కొత్త గొడవ మొదలైంది.. | Sakshi
Sakshi News home page

కొత్త గొడవ మొదలైంది..

Published Thu, Dec 28 2017 2:27 AM

MoS Anantha Kumar Hegde says secular people don't know their own parentage, claims Constitution will be changed - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు కార్యకలాపాలను దాదాపు రెండు వారాల పాటు అడ్డుకున్న ప్రధాని మోదీ వ్యాఖ్యల వివాదం ముగిసింది. కానీ తాజాగా, లౌకికవాదులపై కేంద్రమంత్రి అనంతకుమార్‌ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరో దుమారం పార్లమెంటును కుదిపేసింది. మాజీ ప్రధాని మన్మోహన్‌పై ప్రధాని మోదీకి అపార గౌరవం ఉందని, ఆయనను అవమానించేలా వ్యాఖ్యానించలేదని రాజ్యసభలో ఆర్థికమంత్రి జైట్లీ వివరణ ఇవ్వడంతో మోదీ వ్యాఖ్యల వివాదం ముగిసింది.

గుజరాత్‌లో బీజేపీ ఓటమికి పాక్‌తో కలిసి మన్మోహన్‌ కుట్రపన్నారంటూ గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించిన విషయం తెల్సిందే. పితృత్వ మూలాలు తెలియనివారే లౌకికవాదులమని చెప్పుకుంటారని, లౌకికతకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేస్తామని ఇటీవల అనంత్‌కుమార్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బుధవారం పార్లమెంటు ఉభయసభలు దద్ధరిల్లాయి. విపక్షాల నిరసనలతో ఉభయసభలూ పలుమార్లు వాయిదా పడ్డాయి. హెగ్డే వ్యాఖ్యలను సమర్ధించబోమని ప్రభుత్వం వివరణ ఇచ్చినా విపక్షం శాంతించలేదు.

లోక్‌సభలో..
లోక్‌సభ ఉదయం సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. మంత్రి హెగ్డేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో స్పీకర్‌ 11గంటలకు, పరిస్థితిలో మా ర్పులేక పోవటంతో 12 గంటలకు, మళ్లీ 2.45 గంటలకు వాయిదా వేశారు. 4గంటలకు సమావేశం కాగా నినాదాలు హోరెత్తటంతో 15 నిమిషాలపాటు వాయిదావేశారు. తిరిగి సమావేశమైనా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో గురువారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలో..
ఉదయం రాజ్యసభ ప్రారంభంకాగానే ప్రతిపక్షాలు హెగ్డే వ్యాఖ్యలను ప్రస్తావించాయి. సభలో చర్చించాలని పట్టుబట్టాయి. సరైన నోటీసు లేకుండా చర్చించటం కుదరదని చైర్మన్‌ వెంకయ్య స్పష్టం చేశారు. గందరగోళం కొనసాగటంతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వా తా ఇదే పరిస్థితి కొనసాగటంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగోయెల్‌ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం..హెగ్డే అభిప్రాయాన్ని ప్రభుత్వం అంగీకరించబోద’ని ప్రకటించారు. అయినప్పటికీ కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ తదితర పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. రాజ్యాంగంపై నమ్మకం లేని వ్యక్తికి మంత్రిగా, పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని ఆజాద్‌ అన్నారు. సభ సద్దుమణగక పోవటంతో చైర్మన్‌ వెంకయ్య సభను మధ్యాహ్నం రెండుగంటలకు వాయిదా వేశారు.

ఇతర ముఖ్యాంశాలు..
► పాస్‌పోర్టు జారీ సమయంలో ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్‌ విధానానికి మినహాయింపు ఇస్తూ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ లోక్‌సభలో తెలిపారు.

► సైనిక దళాలకు సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా మారిందని లోక్‌సభలో రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. త్రివిధ దళాలకు కలిపి సుమారు 60వేల పోస్టులు ఖాళీగా ఉండగా సైన్యంలోనే అత్యధికంగా 27వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు.


మన్మోహన్‌ అంటే మాకు అపారగౌరవం
మన్మోహన్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో జైట్లీ వివరణ ఇచ్చారు..‘ మన్మోహన్, మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీలకు దేశం పట్ల ఉన్న నిబద్ధతను ప్రసంగాల్లో గానీ, ప్రకటనల ద్వారా గానీ  మోదీ శంకించలేదు. ప్రధాని చేసిన ప్రకటనలన్నీ ఎన్నికల సభల్లోనివే. మిగతా పార్టీలూ ఆరోపణలు చేశాయి. మన్మోహన్‌ను ప్రధాని విమర్శించారని ఎవరైనా అనుకుంటే అది కేవలం అవగాహన లోçపమే ’అని అన్నారు. దీనిపై కాంగ్రెస్‌ నేత ఆజాద్‌ స్పందించారు. జైట్లీ వివరణకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీ నేతలూ ప్రధాని పదవి గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడబోరన్నారు. ప్రధానమంత్రిని ‘నీచ్‌ ఆద్మీ’ అంటూ సంబోధించిన మణిశంకర్‌ అయ్యర్‌ను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ఈ వివాదానికి ముగింపు పలికిన అధికార, ప్రతిపక్ష నేతలకు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement