హోదా హామీ అమలుచేయండి | Sakshi
Sakshi News home page

హోదా హామీ అమలుచేయండి

Published Tue, Feb 7 2017 2:38 AM

హోదా హామీ అమలుచేయండి - Sakshi

ధన్యవాద తీర్మానంపై చర్చలో మేకపాటి

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా హామీని అమలు చేసి, ఫిరాయింపుల చట్టాన్ని సవరించి పార్లమెంటుపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రపతి తన ప్రసంగంలో చేసిన ఒక వ్యాఖ్యను ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఈ దేశ పౌరులు, ముఖ్యంగా పేదలు ఈ పవిత్ర పార్లమెంటుపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం.

ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో మన ప్రతి చర్య కూడా ఈ దేశం నిర్మితమైన త్యాగాల కోవలో ఉండాలి అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నదేంటి? ఫిరాయింపుల వ్యతిరేక చట్టం గతి ఎలా ఉంది? చట్టసభల సభ్యులు పార్టీ ఫిరాయిస్తే వారి సభ్యత్వం కోల్పోతారని రాజ్యాంగ సవరణ ద్వారా మనం చట్టం చేసుకున్నాం. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి గెలిచి బహిరంగంగా టీడీపీలో చేరారు. పదో షెడ్యూలులోని నిబంధనల ప్రకారం మా పార్టీ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ సభాపతి ఎలాంటి చర్య తీసుకోలేదు’’ అని మేకపాటి ప్రశ్నించారు.

Advertisement
Advertisement