియను వచ్చే 6 నెలల్లో పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు.    ఈ ఇద్దరు నేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ‘డిజిటల్ ఇండియా కార్యక్రమంలో అమెరికా భాగస్వామిగా ఉంటుంది’ అని పేర్కొన్న విషయం గమనార్హం. ‘ఈ గవర్నెన్స్’లో తనకు, ఒబామాకు.. ఇద్దరికీ ఆసక్తి ఎక్కువేనని మోదీ అన్నారు. దీనిపై తమ భేటీలో లోతుగా చర్చించామన్నారు.  కేంద్ర గుర్తింపు పొందిన భారతీయ యూనివర్సిటీల్లో బోధించేందుకు ప్రతీ సంవత్సరం వెయ్యిమంది ప్రఖ్యాత అమెరికన్ విద్యావేత్తలను ఆహ్వానించాలన్న ప్రతిపాదన ఉన్న ‘గ్లోబల్ ఇనీషియేటివ్ ఆఫ్ అకడమిక్ నెట్‌వర్క్స్’ను ఒబామా స్వాగతించారన్నారు. వచ్చే మూడేళ్లలో భారత్‌లో 41 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి వీలైన రంగాలను గుర్తించామని ఈ సందర్భంగా యూఎస్‌ఐబీసీ మోదీకి వెల్లడించింది.   

పర్యటన ప్రయోజనాలు: రక్షణ సహకార ఒప్పందాన్ని మరో పదేళ్ల పాటు పొడిగించడం, తీరప్రాంత రక్షణలో సహకారానికి సంబంధించిన ఒప్పందం, భద్రత, ఉన్నతస్థాయి సాంకేతికత, అంతరిక్షం, ఆరోగ్యం.. తదితర రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలు ఈ పర్యటన సాధించిన విజయాలుగా చెప్పవచ్చు. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం, అతడి వ్యాపార సామ్రాజ్యాన్ని నాశనం చేయడాన్ని భారత్, అమెరికాలు ఇకపై సంయుక్తంగా లక్ష్యంగా చేసుకుంటాయి. ఉగ్రవాద సంస్థలకు సురక్షిత స్థావరాలుగా నిలుస్తున్న వాటిని నాశనం చేయాలని మోదీ పర్యటనలో ఇరుదేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. డీ కంపెనీ, అల్‌కాయిదా, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హఖ్కానీ గ్రూప్.. తదితర ఉగ్రవాద సంస్థలకు అందుతున్న ఆర్థిక, వ్యూహాత్మక సహకారాన్ని అడ్డుకునేందుకు సంయుక్తంగా కృషిచేయాలని మోదీ, ఒబామాల భేటీలో నిర్ణయించారు.  దక్షిణ, పశ్చిమాసియాల్లోని ఉగ్రవాదంపై కూడా ఇరుదేశాల నేతలు చర్చించారు. అయితే, ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై దాడుల కోసం ఏర్పాటు చేస్తున్న సంకీర్ణంలో చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసింది.

అణు సరఫరా బృందంలో భారత్! :అణు సరఫరా బృందం(ఎన్‌ఎస్‌జీ)లో చేరాలన్న భారత్ ప్రయత్నాలకు అమెరికా మద్దతు ప్రకటించింది. అలాగే, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రీజైమ్‌లో చేరేందుకు అవసరమైన అర్హతలు కూడా భారత్‌కు ఉన్నాయని ఒబామా స్పష్టం చేశారు.
 మానవహక్కుల అంశం: మానవ హక్కులు, సమ్మిళిత పరిపాలన అంశాలు మోదీ, ఒబామాల మధ్య భేటీలో చర్చకు వచ్చాయని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జోస్ ఎర్నెస్ట్ వెల్లడించారు. అయితే, ఇరుదేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో మాత్రం ఆ ప్రస్తావన లేకపోవటం గమనార్హం.
 
భారత్ 220వోల్ట్స్.. అమెరికా 120వోల్ట్స్

 
 భారత, అమెరికా సంబంధాలను ‘220 వోల్ట్స్, 120 వోల్ట్స్’గా మోదీ అభివర్ణించారు. ‘భారత్‌లో 220 వోల్ట్స్ వ్యవస్థను, యూఎస్‌లో 120 వోల్ట్స్ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఈ రెండిటి శక్తిలో తేడా ఉంది. ఆ తేడాను సరిచేసి కలసి పనిచేసేందుకు చర్యలు చేపట్టాల’ంటూ భారత్, అమెరికా ల మధ్య తేడాలను ప్రస్తావిస్తూ తన గౌరవార్ధం యూఎస్ ఉపాధ్యక్షుడు జో బెడైన్ ఇచ్చిన విందులో మోదీ అన్నారు.
 
ప్రచారార్భాటమే.. ఫలితాలు నిల్!
 
మోదీ అమెరికా పర్యటన నిరుత్సాహపరిచిందని కాంగ్రెస్ విమర్శించింది. ‘భారత్ నుంచి తీసుకెళ్లిన చీర్‌లీడర్ల సాయంతో ఆర్భాటంగా ప్రచారం చేశారు. కానీ ఫలితాలు చూస్తే నిరుత్సాహకరంగా ఉన్నాయి’ అని పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. విదేశీ గడ్డపై గత ప్రభుత్వాన్ని విమర్శించి ప్రధాని పదవి ప్రతిష్టను మోదీ దిగజార్చారని ఆరోపించారు.     
 

Advertisement

తప్పక చదవండి

Advertisement