ముండే, గడ్కరీల శత్రుబంధం | Sakshi
Sakshi News home page

ముండే, గడ్కరీల శత్రుబంధం

Published Tue, Jun 3 2014 10:45 AM

ముండే, గడ్కరీల శత్రుబంధం - Sakshi

గోపీనాథ్ ముండేకి నితిన్ గడ్కరీ కి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువ. కానీ చివరికి గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డప్పుడు అందరికన్నా ముందు ఆయన వద్దకు చేరుకున్నది నితిన్ గడ్కరీయే. అంతే కాదు. ఆయన తరఫున ఆస్పత్రిలో పెద్ద దిక్కుగా నిలుచున్నది, కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియచేసి ఓదార్చింది, ఆ తరువాత ఆయన అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది నితిన్ గడ్కరీయే. దీన్నే శత్రు బంధం అంటారేమో మరి!
 
గడ్కరీ, ముండేల వైరం ఈ నాటిది కాదు. గడ్కరీ పార్టీ సంస్థాగతంగా ఎదుగుతూ వస్తే, ముండే ప్రజాదరణలో ఎప్పుడూ పైచేయిగా ఉండేవారు. గడ్కరీ నాగపూర్ కి చెందినవారు కాగా ముండే బీడ్ జిల్లాకు చెందిన వారు. కనీసం రెండు సందర్భాల్లో గడ్కరీపై కోపంతో ముండే బిజెపికి రాజీనామా చేసేంత వరకూ వెళ్లారు. ఒక సారి రాజీనామా పత్రం కూడా ఇచ్చారు. ఈ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర టికెట్ల పంపిణీ విషయంలోనూ గడ్కరీకి, ముండేకి తీవ్ర విభేదాలు వచ్చాయి. ఒక సందర్భంలో తాను కాంగ్రెస్ లో చేరతానని ముండే బెదిరించారు కూడా. 
 
ముండే శరద్ పవార్ ను శత్రువుగా భావిస్తే, గడ్కరీ ఆయనను చేరదీసేందుకు ప్రయత్నించారు. రాజ్ ఠాక్రే ఎందుకూ పనికిరాని వాడని, ఆయన ఛాప్టర్ క్లోజ్ అని ముండే అంటే రాజ్ ను నరేంద్ర మోడీ దగ్గరకు తీసుకువెళ్లి, బిజెపిపై పోటీ చేయబోమని చెప్పించారు గడ్కరీ. 
అయితే విధానాల విషయంలోనే వివాదాలు, విభేదాలు తప్ప, సిద్ధాంతపరంగా ఇద్దరిదీ ఒకే దారి కావడం వల్లే తీవ్ర వైరం ఉన్నా ఇద్దరూ కలిసి పనిచేశారు. వారిద్దరి మధ్య శత్రుబంధం అలాగే కొనసాగింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement