Sakshi News home page

జవాన్ల త్యాగాలు వృథా కానివ్వం

Published Sun, Sep 25 2016 3:08 AM

కోజికోడ్‌లో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న మోదీ, అమిత్ షా - Sakshi

ఉడీ దాడిపై పాకిస్తాన్‌కు మోదీ హెచ్చరిక
ఆసియాలో రక్తపాతానికి పాక్ కుట్ర..
ప్రపంచమంతా ఉగ్రవాద వ్యాప్తే లక్ష్యం
కోజికోడ్ బీజేపీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం

కోజికోడ్: ఉడీ ఉగ్రదాడిని భారత్ ఎన్నటికీ మరచిపోదని, 18 మంది జవాన్ల త్యాగాల్ని వృథా కానివ్వమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాద ఎగుమతి, అమాయక ప్రజల్ని చంపడం వంటి పాక్ దురాగతాల్ని అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలు చేసి... ఆ దేశాన్ని ఒంటరిని చేసేలా దౌత్యదాడిని తీవ్రం చేస్తామన్నారు. ఆయన కేరళలోని కోజికోడ్‌లో శనివారం బీజేపీ జాతీయ మండలి సమావేశం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ పాక్‌ను పదునైన విమర్శలతో ఎండగట్టారు. ఆసియాలో రక్తపాతం సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నుతోందని విమర్శించారు. 

ఉగ్రవాదులు మానవత్వానికి శత్రువులని, ప్రపంచవ్యాప్తంగా మానవతావాదులు ఏకమై ఉగ్రవాదాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. ‘భారత్ ఎప్పుడూ ఉగ్రవాదానికి తలొగ్గలేదు. భవిష్యత్తులోనూ అలా జరగదు. ఉగ్రవాదాన్ని ఓడించే  లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఉడీ దాడిని భారత్ ఎన్నటికీ మరచిపోదన్న సంగతి ఉగ్రవాదులు జాగ్రత్తగా వినాలి. 18 మంది జవాన్ల త్యాగం వృథా కాదని పాక్ నేతలకు చెప్పాలనుకుంటున్నా’ అని ఉద్వేగంతో అన్నారు. ఉడీ దాడి తర్వాత తొలిసారి బహిరంగంగా స్పందించిన మోదీ... దాడికి పాక్ ప్రత్యక్ష బాధ్యురాలిగా పేర్కొన్నారు. ఆ దేశం ఎగుమతి చేస్తున్న ఉగ్రవాదం వల్లే  సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చిందన్నారు.

  21వ శతాబ్ది తమ పరమయ్యేలా ఆసియా దేశాలు కృషిచేస్తుంటే పాక్ మాత్రం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, అమాయకుల్ని పొట్టన పెట్టుకుంటూ రక్తపాతం సృష్టించే పనిలో నిమగ్నమైందన్నారు. ‘ఉగ్రవాద వ్యాప్తే ఆసియాలోని ఓ దేశం లక్ష్యం. 21వ శతాబ్ది ఆసియా పరం కాకుండా అది పనిచేస్తోంది. ప్రస్తుత ఉగ్రవాదానికి ఆ దేశానిదే బాధ్యతని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఆసియాలోని ఆ ఒకేఒక్క దేశం ఉగ్రవాదులకు స్వర్గంలా మారింది. ప్రపంచమంతా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది.

అఫ్గానిస్తాన్ , బంగ్లాదేశ్, లేదా ఇతర దేశాల్లో ఎక్కడ ఉగ్రదాడి వార్తలు చదివినా ఉగ్రవాదులు ఆ దేశం నుంచే వచ్చినవారై ఉంటారు లేదా లాడెన్‌లా దాడి అనంతరం అక్కడ స్థిరపడతారు. పాక్ ప్రోత్సాహంతో సాగిన 17 ఉగ్ర దాడుల్ని మన సైనికులు తిప్పికొట్టడం, 110 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం గత కొద్ది ఏళ్లలోనే అత్యధికం’ అని మోదీ చెప్పారు. భారత్ భద్రంగా ఉందంటూ హామీనిచ్చిన మోదీ... సైనికులు, భద్రతా సిబ్బంది ధైర్య సాహసాల పట్ల 125 కోట్ల మంది గర్వంగా ఉన్నారన్నారు.

దీన్ దయాళ్ ఆశయ సాధనకు కృషి
జన్‌సంఘ్ స్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశించిన పేదరికం లేని, శాంతియుత భారత్ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పేర్కొన్నారు.  ‘యాభై ఏళ్ల క్రితం ఉపాధ్యాయ ఇక్కడే భారతీయ జన్‌సంఘ్‌కు అధ్యక్షుడయ్యారు. ఈ యాభై ఏళ్లలో బీజేపీ గొప్ప పార్టీగా అవతరించింది. సంఘ్ సభ్యుడిగా ఉన్నప్పుడు కేరళలో పర్యటించాను. ఆ రోజుల్లో బీజేపీకి అధికారం చాలా దూరంగా ఉండేది. ఇప్పటికీ వారికి అధికారం లేదు. అయినా  కార్యకర్తలు నిరాశపడలేదు. వారి ప్రాణత్యాగాలు ఇతర త్యాగాలు చాలా గొప్పవి. మీ త్యాగాలు ఎప్పటికీ వృథా కావని కేరళ బీజేపీ కార్యకర్తలకు చెప్పాలనుకుంటున్నాను. భవిష్యత్తులో కేరళలో మార్పు వస్తుంది. ఆ భవిష్యత్తును ఇప్పుడు చూస్తున్నాను’ అని మోదీ అన్నారు.

పని పట్ల కేరళీయుల్లో నిజాయతీ
దేశంలో తొలి స్థానంలో నిలిచేందుకు కేరళకు సామర్థ్యం ఉందని, దాన్ని సాధించేందుకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మోదీ హామీనిచ్చారు. ‘కేరళీయులు పని విషయంలో ఎం తో నిబద్ధతతో ఉంటారు. ఇటీవల గల్ఫ్ దేశాల్లో ప ర్యటించాను. అలాంటి పర్యటనల్లో దేశాధినేతలతో చర్చలు సాధారణం. నేను మాత్రం గల్ఫ్‌లోని కేరళ ప్రజల్ని కలుసుకోవాలని కోరాను. కేరళ సోదరులు నిజాయతీగా, క్రమశిక్షణతో పనిచేస్తారని ఆ దేశాధినేతలూ చెప్పారు’ అని మోదీ పేర్కొన్నారు.

భారత్‌లో సాఫ్ట్‌వేర్.. పాక్‌లో ఉగ్రవాదం
పాక్‌కు ధైర్యముంటే పేదరికం, నిరుద్యోగం నిర్మూలనతో భారత్‌తో పోటీపడాలని మోదీ సవాల్ విసిరారు. ‘ఉగ్రవాదులు రాసిచ్చిన అంశాల్ని చదువుతున్న పక్క దేశ నేతలు ... కశ్మీర్ పాట పాడుతున్నారు. నేను ఇక్కడి నుంచి పాక్ ప్రజలతో మాట్లాడాలని అనుకుంటున్నా. 1947కి పూర్వం... మీ పూర్వికులు ఈ నేలకు ప్రణమిల్లిన విషయాన్ని గుర్తుచేయాలనుకుంటున్నా. పీవోకే, బంగ్లాదేశ్, పఖ్తూనిస్తాన్, గిల్గిత్, బలూచిస్తాన్ సమస్యల్ని ఎందుకు పరిష్కరించలేదో మీ నేతల్ని అడగండి.

రెండు దేశాలు కలసి ఒకేసారి స్వాతంత్య్రం సాధించగా... భారత్ సాఫ్ట్‌వేర్ ఎగుమతులు చేస్తుంటే, పాక్ ఉగ్రవాదాన్ని ఎందుకు ఎగుమతి చేస్తుందో మీ నేతల్ని ప్రశ్నించండి. వెయ్యేళ్ల పాటు భారత్‌తో పోరాటం చేస్తామని పాక్ నేతలు చెబుతున్నారు. అయితే వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ప్రశ్నించుకోవాలి. వారి సవాల్ని అంగీకరిస్తున్నా..  పాక్‌తో పోరుకు భారత్ సిద్ధంగా ఉంది. మీకు ధైర్యముంటే పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యతలు అంతమయ్యేలా ఎందుకు పోరాటం చేయరు. చూద్దాం భారత్ గెలుస్తుందో, పాక్ గెలుస్తుందో’ అని మోదీ అన్నారు.

Advertisement
Advertisement